Share News

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ కార్యాలయం ఇక్కడే ఉండాలి

ABN , Publish Date - Dec 13 , 2025 | 11:58 PM

రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌) కేంద్ర కార్యాలయాన్ని నోయిడా నుంచి రామగుండానికి తరలించాలనే ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే ఫెర్టిలైజర్స్‌ స్టాండింగ్‌ కమిటీలో సభ్యుడిగా ఉన్న ఈటెల రాజేందర్‌, కాంగ్రెస్‌ ఎంపీ బలరాంనాయక్‌, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, రామగుండం శాసన సభ్యుడు మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. అయినా కేంద్ర ఎరువుల మంత్రిత్వశాఖ నుంచి సరైన స్పందన రావడం లేదు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో వరుస సాంకేతిక అవరోధాలతో ప్లాంట్‌ షట్‌ డౌన్‌ అవుతుంది.

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ కార్యాలయం   ఇక్కడే ఉండాలి

కోల్‌సిటీ, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌) కేంద్ర కార్యాలయాన్ని నోయిడా నుంచి రామగుండానికి తరలించాలనే ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే ఫెర్టిలైజర్స్‌ స్టాండింగ్‌ కమిటీలో సభ్యుడిగా ఉన్న ఈటెల రాజేందర్‌, కాంగ్రెస్‌ ఎంపీ బలరాంనాయక్‌, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, రామగుండం శాసన సభ్యుడు మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. అయినా కేంద్ర ఎరువుల మంత్రిత్వశాఖ నుంచి సరైన స్పందన రావడం లేదు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో వరుస సాంకేతిక అవరోధాలతో ప్లాంట్‌ షట్‌ డౌన్‌ అవుతుంది. హల్దర్‌ టాప్స్‌ సమకూర్చిన హెచ్‌టీఆర్‌ టెక్నాలజీ వైఫల్యం చెందడంతో తరచూ షట్‌డౌన్‌లు కలుగడం, వాటిని సరి చేసే సమయంలో నిర్ణయాల జాప్యం వల్ల సరైన సమయంలో మరమ్మతులు పూర్తికాక ఉత్పత్తికి నష్టం ఏర్పడుతుంది. తద్వారా తెలంగాణ రైతాంగానికి యూరియా సరఫరాలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. గత వర్షాకాల సీజన్‌లో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ షెట్‌డౌన్‌ కావడం, రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడ్డ పరిస్థితుల్లో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ వైఫల్యాలపై చర్చ జరిగింది. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా ఆర్‌ఎఫ్‌సీఎల్‌ సింగిల్‌ యూనిట్‌ ప్లాంట్‌గా ఉన్నా కేంద్ర కార్యాలయం ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఉండడం ఏమిటనే ప్రశ్న కూడా మొదలైంది. క్లిష్టమైన సమయంలో సంస్థ సీఈఓ, డైరెక్టర్‌(ఫైనాన్స్‌), హెచ్‌ఆర్‌ డైరెక్టర్లు నోయిడాలో ఉండడం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం ఏర్పడుతుందనే విమర్శలు న్నాయి. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ షట్‌డౌన్‌ నుంచి ఉత్పత్తి ప్రారంభమైన తరువాత కూడా మళ్లీ ఐదారుసార్లు చిన్న చిన్న కారణాలతో ఉత్పత్తికి విఘాతాలు ఏర్పడ్డాయి. స్థానిక నిపుణులు వెంట వెంటనే సరి చేసి ప్లాంట్‌ ఉత్పతికి నష్టం కాకుండా చూశారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ యేటా 12లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో పని చేయాల్సి ఉంటుంది. సాంకేతిక అవరోధాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తద్వారా ప్లాంట్‌ ఆర్థికంగా నష్టాలు చవి చూస్తుంది. రుణాలు తీసుకున్న ఆర్థిక సంస్థలకు చెల్లింపులు, గ్యాస్‌ చార్జీల చెల్లింపు వంటివి సంస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ఆర్థికంగా నష్టాలకు గురైతే గతంలో ఎఫ్‌సీఐ మాదిరి పరిస్థితి వస్తుందనే ఆందోళన కూడా అటు అధికారులు, ఇటు ఉద్యోగుల్లో వ్యక్తమవుతుంది.

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రెండు రోజుల క్రితం మరోమారు ఆర్‌ఎఫ్‌సీఎల్‌ కేంద్ర కార్యాలయం నోయిడా నుంచి రామగుండం తరలిం చాలని ఎరువులు, రసాయనాల శాఖ కార్యదర్శి రజత్‌ మిశ్రాకు లేఖ రాశారు. అవసరమైతే ఈ అంశాన్ని పార్లమెంట్‌ లోనూ లేవ నెత్తుతామని పేర్కొన్నారు. ఇప్పటికే ఆర్‌ఎఫ్‌సీఎల్‌ టెక్నాలజీ వైఫల్యంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పలు ప్లాంట్లను పునరుద్ధరించినా ఎక్కడా లేని సాంకేతిక అవరోధాలు, వైఫల్యాలు ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఏర్పడడం కేంద్ర ప్రభుత్వానికి కూడా తలనొప్పిగా మారింది. ఇప్పటికే హెచ్‌టీఆర్‌ఎస్‌ పునరుద్ధరించే బాధ్యత హల్దర్‌ టాప్స్‌దేనంటూ కేంద్ర ఎరువుల మంత్రిత్వశాఖ ఖరాఖండిగా చెబుతుంది. ఈ వివాదం మరింత ముదిరితే బాధ్యత ఎవరి మెడకు పడుతుందోననే ఆందోళన కూడా ఉన్నత స్థాయి వర్గాల్లో ఉంది. దీనిపై పార్లమెంట్‌లో చర్చ మొదలైతే పరిస్థితి ఏమిటనే ఆందోళన కూడా ఉంది.

ఉన్నతాధికారుల లాబీయింగే అడ్డంకి...

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ కేంద్ర కార్యాలయాన్ని నోయిడా నుంచి తరలించే విషయంలో ఉన్నతాధికారుల లాబియింగే అడ్డుపడుతుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర కార్యాలయంలో ఉన్న కొందరు ఉన్నతాధికా రులు కార్యాలయ తరలింపుతో తాము క్షేత్రస్థాయిలోకి వెళ్లాల్సి వస్తుందనే భావనతో ఉన్నట్టు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తాల్చేర్‌ యూనిట్‌కు దగ్గరలోని ఆ సంస్థకు చెందిన కేంద్ర కార్యాలయాన్ని తరలిం చింది. అదే రీతిలో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ కేంద్ర కార్యాలయాన్ని తరలించాలనే వాదన కూడా ఉంది.

రిటైర్‌మెంట్ల వరుసలో ఉన్నతాధికారులు

ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో కీలక బాధ్యతల్లో ఉన్న పలువురు ఉన్నతాధికారులు రిటైర్డ్‌మెంట్‌ వరుసలో ఉన్నారు. ప్లాంట్‌ చైర్మన్‌ హీరానంద్‌ ఫిబ్రవరిలో రిటైర్డ్‌ కానున్నారు. సీఈఓ మనోహరన్‌ ఈఐఎల్‌కు చెందిన వారు. ఒప్పం దం ప్రకారం జనవరి 7వరకు మాత్రమే ఈఐఎల్‌కు సీఈఓ బాధ్యతలు ఉంటాయి. అలాగే ప్లాంట్‌ హెడ్‌గా వ్యవహరిస్తున్న రాజీవ్‌ కుల్బే కూడా జనవరిలో రిటైర్డ్‌ కానున్నారు. కొత్త ఏడాదిలో ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు కొత్త టీమ్‌ వచ్చే అవకాశం ఉంది. ఈ లోగా కేంద్ర కార్యాలయం తరలింపుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిస్తుందా లేదా అని వేచి చూడాల్సిందే.

Updated Date - Dec 13 , 2025 | 11:58 PM