Share News

మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Sep 17 , 2025 | 11:47 PM

మహిళల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం స్వస్త్‌ నారీ, సాశక్త్‌ పరివార్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష తో కలిసి ప్రారంభించారు. వంశీకృష్ణ మాట్లాడుతూ, ఇల్లు బాగుండాలంటే మహిళలు వారి ఆరోగ్యం బాగుండాలన్నారు.

మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

పెద్దపల్లిటౌన్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి) మహిళల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం స్వస్త్‌ నారీ, సాశక్త్‌ పరివార్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష తో కలిసి ప్రారంభించారు. వంశీకృష్ణ మాట్లాడుతూ, ఇల్లు బాగుండాలంటే మహిళలు వారి ఆరోగ్యం బాగుండాలన్నారు. మహిళల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించకుండా కేంద్ర ప్రభుత్వ పథకాన్ని వినియోగించుకుంటూ వైద్య పరీక్షలు చేసుకోవాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య క్యాంపులో హెల్త్‌ చెక్‌ అప్‌ చేసుకోవాలని సూచించారు.

వ్యాధి నిర్ధారణ జరిగిన మహిళలకు సంబంధిత చికిత్సను ప్రభుత్వం అందిస్తుందన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారని, కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో అమలు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక వైద్యుల సేవలు వినియోగంలో ఉన్నాయన్నారు. మహిళలు తమకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాలని కలెక్టర్‌ కోరారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వాణిశ్రీ, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీధర్‌, అధికారులు తదితరులు పాల్గొన్నారు

Updated Date - Sep 17 , 2025 | 11:47 PM