Share News

ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో సల్ఫర్‌ యూరియా ప్లాంట్‌

ABN , Publish Date - Feb 23 , 2025 | 12:34 AM

రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌)లో కొత్తగా సల్ఫర్‌ కోటెడ్‌ యూరియాను తయారు చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రోజుకు 3850టన్నుల సామర్థ్యంతో నీమ్‌ కోటెడ్‌ యూరియాను ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ఉత్పత్తి చేస్తుంది.

ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో సల్ఫర్‌ యూరియా ప్లాంట్‌

కోల్‌సిటీ, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌)లో కొత్తగా సల్ఫర్‌ కోటెడ్‌ యూరియాను తయారు చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రోజుకు 3850టన్నుల సామర్థ్యంతో నీమ్‌ కోటెడ్‌ యూరియాను ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ఉత్పత్తి చేస్తుంది. ఆత్మనిర్భర్‌లో భాగంగా కేంద్రం మూసివేతకు గురైన ఎరువుల కర్మాగారాలను పునరుద్ధరించింది. ఇందు కోసం కొత్తగా న్యూ ఇండస్ర్టియల్‌ పాలసీ(ఎన్‌ఐపీ) పేర రాయితీలు కూడా ఇచ్చింది. విదేశాల నుంచి యూరియా దిగుమతులను తగ్గించుకునేందుకు ప్లాంట్లను పునరుద్ధరించిన కేంద్రం వేపనూనె పూతతో నీమ్‌ కోటెడ్‌ యూరియాను ఉత్పత్తి చేస్తోంది. వంట నూనెకు సంబంధించి దిగుమతిని తగ్గించేందుకు ఆయిల్‌ పామ్‌ సాగును దేశ వ్యాప్తంగా కేంద్రం ప్రోత్సహిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయిల్‌ పామ్‌ సాగు, ప్రాసెసింగ్‌ యూనిట్లకు ప్రత్యేకంగా పాలసీని తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో ఆయిల్‌పామ్‌ సాగు చేస్తున్న రైతులకు అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం రామగుండం ఫెర్టిలైజర్స్‌ యూనిట్‌లో సల్ఫర్‌ కోటెడ్‌ యూరియాను ఉత్పత్తి చేయనుంది. ఇందుకు రూ.150కోట్లతో రోజుకు 200టన్నుల యూరియాను ఉత్పత్తి చేయాలని ప్రణాళికలు తయారు చేయగా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న ప్లాంట్‌లో వేప నూనె పూతకు అదనంగా సల్ఫర్‌ కోటెడ్‌ యూరియా తయారీకి యంత్రాలు, ప్లాంట్‌ను నెలకొల్పనున్నారు. ఆయిల్‌పామ్‌ సాగులో సల్ఫర్‌ కోటెడ్‌ యూరియాను వాడడం వల్ల సల్ఫర్‌, నైట్రోజెన్‌లు మొక్కలకు నెమ్మదిగా అందుతాయి. తద్వారా అవి తక్కువ యూరియాతో ఏపుగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. సౌడు భూముల్లో సైతం సాగు చేస్తున్న ఆయిల్‌పామ్‌ సల్ఫర్‌ కోటెడ్‌ యూరియా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నుంచి తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు ఆయిల్‌పామ్‌ రైతాంగానికి ఈ యూరియాను అందించనున్నారు.

Updated Date - Feb 23 , 2025 | 12:34 AM