Share News

ఆధునిక విద్యపై విద్యార్థులు ఆసక్తి చూపాలి

ABN , Publish Date - Sep 12 , 2025 | 12:07 AM

మంథని నియోజకవర్గంలో విద్యారంగం సమగ్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. మండల పరిషత్‌ బాలికల పాఠశాలలో మంచు లక్ష్మి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో టీచ్‌ఫర్‌ చేంజ్‌లో భాగంగా ఏర్పాటు చేసిన డిజిటల్‌ క్లాస్‌ రూంను సినిమా ఆర్టిస్ట్‌ మంచు లక్ష్మితో కలిసి మంత్రి శ్రీధర్‌బాబు గురువారం ప్రారంభించారు.

ఆధునిక విద్యపై విద్యార్థులు ఆసక్తి చూపాలి

మంథని, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): మంథని నియోజకవర్గంలో విద్యారంగం సమగ్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. మండల పరిషత్‌ బాలికల పాఠశాలలో మంచు లక్ష్మి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో టీచ్‌ఫర్‌ చేంజ్‌లో భాగంగా ఏర్పాటు చేసిన డిజిటల్‌ క్లాస్‌ రూంను సినిమా ఆర్టిస్ట్‌ మంచు లక్ష్మితో కలిసి మంత్రి శ్రీధర్‌బాబు గురువారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన విద్య అందాలని టీచ్‌ఫర్‌ చేంజ్‌ ద్వారా సేవలందిస్తున్న మంచు లక్ష్మి, సంస్థ ప్రతినిధులను అభినందించారు. విద్య, వైద్య రంగాల్లో స్పష్టమైన మార్పు తీసుకురావాలని ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మంథని నియోజకవర్గ పరిధిలో ఆరు ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ క్లాస్‌ రూంల ఏర్పాటుకు మందుకు వచ్చిన టీచ్‌ఫర్‌ చేంజ్‌ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. డిజిటల్‌ క్లాస్‌ రూంల ఏర్పాటుతోపాటు విద్యార్థుల వ్యక్తిగత అభివృద్ధికి తోడ్పాటు అందించడంలో సంస్థ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. విద్యా రంగంలో అభివృద్ధి కోసం ప్రభుత్వం తోపాటు స్వచ్ఛంద సంస్థలు సహకరించడం సంతోషకరమన్నారు. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తామన్నారు. ఆధునిక విద్యను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ క్లాస్‌ రూంలు ఏర్పాటు చేసి విద్యార్థులకు మెరుగైన బోధన అందేలా సహకరిస్తున్న టీచ్‌ఫర్‌ చేంజ్‌ సంస్థ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. మూడు సంవత్సరాలపాటు టీచ్‌ఫర్‌ చేంజ్‌ అందించే కరికులంను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థుల్లో ఉపాధ్యాయులు మార్పు తీసుకురావాలన్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు తీసుకున్న గీట్ల భరత్‌రెడ్డిని మంత్రి సన్మానించారు. శ్రీపాదకాలనీలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ రిపేర్‌ సెంటర్‌కు మంత్రి శంకుస్థాపన చేశారు. క్యాంపు కార్యాలయంలో ఫ్యార్చునర్‌ రామ ఛారిటి ఆధ్వర్యంలో సింగిల్‌ పేరెంట్‌ విద్యార్థులకు విద్య సామగ్రిని పంపిణీ చేశారు. మంథని, రామగిరి, కమాన్‌పూర్‌ మండలాలకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను మంత్రి శ్రీధర్‌బాబు పంపిణీ చేశారు. ట్రేడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఐత ప్రకాష్‌రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ అన్నయ్యగౌడ్‌, అల్ఫోర్స్‌ నరేందర్‌రెడ్డి, డీఈవో మాధవి, ఆర్డీవో సురేష్‌, ఈఆర్‌సీ మెంబర్‌ శశిభూషన్‌కాచే, ఏఎంసీ చైర్మన్‌ కుడుదుల వెంకన్న, పీఏసీఎస్‌ చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌, అధికారులు, కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు.

విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి

సినిమా ఆర్టిస్టు మంచు లక్ష్మి

విద్యార్థులు నాయకత్వ లక్షణాలు కల్గి ఉండాలని సినీ నటి, టీచ్‌ఫర్‌ చేంజ్‌ ఆర్గనైజేషన్‌ ప్రతినిధి మంచు లక్ష్మి అన్నారు. మంథని ప్రాంతంలో తమ సంస్థ ద్వారా ఆరు ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ క్లాస్‌ రూంలను ఏర్పాటు చే స్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలో తమ సంస్థ ద్వారా 51 తరగతి గదుల్లో డిజిటల్‌ క్లాస్‌ రూంగా మార్చామన్నారు. తమ కుటుంబ నేపథ్యం విద్యా రంగం నుంచి వచ్చిందని, తమ తాత హెచ్‌ఎంగా పని చేశారని తెలిపారు. నాణ్యమైన విద్య అందరికి అందాలనే లక్ష్యంతో టీచ్‌ ఫర్‌ చేంజ్‌ సంస్థ ఏర్పాటు చేశామన్నారు. మరిన్ని పాఠశాలల్లో సదుపాయాలను మెరుగు పరుస్తామన్నారు. విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్ల లాంటి పెద్దస్థాయికి ఎదగాలన్నారు.

Updated Date - Sep 12 , 2025 | 12:08 AM