Share News

రేషన్‌ షాపుల్లో ముక్కిపోతున్న దొడ్డు బియ్యం

ABN , Publish Date - Oct 17 , 2025 | 11:17 PM

రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌కార్డు లబ్ధిదారులకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఏప్రిల్‌ నుంచి సన్న బియ్యం పంపిణీ చేపడుతున్నది. సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ దుకాణాల్లో మిగిలిన దొడ్డు బియ్యాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని పలువురు రేషన్‌ డీలర్లు ఆరోపిస్తున్నారు.

రేషన్‌ షాపుల్లో ముక్కిపోతున్న దొడ్డు బియ్యం

ముత్తారం, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌కార్డు లబ్ధిదారులకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఏప్రిల్‌ నుంచి సన్న బియ్యం పంపిణీ చేపడుతున్నది. సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ దుకాణాల్లో మిగిలిన దొడ్డు బియ్యాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని పలువురు రేషన్‌ డీలర్లు ఆరోపిస్తున్నారు. దీంతో రేషన్‌ దుకాణాల్లో ఆరు నెలల నుంచి దొడ్డు బియ్యం అలాగే ముక్కిపోతున్నాయి. మండలంలోని 15 రేషన్‌ షాపులు ఉండగా, సుమారు 150 నుంచి 200 క్వింటాళ్ల వరకు డీలర్ల వద్ద దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. దొడ్డు బియ్యం నిల్వలు నెలల తరబడి పేరుకుపోయి పురుగులు పడి ముక్కిపోతున్నాయి. వర్షాలతో బియ్యం నిల్వలను భద్రపరచటానికి రేషన్‌ డీలర్ల ఇబ్బంది పడుతున్నారు. మరో పక్క ఎలుకలు, పందికొక్కులు, లక్క పురుగుల బెడద ఉందని ఆవేదన చెందుతున్నారు. కొన్ని చోట్ల ఇరుకు గదులు ఉండటంతో తాజాగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యం, పాతదొడ్డు బియ్యం కలిపి ఒకే చోట వేయాల్సి వస్తోందని, దొడ్డు బియ్యాన్ని త్వరగా వెనక్కి తీసుకోకుంటే పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని వాపోతున్నారు. బియ్యం తరిగిపోతే ఆ నష్టాన్ని ఎవరు భరించాలని రేషన్‌ డీలర్లు ఆందోళన చెందుతున్నారు.

దొడ్డు బియ్యం నిల్వలు క్లియర్‌ చేయాలి

- చెలుకల లింగా భవాని, రేషన్‌ డీలర్‌, పోతారం

ఆరు నెలలుగా దొడ్డు బియ్యం రేషన్‌ షాపుల్లోనే ఉంది. బియ్యాన్ని కాపాడేందుకు అష్టకష్టాలు పడుతున్నాం. బియ్యం త్వరగా వెనక్కి తీసుకుపోవాలి. లేకపోతే పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉన్నది. పూర్తిగా దెబ్బతింటే నష్టం ఎవరు భరించాలి. మరోవైపు షాపుల్లో స్థలం లేక తక్కువ బియ్యం తెచ్చుకుంటున్నాం. దీంతో బియ్యం పంపిణీలో జాప్యం జరుగుతున్నది. అధికారులు స్పందించి దొడ్డు బియ్యం నిల్వలు క్లియర్‌ చేయాలి.

Updated Date - Oct 17 , 2025 | 11:17 PM