Share News

కదంతొక్కిన సింగరేణి డిపెండెంట్‌ బాధితులు

ABN , Publish Date - Sep 10 , 2025 | 12:00 AM

సింగరేణిలో పదేళ్ళుగా మారు పేర్ల విజిలెన్స్‌ పెండింగ్‌ కేసులతో తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మంగళవారం మారుపేర్ల బాధితులు గోదావరిఖని చౌరస్తాలో కదం తొక్కారు. ప్లకార్డులతో చౌరస్తా నుంచి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ కార్యాలయం భాస్కర్‌రావు భవన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు.

కదంతొక్కిన సింగరేణి డిపెండెంట్‌ బాధితులు

గోదావరిఖని, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): సింగరేణిలో పదేళ్ళుగా మారు పేర్ల విజిలెన్స్‌ పెండింగ్‌ కేసులతో తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మంగళవారం మారుపేర్ల బాధితులు గోదావరిఖని చౌరస్తాలో కదం తొక్కారు. ప్లకార్డులతో చౌరస్తా నుంచి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ కార్యాలయం భాస్కర్‌రావు భవన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యాలయంలో ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య కాళ్ల మీద పడి తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వేడుకున్నారు. మారుపేర్ల సంఘం అధ్యక్షుడు లక్క శ్రావణ్‌ మాట్లాడుతూ 10సంవత్సరాలుగా సింగరేణి కారుణ్య నియామకాల్లో డిపెండెంట్‌ ఉద్యోగ బాధితులమని, మారుపేర్ల విజిలెన్స్‌ పెండింగ్‌తో ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం లేదన్నారు. చాలా మంది రోజు కూలీకి వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు మారుపేర్ల ఉద్యోగులకు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ చేస్తామని చెప్పి రెండు సంవత్సరాలు దాటినా తమను పట్టించుకోవడం లేదన్నారు. కొందరు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. సింగరేణిలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలను కూడా ఎన్నో సార్లు కలిసి తమ బాధను చెప్పుకున్నా ఎవరూ కనికరించడం లేదన్నారు.

ఏఐటీయూసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తం

డిపెండెంట్‌ ఉద్యోగుల బాధితులు ఏఐటీయూసీ కార్యాలయానికి రావడంతో ఉద్రిక్తత నెలకొన్నది. తమ సమస్యను కార్మిక సంఘాల నాయకులు పట్టించుకోవడం లేదని నాయకులతో వాగ్వాదానికి దిగారు. తాము జీవించలేని పరిస్థితి నెలకొన్నదని, తమ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చొరవ చూపాలని వారు వేడుకున్నారు. సీతారామయ్య బాధితులకు నచ్చజెప్పి తమ చేతుల్లో ఏమి లేదని, ప్రభుత్వం చేతిలో ఉందని, మారుపేర్ల సమస్యను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సీఎండీ బలరాంనాయక్‌ దృష్టికి తీసుకెళ్లామని, బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపుతామని ఆయన హామీ ఇచ్చారు. మారుపేర్ల బాధితులు శ్రావణ్‌, శ్రీనివాస్‌, డిష్‌ బాబు, బీరయ్య, రవికుమార్‌, ఓం ప్రకాష్‌, హరీష్‌, రాజు పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2025 | 12:00 AM