Share News

సామాన్యులకు భారంగా మారిన ఇసుక

ABN , Publish Date - Dec 07 , 2025 | 11:46 PM

చెంతనే మానేరు వాగు ఉన్నా ఇసుక ధరలు మాత్రం ఆకాశన్నంటాయి. సులభతరమైన ఇసుక పాలసీ తీసుకువచ్చామని చెబుతున్న అధికారులు, ప్రజాప్రతినిదుల మాటలు నీటి మూటలయ్యాయి. ఉచిత ఇసుక విధానం అమలులో ఉన్నా ట్రాక్టర్‌ యజమానులు, ఇసుక వ్యాపారులు సిండికేట్‌గా మారారు.

సామాన్యులకు భారంగా మారిన ఇసుక

సుల్తానాబాద్‌, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): చెంతనే మానేరు వాగు ఉన్నా ఇసుక ధరలు మాత్రం ఆకాశన్నంటాయి. సులభతరమైన ఇసుక పాలసీ తీసుకువచ్చామని చెబుతున్న అధికారులు, ప్రజాప్రతినిదుల మాటలు నీటి మూటలయ్యాయి. ఉచిత ఇసుక విధానం అమలులో ఉన్నా ట్రాక్టర్‌ యజమానులు, ఇసుక వ్యాపారులు సిండికేట్‌గా మారారు. గతంలో సుల్తానాబాద్‌ పట్టణ వాసులకు కేవలం వేయి రూపాయల లోపు ట్రాక్టర్‌ చొప్పున లభించేది. అంతకు ముందు ఏడు, ఎనిమిది వందలు ఉండేది. ప్రస్తుతం ఇసుక ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి.నీరుకుల్ల మానేరు ఐదు కిలోమీటర్లలోపు మాత్రమే ఉంటుంది. కానీ ఒక్క ట్రాక్టర్‌ ఇసుక రెండు నుంచి రెండు వేల ఐదు వందలు వసూలు చేస్తున్నారు. అంత ధరలు చెల్లించుకోలేని ప్రజలు ఇసుక మూలంగా ఇండ్ల నిర్మాణాలు వాయిదా వేసుకుంటున్నారు.

ఫఇసుక ధరల పై కొరవడిన నియంత్రణ

మండలంలో నీరుకుళ్ల, గట్టేపల్లి, కదంబాపూర్‌, గొల్లపల్లి, సాంబయ్య పల్లి, గర్రెపల్లి, తొగర్రాయి మంచరామి గ్రామాలు మానేరు పరివా హక ప్రాంత గ్రామాలుగా ఉన్నాయి. ఈ గ్రామాల నుంచి ఇసుకను పొందడా నికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సుల్తానాబాద్‌ పట్టణంలో ఇసుకకు ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకున్న ఇసుక వ్యాపారులు రెండు వేలకు పైగా వసూలు చేస్తున్నారు.

ఇసుక డంపులు.. అధికారుల అండదండలు

సుల్తానాబాద్‌ మండల వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇసుక డంప్‌లు ఏర్పాటు చేసుకుని ఇసుక వ్యాపారులు సిండికేట్‌గా పెద్ద ఎత్తున ఇసుక వ్యాపారం చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. డంప్‌ల ద్వారా హైదరాబాద్‌కు సరఫరా చేశారు. పోలీసుల సహకారంతో డంపులు ఏర్పాటు చేసుకుని గట్టేపల్లి, కదంబాపూర్‌, నీరుకుల్ల తదితర గ్రామాల నుంచి ట్రాక్టర్ల ద్వారా నిత్యం వందలాది ట్రాక్టర్లతో ఇసుక నిల్వ చేశారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఇసుక రవాణాకు అనుమతులున్నాయి. నిబంధనలు గాలికి వదిలి పోలీసులు, ప్రజాప్రతినిధుల సహకారంతో వందల కొద్ది ట్రాక్టర్లతో ఇసుక రవాణా చేశారు. విషయం ఉన్నతాధికారులకు చేరడంతో దాడులు జరిగాయి. కొన్ని ట్రాక్టర్లను, లారీలను పట్టుకున్నారు. అయితే అధికారులు పట్టుకున్న డంపుల నుంచి కూడా ఇసుకను మాయం చేశారు. చివరకు అక్రమ ఇసుక వ్యాపారం మూలంగా ఒక అధికారిపై బదిలీ వేటు పడింది. అయినా ప్రస్తుతం మండలంలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. ఇప్పటికీ యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. మండలంలో ఇసుక మాఫియా అధికారులు, ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి తెస్తున్నారు.

ఎమ్మెల్యే సూచనలకు నీళ్లు చల్లిన వ్యాపారులు

నియోజకవర్గంలో ఇసుక సరసమైన ధరలకు అందించాలనే ఉద్ధేశ్యంతో ఎమ్మెల్యే విజయరమణారావు ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టారు. సుల్తానాబాద్‌ తదితర ప్రాంతాలకు ధరలను నిర్ణయించారు. ఇసుకను లారీల ద్వారా రవాణా చేయకూడదని, డంప్‌లు ఏర్పాటు, హైదరాబాద్‌ తరలించడం మానుకోవాలని సూచించారు. కానీ మండలంలోని కొందరు ఇసుక వ్యాపారులు ఎమ్మెల్యే సూచనలను పట్టించుకోకుండా అక్రమ వ్యాపారాలకు తెరలేపారు. డంపులు ఏర్పాటు చేసి లారీల ద్వారా హైదరాబాద్‌కు పెద్ద తరలిస్తున్నారు. కుటుంబ పోషణ కోసం ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్న వారు కొందరైతే ఎక్కువ మంది వ్యాపారుల అవతారం ఎత్తి అధిక ధరలకు ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

ఇసుక ధరలను నియంత్రించండి

నీరుకుళ్ల, గట్టేపల్లి గ్రామాల నుంచి ఒక ట్రాక్టర్‌ ఇసుక కోసం రెండు వేల రూపాయలను డిమాండ్‌ చేస్తున్నారని, అధికారులు ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకుని ధరలను నియత్రించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. అక్రమ రవాణా పై పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సామాన్యులకు అందుబాటులో ఇసుక ధరలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Dec 07 , 2025 | 11:46 PM