ఎట్టకేలకు ఉత్పత్తి దశలోకి ఆర్‌ఎఫ్‌సీఎల్
ABN , Publish Date - Sep 30 , 2025 | 11:00 PM
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్‌ఎఫ్‌సీఎల్)ను 46రోజుల విరామం తరువాత ఎట్టకేలకు మంగళవారం ఉత్పత్తి దశలోకి తీసుకువచ్చారు. ప్లాంట్‌ను లైట్ అప్ చేశారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో కీలకమైన హెచ్‌టీఆర్ ఫెయిల్ అయ్యింది. ప్రయోగాత్మకంగా కేవలం ఆర్‌ఎఫ్‌సీఎల్‌లోనే ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టారు.
కోల్‌సిటీ, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్‌ఎఫ్‌సీఎల్)ను 46రోజుల విరామం తరువాత ఎట్టకేలకు మంగళవారం ఉత్పత్తి దశలోకి తీసుకువచ్చారు. ప్లాంట్‌ను లైట్ అప్ చేశారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో కీలకమైన హెచ్‌టీఆర్ ఫెయిల్ అయ్యింది. ప్రయోగాత్మకంగా కేవలం ఆర్‌ఎఫ్‌సీఎల్‌లోనే ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. పునరుద్ధరించిన ఐదు ఎరువుల కర్మాగారాల్లో రామగుండంలోనే ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టడం వల్ల ప్లాంట్ ఆరంభం నుంచే సమస్యలు ఉత్పత్తన్నమయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో హెచ్‌టీఆర్‌ను బైపాస్ చేసి ఉత్పత్తి చేస్తున్నారు. ప్లాంట్ రోజుకు 3850టన్నుల సామర్థ్యం కాగా హెచ్‌టీఆర్‌ను బైపాస్ చేయడంతో రోజుకు 3500టన్నుల నుంచి 3600టన్నులు ఉత్పత్తి చేశారు. హెచ్‌టీఆర్ పని చేయకపోవడంతో గ్యాస్ ఒత్తిడిలో హెచ్చు తగ్గులు వచ్చి అమ్మోనియా పైప్‌లైన్ లీకైంది. దీంతో ఆగస్టు 14న ఉత్పత్తి నిలిపివేశారు. ప్లాంట్‌ను ఎలా పునరుద్ధరించాలనే విషయాలపై మల్లగుల్లాలు పడ్డారు. చివరికి ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు టెక్నాలజీ సరఫరా చేసిన డెన్మార్క్‌కు చెందిన హల్దర్ టాప్స్ సంస్థ ఇంజనీర్ వచ్చే వరకు ప్లాంట్‌లో మరమ్మతులు సాధ్యం కాలేదు. ఎల్‌అండ్‌టీ నిపుణుల సహకారంతో మరమ్మతు పనులు చేశారు. ఈ హెచ్‌టీఆర్‌ను మరమ్మతు చేయాలంటే సాధ్యమయ్యే పరిస్థితి లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా ప్రైమరీ రిఫార్మర్ ద్వారానే ఉత్పత్తి జరిగేలా చర్యలు చేపట్టారు. ఇందుకు విడిభాగాల మరమ్మతులు చేశారు. కొన్ని విడి భాగాలను హైదరాబాద్‌కు పంపించి రిపేర్లు చేయించారు. 46రోజుల పాటు ఉత్పత్తి నిలిచిపోవడంతో ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు 1.77లక్షల టన్నుల ఉత్పత్తి నష్టం జరిగింది. రూ.120కోట్ల వరకు ఆర్థిక నష్టం ఏర్పడింది. కీలకమైన సమయంలో ప్లాంట్ ఉత్పత్తి నిలిచిపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళనకు గురయ్యాయి. తెలంగాణలో తీవ్ర యూరియా కొరత ఏర్పడింది. వర్షాకాల సీజన్‌లో గతంలో ఆర్‌ఎఫ్‌సీఎల్ నుంచే సుమారు 2.5లక్షల టన్నుల యూరియా సరఫరా జరిగేది. ఈ సారి ప్లాంట్‌లో సాంకేతిక అవరోధాల మూలంగా యూరియా సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌లు ఆర్‌ఎఫ్‌సీఎల్ వైఖరిని తప్పుపట్టారు. ఒక సమయంలో ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉత్పత్తి నిలిపివేతపై రాష్ట్ర ప్రభుత్వవర్గాలు సందేహాలు కూడా వ్యక్తం చేశాయి. ఇంటెలిజెన్స్‌తో విచారణ జరిపించాయి. ప్లాంట్‌లో ఉన్న స్టాక్‌ను పెద్దపల్లి జిల్లా అవసరాలకు ఆర్‌ఎఫ్‌సీఎల్ యాజమాన్యం ఇచ్చింది. ఆర్‌ఎఫ్‌సీఎల్ మరమ్మతులు కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వశాఖ కార్యదర్శి రజత్ కుమార్ ఎప్పటికప్పుడు సమీక్షించారు. ప్లాంట్‌లో బుధవారం యూరియా ఉత్పత్తి జరుగనున్నది. రోజుకు 3850టన్నుల సామర్థ్యం గల ప్లాంట్‌లో మొదట తక్కువ లోడ్‌తో ఉత్పత్తి చేయాలనే ఆలోచనతో యాజమాన్యం ఉన్నది. నెల రోజుల్లో యాసంగి సీజన్ ప్రారంభమవుతున్న పరిస్థితుల్లో ఆర్‌ఎఫ్‌సీఎల్ ఉత్పత్తిలోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు కూడా ఊపిరి పీల్చుకున్నాయి. రాష్ట్ర వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు ఆర్‌ఎఫ్‌సీఎల్ యాజమాన్యంతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారు.