Share News

ప్రతేక పాలనా.. పొడిగింపా?

ABN , Publish Date - Feb 07 , 2025 | 11:56 PM

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పదవీ కాలం ఈ నెల 14వ తేదీతో ముగుస్తోంది. వారి పదవీ కాలాన్ని పొడిగిస్తారా, ప్రత్యేక అధికారుల పాలన తీసుకవస్తారా అనే చర్చ జిల్లాలో జరుగుతున్నది. ఏడాది క్రితం గ్రామ పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం, ఆరు మాసాల క్రితం మండల, జిల్లా పరిషత్‌ పాలకవర్గాల పదవీ కాలం ముగియగా ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించ లేదు.

ప్రతేక పాలనా..  పొడిగింపా?

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పదవీ కాలం ఈ నెల 14వ తేదీతో ముగుస్తోంది. వారి పదవీ కాలాన్ని పొడిగిస్తారా, ప్రత్యేక అధికారుల పాలన తీసుకవస్తారా అనే చర్చ జిల్లాలో జరుగుతున్నది. ఏడాది క్రితం గ్రామ పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం, ఆరు మాసాల క్రితం మండల, జిల్లా పరిషత్‌ పాలకవర్గాల పదవీ కాలం ముగియగా ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించ లేదు. తాజాగా వారం రోజుల క్రితం మున్సిపాలిటీల పదవీ కాలం ముగియగా, వీట న్నింటికీ ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమిం చింది. ఈ నెల 14వ తేదీ వరకు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పదవీ కాలం ముగియను న్నది. ఈ సంఘాలకు ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు. ఓటర్ల జాబితాల ప్రక్రియ ఇప్పటి వరకు మొదలు కాలేదు. మరో ఆరు మాసాలకు గానీ ఎన్నికలు జరిగే పరిస్థితి కనబడడం లేదు. జిల్లాలో కొత్తగా మరో ఏడు సంఘాల ఏర్పాటుకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా, వాటిపై ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడ లేదు.

ఫ జిల్లాలో 20 పీఏసీఎస్‌లు..

జిల్లాలో ప్రస్తుతం 20 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉన్నాయి. సుల్తానాబాద్‌ మండలంలో సుల్తానాబాద్‌, గర్రెపల్లి, కనుకుల, చిన్నకల్వల, సుద్దాల, ఎలిగేడు మండలం ఎలిగేడు, ధుళికట్ట, జూలపల్లి మండలం జూలపల్లి, ఓదెల మండలం పొత్కపల్లి, కాల్వశ్రీరాంపూర్‌ మండలం కాల్వశ్రీరాంపూర్‌, కూనారం, పెద్దపల్లి మండలం పెద్దపల్లి, అప్పన్నపేట. ధర్మారం మండలం ధర్మారం, పత్తిపాక, కమాన్‌పూర్‌ మండలం కమాన్‌పూర్‌, ముత్తారం మండలం ముత్తారం, మంథని మండలం మంథని, పాలకుర్తి మండలం కన్నాల, రామగుండం మండలం మేడిపల్లిలో సహకార సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల్లో 52,316 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. ఈ సంఘాల ద్వారా రైతులకు పంట రుణాలతో పాటు దీర్ఘకాలిక రుణాలు, బంగారం తాకట్టు, వాహన, ఇతర రుణాలు అందజేస్తున్నారు. అలాగే ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాల విక్రయాలు చేపడుతున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లాలో 250కి పైగా కొనుగోలు కేంద్రాలను ప్రతీ సీజన్‌లో ఏర్పాటు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలను నిర్వహించడం వల్ల కమీషన్‌ రూపేణా యేటా 12 కోట్ల రూపాయలు సహకార సంఘాలకు పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్‌ ద్వారా ఆదాయం సమకూరుతున్నది. ఈ డబ్బులు సంఘం అభివృద్ధికి ఎంతో దోహద పడుతున్నాయి. వాణిజ్య బ్యాంకులు రైతులకు పంట రుణాలు ఇవ్వన ప్పుడు సహకార సంఘాల ద్వారానే పంట రుణాలు ఇచ్చేవాళ్లు. ఆయా సహకార సంఘాల్లో అక్రమాలు, అవకతవకలు, నిధుల దుర్వినియోగం జరగడంతో నష్టాల పాలయ్యాయి. దీంతో జిల్లాలో కొన్ని సంఘాలు మూతపడ్డాయి. ప్రస్తుతం ఉన్న సంఘాల్లో జవాబుదారీ తనం, పారదర్శకత పెరగడంతో నిధుల దుర్వినియోగం తగ్గుముఖం పట్టింది.

ఫ ఏడు సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదనలు..

మండలానికి రెండు సహకార సంఘాలు ఉండేలా చర్యలు తీసుకునేందుకు రీ ఆర్గనైజేషన్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జిల్లాలో కొత్తగా ఏడు సంఘాల ఏర్పాటుకు అధికారులు ప్రతిపా దనలు సిద్ధం చేశారు. రామగిరి, పాలకుర్తి, అంతర్గాం, మంథని మండలం వెంకటాపూర్‌, గుంజపడుగు, ఓదెల మండలం కొలనూర్‌, మరొక సంఘం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపించారు. దానిపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. కొత్త సంఘాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత ఆయా సంఘాల పరిధిలో ఉన్న రైతులను కొత్త సంఘంలో చేర్చి కొత్తగా సభ్యత్వాలను తీసుకుని, ఓటర్ల జాబితాలు డైరెక్టర్ల వారీగా ఓటర్ల జాబితా రూపొందిం చాల్సి ఉంటుంది. ఈ తంతు పూర్తి కావడానికి నాలుగైదు నెలలైనా పడుతుంది. అలాగే గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలను నిర్వహిస్తే గానీ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు. దీంతో రైతులకు విస్తృత సేవలు అందించే సహకార సంఘాల పాలక వర్గాల పదవీ కాలం పొడిగిస్తారా, ప్రత్యేక అధికారులను నియమిస్తారా అనే విషయమై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ప్రభుత్వం మాత్రం ప్రత్యేక అధికారుల నియామకానికే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తున్నది.

ఈ నెల 14తో ముగియనున్న పదవీ కాలం..

- శ్రీమాల, జిల్లా సహకార శాఖాధికారి

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పాలకవర్గాల పదవీ కాలం ఈ నెల 14వ తేదీతో ముగియనున్నది. ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. పాలకవర్గాల పదవీ కాలాన్ని పొడిగిస్తారా, ప్రత్యేక అధికారులను నియమిస్తారా అనే విషయమై ఏమి తెలియదు.. జిల్లాలో ఇప్పుడున్న సంఘాలకు తోడు ఏడు సంఘాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు.

Updated Date - Feb 07 , 2025 | 11:56 PM