అధ్యానంగా పారిశుధ్యం
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:21 AM
గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన అస్తవ్యస్తంగా మారింది. గ్రామాలను సందర్శించకపోవడంతో పారిశుధ్య నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంది. మురికి కాలువలను శుభ్రం చేయించకపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయి. బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ఫాగింగ్ చేయక పోవడంతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. వీధి దీపాలు కూడా సక్రమంగా వెలగడం లేదు. మిషన్ భగీరథ పథకం ద్వారా నీళ్లు సక్రమంగా రావడం లేదు. ఇలా అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు.

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం ముగిసి ఏడాది గడిచినా కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించలేదు. ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నది. పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు ఏడాది కాలంగా నిలిచి పోయాయి. జిల్లాలో 263 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఎస్‌ఎఫ్‌సీ నిధులు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. అవి సిబ్బంది వేతనాలు, పంచాయతీల నిర్వహణకే సరిపోతున్నాయి. ఎన్నికలు నిర్వహించనిదే 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావని చెబుతున్నారు.
ఎక్కడి చెత్త అక్కడే... పైపులైన్ లీకేజీలు
తడి, పొడి చెత్త నిర్వహణ సరిగా లేదు. ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ఉండగా, ఆ ట్రాక్టర్‌లో డీజిల్ పోసేందుకు నిధులు లేక ఎక్కడి చెత్త అక్కడనే ఉంటున్నది. మిషన్ భగీరథ పథకం ద్వారా పలు గ్రామాలకు నీటి సరఫరా సక్రమంగా జరగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పైపు లైన్ల లీకేజీలను అరికట్టక పోవడంతో నీరంతా వృథాగా పోతున్నది. కొన్ని గ్రామాలకు తాగు నీరు అందడం లేదు. వచ్చే నెల నుంచి వేసవి కాలం ఆరంభం కానున్న దృష్ట్యా పైప్‌లైన్ల లీకేజీలను అరికట్టని కారణంగా ప్రజలకు ఇబ్బందులు తప్పేలా లేవు. గ్రామ కార్యదర్శులు ప్రభుత్వ పథకాల అమలు, సర్వేల్లో మునిగి తేలుతుండగా, ప్రత్యేక అధికారులు నామమాత్రంగా పని చేస్తున్నారు. పాలకవర్గాలు లేక పోవడంతో పంచాయతీలకు దిక్కు, మొక్కు లేకుండా పోతున్నది. గతంలో మాజీ సర్పంచులు చేసిన కొన్ని పనులకు బిల్లులు రావడం లేదు. గ్రామాల్లో హరితవనాల నిర్వహణ సక్రమంగా లేదు. చెట్లు, మొక్కలు ఎండిపోతున్నాయి. తెలంగాణ క్రీడా ప్రాంగణాలు వెలవెలబోతున్నాయి. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా, గ్రామాల్లో సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా పలు గ్రామాలను ‘ఆంధ్రజ్యోతి’ బృందం విజిట్ చేసింది.