విద్యార్థులకు ప్రమాణాలతో కూడిన విద్యనందించాలి
ABN , Publish Date - Jul 20 , 2025 | 12:20 AM
విద్యార్థులకు ప్రమాణాలతో కూడిన విద్య అందేలా కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో పలు పాఠశాలల హెడ్ మాస్టర్లు, అధికారులతో విద్యా ప్రమాణాల పెంపుపై సమీక్ష నిర్వహించారు.
పెద్దపల్లి కల్చరల్, జూలై 19(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు ప్రమాణాలతో కూడిన విద్య అందేలా కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో పలు పాఠశాలల హెడ్ మాస్టర్లు, అధికారులతో విద్యా ప్రమాణాల పెంపుపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సర్వేలో పాఠశాలల్లో చదివే 9, 10వ తరగతి విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం చదివి అర్థం చేసుకోవడం 53 శాతం మాత్రమే ఉంటున్నారని, భాష అర్థం చేసుకోకపోతే గణితం, సైన్స్ వంటి పాఠ్యాంశాలు అర్థం చేసుకోలేరని తెలిపారు. దీనిపై హెడ్ మాస్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. విద్యార్థులకు భాషపై కనీస పరిజ్ఞానం పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో 40 శాతం మంది విద్యార్థులు మెరుగ్గా ఉంటే జిల్లాలో తక్కువగా ఉన్నారని తెలిపారు. విద్యార్థుల విద్యా స్థాయి పెంచడంలో ఉపాధ్యాయులు చర్యలు చేపట్టకపోతే వారు సెలవులపై వెళ్లవచ్చని అన్నారు. సైన్స్, సోషల్ సబ్జెక్టుల్లో కూడా విద్యార్థులు 30 శాతం మాత్రమే మెరుగ్గా ఉన్నారని, ఇది చాలా ఆందోళనకరమని ఆయన అన్నారు.
9వ తరగతిలో 31 శాతం మంది విద్యార్థులు మాత్రమే బేసిక్ మ్యాథ్స్ చేస్తున్నారని తెలిపారు. ఎఫ్‌ఆర్‌ఎస్ సంబంధించి ఉన్న పెండింగ్ ఇబ్బందులు వారం రోజుల్లో సెట్ చేసుకోవాలని, వంద శాతం ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరు నమోదు చేయాలన్నారు. పదో తరగతి విద్యార్థులతోపాటు 6 నుంచి 9వ తరగతి విద్యార్థుల్లో ప్రతి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకుంటూ సిలబస్ పూర్తి చేయాలన్నారు. ప్రతి నెల 25న పాఠశాలలను ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించి విద్యార్థుల ప్రగతి సిలబస్‌పై సమీక్షించాలన్నారు. జిల్లా విద్యాధికారి మాధవి, ప్రధానోపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.