ఎరువుల పంపిణీ కోసం ప్రత్యేక యాప్
ABN , Publish Date - Dec 15 , 2025 | 11:55 PM
జిల్లాలో రైతులకు గత సీజన్‌లో లాగా ఎరువుల కొరతకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్ అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో యాసంగి సీజన్‌లో ఎరువులు, ముఖ్యంగా యూరియా కొరత రాకుండా, లేకుండా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రణాళికలు రూపొందించి పటిష్టంగా అమలు అయ్యేలా అధికారులను ఆదేశించారు.
సుల్తానాబాద్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైతులకు గత సీజన్‌లో లాగా ఎరువుల కొరతకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్ అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో యాసంగి సీజన్‌లో ఎరువులు, ముఖ్యంగా యూరియా కొరత రాకుండా, లేకుండా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రణాళికలు రూపొందించి పటిష్టంగా అమలు అయ్యేలా అధికారులను ఆదేశించారు. జిల్లాలో యూరియా పంపిణీ విచ్చలవిడిగా కాకుండా, రైతులు అడిగిందే తడువుగా అన్ని బస్తాలు ఇవ్వకుండా కట్టుదిట్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. రైతులు సాగు చేస్తున్న భూములు ఎన్ని ఉన్నాయి, అందులో ఏ ఏ పంటలు వేస్తున్నారు, ఆయా పంటలకు ఎంత మేరకు ఎరువులు అవసరం వివరాలను వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తల ద్వారా సేకరించి సిద్ధం చేశారు. వాటి ఆధారంగా రైతులకు అవసరం ఉన్న మేరకే యూరియా బస్తాలను ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించారు. రాష్ట్రంలలో ఎక్కడా లేని విధంగా ఎరువుల పంపిణీ కోసం పెద్దపల్లి జిల్లాలో ఓ ప్రత్యేక యాప్ రూపొందించారు. ఎరువులు అవసరం ఉన్న రైతులు ఈ యాప్ ద్వారా మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. పంటల అవసరానికి మొత్తం బస్తాలు ఒకేసారి కాకుండా అవసరాన్ని బట్టి వాటిని వాడేందుకు ఎరువులను అందిస్తారు. రైతులు యూరియా కోసం ఎరువుల దుకాణాలకు వెళితే ఆయా రైతులు తమ పట్టా పాసుపుస్తకం నంబరును యాప్‌లో ఎంటర్ చేయగానే ఆ రైతులకు సంబంధించిన భూముల వివరాలు, సాగు చేస్తున్న పంటల వివరాలు కనిపిస్తాయి. ఎంత మోతాదులో పంటకు ఉపయోగించాలనే వివరాలు యాప్‌లో ఉంటాయి. యాసంగి సీజన్‌లో ఓ రైతు ఎనిమిది ఎకరాల పొలంలో వరి పండిస్తే అతనికి 16 బస్తాల యూరియా అవసరం ఉంటుంది. ఆ రైతు ఒక్కసారిగా 16 బస్తాల యూరియా తీసుకోవడానికి యాప్ సహకరించదు. శాస్త్రవేత్తల సూచనల మేరకు ఎకరానికి రెండు బస్తాల చొప్పున వరి పంట చేతికందే వరకు బస్తాలు ఇస్తారు. జిల్లాలోని ఏ ఫర్టిలైజర్ షాపులో కూడా ఆయా గ్రామాల రైతులు ఎక్కువ బస్తాలు తీసుకునే ప్రయత్నం చేసినా యాప్‌లో వివరాలు నమోదు కావు, బస్తాలు ఇవ్వరు. జిల్లాలో 2,08,728 ఎకరాల్లో వరి పంట సాగు చేయనున్నారు. ఈ పంటల సాగుకు 38 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని అంచనా.
యూరియా కృత్రిమ కొరత నివారణ కోసమే యాప్
వ్యవసాయ అధికారి పైడితల్లి
గత సీజన్‌లో రైతులు యూరియా అవసరానికి మించి తీసుకుని నిలువ చేసుకున్నారు. మరి కొందరు రైతులు ఇతర జిల్లాలు మండలాల్లో ఉన్న బంధువులకు పంపించారు. దీంతో జిల్లాలో కృత్రిమంగా యూరియా కొరత ఏర్పడింది. దీంతో ప్రస్తుత సీజన్‌లో కలెక్టర్ ప్రత్యేక యాప్ రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని ప్రతీ ఎరువుల దుకాణంలో ఈ యాప్ ద్వారా మాత్రమే రైతులు ఎరువులు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. దీంతో జిల్లాలో యూరియా కొరత ఉండదు. ఎక్కడా కూడా ఎక్కువ బస్తాలు తీసుకోవాలనుకున్నా సాధ్యం కాదు. ఇప్పటికైనా రైతులు ఎరువుల వాడకాన్ని తగ్గించి అవసరం మేరకే తీసుకుపోవాలి
కొత్త యాప్‌తో తొలగనున్న ఇబ్బందులు
ఇల్లెందుల శ్రీనివాస్ ఎరువుల డీలర్ కనుకుల
జిల్లా అధికారులు రూపొందించిన యాప్‌తో ఇబ్బందులు తొలగుతాయి. రైతులు ఎంత పలుకుబడి ఉపయోగించినా ఎక్కువ మొత్తంలో బస్తాలను ఇవ్వలేకుండా యాప్ ఉంది. ఎరువుల పంపిణీ పారదర్శకంగా జరుగుతుంది. ఇరవై రోజులకు ఒక సారి ఎరువులు ఇవ్వాలని అధికారులు నిబంధన పెట్టారు. యాప్‌లో నమోదు చేస్తేనే రైతులకు ఎరువుల బస్తాలు వస్తాయి. యాప్ సకాలంలో ఓపెన్ కాకపోవడం, పలు రకాల వివరాలు నమోదు చేయడానికి ఇబ్బందిగా మారింది. చాలా మంది కౌలు రైతులు ఉన్నారు. వారికి సంబందించిన పంటల వివరాలు నమోదు చేసి అతనికి యూరియా అలాట్ చేద్దామంటే ఓటీపీ నంబరు పట్టాదారు రైతుల సెల్ ఫోన్లకు వెలుతుంది. పట్టాదార్ నుంచి ఓటీపీ తెలుసుకునే లోగా టైమ్ అయిపోవడం వ్యయప్రయాసాలకు గురవుతోంది.
ఒకేసారి ఇస్తే బావుండు
చంద్రయ్య రైతు రామునిపల్లి
ఎకరానికి రెండు బస్తాల చొప్పున యూరియా ఇస్తామంటున్నారు. ఒకేసారి ఇస్తే సరిపోతుంది. పంటలు చివరికి వచ్చేసరికి ఎరువుల దుకాణాల వద్దకు మూడు దఫాలుగా రావల్సివస్తుంది. ప్రభుత్వం యూరియా వినియోగంలో కట్టడి చేయడం మంచిదే కానీ కౌలు రైతులకు ఈ విధానం ద్వారా కొంత అసౌకర్యం కలుగుతుంది.