పెరుగుతున్న విష జ్వరాలు...
ABN , Publish Date - Oct 06 , 2025 | 11:42 PM
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. సోమవారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రోగుల తాకిడి పెరిగింది. కొత్త, పాత బిల్డింగ్ ఓపీ నమోదు కేంద్రాల వద్ద రోగులు బారులు తీరారు.
కళ్యాణ్‌నగర్, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): ఇటీవల కురిసిన భారీ వర్షాలతో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. సోమవారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రోగుల తాకిడి పెరిగింది. కొత్త, పాత బిల్డింగ్ ఓపీ నమోదు కేంద్రాల వద్ద రోగులు బారులు తీరారు. ఎక్కువగా టైఫాయిడ్, మలేరియా, ఒళ్లు నొప్పులు, జలుబు, వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగింది. విష జ్వరాలతో బాధపడుతున్న వారి సంఖ్య 500లకు చేరగా ఓపీలో ఇన్ పేషెంట్లుగా సుమారు 100మంది చికిత్స పొందుతున్నారు. గైనకాలజిస్ట్ విభాగంలో కూడా గర్భిణీలు బారులు తీరారు. సుమారు 1300మంది వివిధ వైద్య చికిత్సల కోసం రాగా ఫార్మసీ, రక్తపరీక్షల కేంద్రాల వద్ద రోగులతో కిటకిటలాడింది. నెల రోజులుగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో విష జ్వరాలు విజృంభిస్తూ ఇంటిలో ఒకరికి జ్వరం వస్తే అందరికి సోకుతుంది. మారుమూల ప్రాంతాల నుంచి కూడా భారీగా రోగులు వస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, సిర్వొంచ, మహారాష్ట్ర, ఆసిఫాబాద్, మహదేవపూర్ ప్రాంతాల నుంచి కూడా వైద్యం కోసం ఖని జనరల్ ఆసుపత్రికి వస్తుండడంతో రోగులతో ఇన్‌పేషెంట్లు వార్డులు నిండిపోతున్నాయి.
మెరుగైన వైద్యం అందిస్తున్నాం....
ఆర్‌ఎంఓ రాజు
సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో భారీ వర్షాలతో జ్వర పీడితుల సంఖ్య పెరిగింది. ఎక్కువ మంది జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రికి వస్తున్నారు. రోజు ఓపీ 1300 నుంచి 1500మంది వరకు రోగులు వస్తున్నారు. వారికి అన్నీ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందిస్తున్నాం. మందులను కూడా అందుబాటులో పెడుతున్నాం. వర్షాలతో కొత్తనీరు రావడంతో ఎక్కువ మంది వైరల్ ఫీవర్‌కు గురవుతున్నారు. నీటిని వేడి చేసి తాగాలి. ఆహార పదార్థాలు కూడా వేడిగా వండినవి తినాలి. బయట ఫుడ్‌ను తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.