సింగరేణి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌పై వేటు
ABN , Publish Date - Oct 23 , 2025 | 11:43 PM
సింగరేణి ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (సిమ్స్) కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హిమబిందుపై ప్రభుత్వం వేటు వేసింది. ఆమెను ప్రిన్సిపాల్ విధుల నుంచి తప్పిస్తూ వైద్యశాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జీఓ 500విడుదల అయ్యింది. హిమబిందు స్థానంలో అదే కళాశాలలో బయో కెమిస్ర్టి ప్రొఫెసర్ నరేందర్‌ను ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా నియమించారు.
కళ్యాణ్‌నగర్, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): సింగరేణి ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (సిమ్స్) కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హిమబిందుపై ప్రభుత్వం వేటు వేసింది. ఆమెను ప్రిన్సిపాల్ విధుల నుంచి తప్పిస్తూ వైద్యశాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జీఓ 500విడుదల అయ్యింది. హిమబిందు స్థానంలో అదే కళాశాలలో బయో కెమిస్ర్టి ప్రొఫెసర్ నరేందర్‌ను ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా నియమించారు. ఆమెపై క్రమశిక్షణ చర్యలు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపారు. ఆమెకు వేరే చోట పోస్టింగ్ ఇవ్వకుండా అదే కళాశాలలో పిడియాట్రిక్ హెచ్‌ఓడీగా కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు. సింగరేణి మెడికల్ కళాశాల ప్రారంభం నుంచి హిమబిందు ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నారు. డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ నివేదికతో ఆమెపై చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.
హిమబిందు మొదటి నుంచి వివాదాస్పదురాలిగా ఉన్నది. హిమబిందు ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తుండగా, ఆమె భర్త దయాల్‌సింగ్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. దీన్ని అడ్డుపెట్టుకుని ఆమె జనరల్ ఆసుపత్రిలో పెత్తనం చెలాయించడం, వైద్యులు, ఉద్యోగులు, సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. అవుట్ సోర్సింగ్ నియామకాల్లో కారు డ్రైవర్ ద్వారా ప్రిన్సిపాల్ డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. మెడికల్ కళాశాలలో జరిగిన నియామకాల్లో అవకతవకల్లో ఆమె ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. మెడికల్ కళాశాలలో విద్యార్థులు, సిబ్బందిపై దురుసుగా వ్యవహరించడం, మెస్ బిల్లులు, సిబ్బంది వేతనాల బిల్లుల విషయంలో డీఎంఈకి ఫిర్యాదులు వెళ్లాయి. ప్రభుత్వాసుపత్రి వైద్యులు మూకుమ్మడిగా ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ వద్దకువెళ్లి ఆమె వేధింపులు భరించలేక పోతున్నామని, ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. కలెక్టర్ తరచూ మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న జనరల్ ఆసుపత్రిని తనిఖీ చేసి సూచనలు చేసినా వాటిని ఆచరణలో పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విమర్శలున్నాయి. ఈ పరిస్థితులను కూడా ప్రభుత్వానికి నివేదించినట్టు సమాచారం. వైద్యుల ఫిర్యాదులకు తోడు కాంట్రాక్టర్లను ఇబ్బందులు పెడుతున్న విషయమై వచ్చిన ఫిర్యాదులపై ప్రభుత్వం డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ ద్వారా నివేదిక తెప్పించుకున్నట్టు తెలుస్తుంది. ఆ నివేదిక మేరకే ఆమెపై చర్య తీసుకున్నట్టు సమాచారం.