హైస్కూల్ విద్యాబోధనపై ప్రత్యేక దృష్టి సారించాలి
ABN , Publish Date - Aug 23 , 2025 | 12:05 AM
హైస్కూల్ విద్యాబోధనపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో విద్యాశాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల కనీస విద్యా ప్రమాణాల పెంపు లక్ష్యంగా ఉపాధ్యాయులు పని చేయాలన్నారు.
పెద్దపల్లి కల్చరల్, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): హైస్కూల్ విద్యాబోధనపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో విద్యాశాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల కనీస విద్యా ప్రమాణాల పెంపు లక్ష్యంగా ఉపాధ్యాయులు పని చేయాలన్నారు. జిల్లాలోని ఉన్నత పాఠశాలలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదని కలెక్టర్ తెలిపారు. పలు పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారని, 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన బేసిక్స్ నుంచి నేర్పడం అవసరమన్నారు. ప్రతి సబ్జెక్టు పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా బోధన ఉండాలన్నారు. బోధన విధానంలో రావాల్సిన మార్పులపై సలహాలు, సూచనలు అందించాలని ఆయన కోరారు. జిల్లా యంత్రాంగం తరపున అవసరమైన సహకారం ఉంటుందని, ఉపాధ్యాయులు ప్రతి పాఠ్యాంశానికి సంబంధించిన టీఎల్‌ఎం తయారు చేయాలని తెలిపారు. జిల్లా విద్యాధికారి మాధవితోపాటు పలువురు ప్రధానోపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.
కొత్త అసైన్‌మెంట్ భూములకు అర్హుల జాబితా సిద్ధం చేయాలి
పెద్దపల్లి, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): కొత్త అసైన్‌మెంట్ భూములకు అర్హుల జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డివేణుతో కలిసి నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులకు నోటీసులు జారీ చేశామన్నారు. భూ భారతి చట్టం నిబంధనల ప్రకారం అర్హత ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. భూ భారతి పోర్టల్ ద్వారా వచ్చే దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. ప్రతీ మండలంలో గ్రామాల వారీగా కొత్త అసైన్‌మెంట్ కోసం వచ్చిన దరఖాస్తుల, అర్హుల వివరాల జాబితా అందించాలన్నారు. ఆగస్టు నెలాఖరు వరకు భూ సమస్యల దరఖాస్తులు ఆన్‌లైన్ నమోదు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రైవేట్ పట్టా భూములలో సాదా బైనమా దరఖాస్తులను హైకోర్టు అనుమతి వచ్చిన తర్వాత పరిశీలించాలని కలెక్టర్ తెలిపారు. పీఓటీ కేసులలో కొత్త అసైన్‌మెంట్ భూమి కింద ప్రభుత్వం లబ్ధి చేకూర్చేందుకు అర్హుల జాబితా సిద్ధం చేసుకోవాలన్నారు. ఆర్‌డీఓలు బి గంగయ్య, సురేష్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, తహసిల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.