పాఠశాలలు, కళాశాలల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ
ABN , Publish Date - Jul 18 , 2025 | 11:38 PM
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు కళాశాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని, పేద మధ్య తరగతి కుటుంబాలకు చెందిన పిల్లలకు ఉన్నత విద్యను చేరువ చేస్తుందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మహాత్మాజ్యోతిరావుఫూలే బాలికల డిగ్రీ గురుకుల విద్యాలయాన్ని ఆయన సుల్తానాబాద్‌లో శుక్రవారం ప్రారంభించారు.
సుల్తానాబాద్, జూలై 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు కళాశాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని, పేద మధ్య తరగతి కుటుంబాలకు చెందిన పిల్లలకు ఉన్నత విద్యను చేరువ చేస్తుందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మహాత్మాజ్యోతిరావుఫూలే బాలికల డిగ్రీ గురుకుల విద్యాలయాన్ని ఆయన సుల్తానాబాద్‌లో శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సుల్తానాబాద్ పట్టణంలో బాలికల డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసుకోవడం హర్షణీయమన్నారు. అన్ని వసతులతో కూడిన భవనంలో విద్యార్థినులకు మంచి బోధనలను అందించాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. యేటా ఎన్‌రోల్‌మెంట్స్‌ను పెంచుకోవాలని, వంద శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఈ ప్రాంతం నుంచి 300 సీట్లు భర్తీ అయ్యే విధంగా చూస్తే అన్ని సదుపాయాలతో సొంత భవనాన్ని నిర్మించుకునేందుకు అవసరమైన నిధులు సమకూరుస్తానని హామీ ఇచ్చారు.
కళాశాలలో విద్యార్థినుల సౌకర్యార్థం గీజర్లను కూడా ఏర్పాటు చేయిస్తానన్నారు. ఇంకా ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా తనకు తెలుపాలన్నారు. బాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అడిషనల్ కలెక్టర్ దాసరి వేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ ప్రకాశ్ రావు, సింగిల్‌విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, ఆర్‌డీఓ గంగయ్య, ఎంపీజే ఆర్‌సీఓ అంజలి, ప్రిన్సిపాల్ వనజ, తహసీల్దార్ బషీరొద్దిన్, ఎంపీడీఓ దివ్యదర్శన్ రావు, మున్సిపల్ కమిషనర్ రమేష్, నాయకులు గాజుల రాజమల్లు, బిరుదు సమత, పన్నాల రాములు, దుగ్యాల సంతోష్ రావు, దామోదర్ రావు, శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు