Share News

విజృంభిస్తున్న సీజనల్‌ వ్యాధులు

ABN , Publish Date - Aug 22 , 2025 | 12:26 AM

మంథని డివిజన్‌లో సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకోవడంతో జ్వర పీడితుల సంఖ్య పెరుగుతుంది. వర్షాల కారణంగా సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారు.

విజృంభిస్తున్న సీజనల్‌ వ్యాధులు

మంథని, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): మంథని డివిజన్‌లో సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకోవడంతో జ్వర పీడితుల సంఖ్య పెరుగుతుంది. వర్షాల కారణంగా సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారు. వైద్యం కోసం మండల కేంద్రాలతోపాటు పల్లెల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. జ్వర పీడితులు, ఓపీలతో ఆసుపత్రులన్ని కిటకిటలాడుతున్నాయి. డివిజన్‌లోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్‌ మండలాల్లోని పలు గ్రామాల్లో కొద్ది రోజులుగా జ్వరాలు ప్రబలుతున్నాయి. మంథని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో రోజు రోజుకు ఓపీ సంఖ్య పెరుగుతూ వస్తుండగా ఇందులో అధికంగా జ్వర పీడితులే ఉంటున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలుపుతున్నాయి.

తాజాగా ఓపీ సంఖ్య నిత్యం 3 వందలకు పైగా కొనసాగుతుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ చ్చు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణ ఓపీ, ల్యాబ్‌, వార్డుల్లో రోగుల రద్దీ కొనసాగుతుంది. చాలా మందికి టెస్టులు చేస్తుండగా మలేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ జ్వరాలతో పాటు ప్లేట్‌లేట్స్‌ తగ్గుతున్నాయి. వర్షాలతో గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత లోపించి దోమలు, ఈగలు వ్యాప్తి చెందడంతోపాటు కలుషిత నీరు, శుభ్రంగా లేని ఆహారం తీసుకోవడం వల్ల ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. ప్లేట్‌లెట్స్‌ క్షీణిస్తూ అస్వస్థతకు గురవుతూ ఒళ్ళు నొప్పులతో బాధ పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని రెండు వార్డులు జ్వర పీడితులతో నిండిపోయాయి. మంథని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రితో పాటు పలు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో రోగుల రద్దీ కొనసాగుతుంది. గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Aug 22 , 2025 | 12:26 AM