Share News

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ మళ్లీ షట్‌డౌన్‌

ABN , Publish Date - Aug 14 , 2025 | 11:50 PM

రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌)లో గురువారం అమ్మోనియా పైప్‌లైన్‌ లీకేజీతో ఉత్పత్తి నిలిచిపోయింది. ప్లాంట్‌ను వెంటనే షట్‌డౌన్‌ చేశారు. ప్రాజెక్టులో నాణ్యత లేని అమ్మోనియా పైప్‌లైన్లు గుదిబండగా మారాయనే విమర్శలు తలెత్తుతున్నాయి.

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ మళ్లీ షట్‌డౌన్‌

కోల్‌సిటీ, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌)లో గురువారం అమ్మోనియా పైప్‌లైన్‌ లీకేజీతో ఉత్పత్తి నిలిచిపోయింది. ప్లాంట్‌ను వెంటనే షట్‌డౌన్‌ చేశారు. ప్రాజెక్టులో నాణ్యత లేని అమ్మోనియా పైప్‌లైన్లు గుదిబండగా మారాయనే విమర్శలు తలెత్తుతున్నాయి. ప్రాజెక్టులో ఉత్పత్తి ప్రారంభమైనప్పటి నుంచి ఈ అమ్మోనియా పైప్‌లైన్లు లీకేజీలతో సతాయిస్తున్నాయి. గత నెల 16న ఇదే అమ్మోనియా పైప్‌లైన్‌ లీకేజీతో ప్లాంట్‌ షట్‌డౌన్‌ అయ్యింది. ఈనెల 4న ఉత్పత్తిలోకి వచ్చింది. రాష్ట్రం లో యూరియా కొరత తీవ్రంగా ఉండడం, కేంద్రం నుంచి కోటాకు తగ్గట్టు యూరియా సరఫరా చేయకపోవడంతో రైతాంగం ఆందోళనకు గురవుతోంది. ఈ పరిస్థితుల్లో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నుంచి ఆగస్టులో తెలం గాణకు 65వేల టన్నుల యూరియాను సరఫరా చేయాలని డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ ఫెర్టిలైజర్స్‌ కోటా ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ ఆర్‌ఎఫ్‌సీఎల్‌ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చింది. దీంతో 4వ తేది నుంచి 14వ తేది వరకు పది రోజుల సమయంలోనే 20వేల టన్నులు రాష్ట్రానికి యూరియా సరఫరా చేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాలు అయిన ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌తో పాటు మిర్యాలగూడ, తదితర ప్రాంతాలకు యూరియాను సరఫరా చేశారు. గురువారం కూడా నిజామాబాద్‌కు యూరియా రేక్‌ను పంపారు. రాష్ట్రంలో యూరియా అవసరాలు పెరిగిపోయిన పరిస్థితుల్లో డిమాం డ్‌ను బట్టి ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నుంచి సరఫరా చేస్తున్నారు. ఉమ్మడి కరీం నగర్‌ జిల్లాకే 6వేల టన్నులు సరఫరా చేశారు. ఇటీవల రామగుండం నియోజకవర్గంలో యూరియా కొరత ఏర్పడడంతో ఎమ్మెల్యే రాజ్‌ ఠాకూర్‌ విజ్ఞప్తితో అదనంగా యూరియాను సరఫరా చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో గురువారం ప్లాంట్‌లో సాంకేతిక అవరోధాలతో ఉత్పత్తి నిలిచిపోవడంతో రాష్ట్ర వ్యవసాయ శాఖవర్గాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నుంచి నెలాఖరు వరకు 50వేల నుంచి 55వేల టన్నుల రవాణాకు అవకాశం ఉండేది. కానీ ప్లాంట్‌ షట్‌డౌన్‌తో పూర్తి అంతరాయం ఏర్పడింది. తిరిగి ప్లాంట్‌ ఉత్పత్తిలోకి రావాలంటే కనీసం వారం నుంచి పది రోజులు పట్టే అవకాశం ఉంది.

అమ్మోనియా పైప్‌లైన్‌లలో మరిన్ని సాంకేతిక ఇబ్బందులు ఉన్నట్టు తెలుస్తుంది. ఇటీవల ప్లాంట్‌ మరమ్మతు సమయంలోనే బలహీనంగా ఉన్న పైప్‌లైన్లను గుర్తించినా యూరియా డిమాండ్‌ దృష్టిలో ఉం చుకుని నడిపించే ప్రయత్నం చేసినట్టు చర్చ జరుగుతుంది. వరస సాంకేతిక వైఫల్యాలు ఆర్‌ఎఫ్‌సీఎల్‌ వర్గాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రెండు సార్లు ప్లాంట్‌ షట్‌డౌన్‌ అయ్యింది. ప్లాంట్‌ మరమ్మతులపై వెంటనే నిర్ణయం తీసుకో లేని పరిస్థితులు ఉన్నాయి. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ హెడ్‌ క్వార్టర్‌ నోయిడాలో ఉండడం, విధానపరమైన నిర్ణయాల్లో జాప్యం ఏర్పడుతుందనే విమర్శ లున్నాయి. గత నెలలో ప్లాంట్‌ షట్‌డౌన్‌ అయితే నాలుగైదు రోజులకు కానీ పూర్తి స్థాయిలో స్పందించని పరిస్థితులు ఉన్నాయి. ఆర్‌ఎఫ్‌ సీఎల్‌కు దేశ వ్యాప్తంగా మరెక్కాడా ప్లాంట్‌లు లేవు. రామగుండంలో ప్లాంట్‌ ఉంటే కేంద్ర కార్యాలయం నోయిడాలో ఉండడం షట్‌డౌన్‌ వంటి అత్యవసర పరిస్థితుల్లో అప్రువల్స్‌కు జాప్యం జరుగుతుందనే విమర్శలున్నాయి. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో యూరియా ఉత్పత్తి నిలిచిపోయిన విషయమై యాజమాన్య వర్గాలను సంప్రదించే ప్రయత్నాలు చేయగా ఎవరూ స్పందించడం లేదు.

Updated Date - Aug 14 , 2025 | 11:50 PM