Share News

స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు..

ABN , Publish Date - Sep 28 , 2025 | 01:19 AM

జిల్లాలోని ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మూడు రోజులుగా రిజర్వేషన్లపై కసరత్తు చేస్తున్న అధికారులు ఎట్టకేలకు శనివారం ప్రక్రియను పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదించారు. జడ్పీ చైర్మన్‌ స్థానాన్ని జనరల్‌ మహిళకు కేటాయించారు.

స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు..

జగిత్యాల, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మూడు రోజులుగా రిజర్వేషన్లపై కసరత్తు చేస్తున్న అధికారులు ఎట్టకేలకు శనివారం ప్రక్రియను పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదించారు. జడ్పీ చైర్మన్‌ స్థానాన్ని జనరల్‌ మహిళకు కేటాయించారు. కాగా జిల్లాలోని 20 జడ్పీటీసీ, 20 ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేసినా అధికారులు అధికారికంగా ప్రకటించలేదు. కాగా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నంబర్‌ 9ను అధికారికంగా విడుదల చేసింది. ఎస్టీ, ఎస్సీ, బీసీలు ఇలా అన్ని కేటగిరీల్లో 50 శాతం మహిళలకు రిజర్వు చేయనున్నారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన ఓటరు జాబితా, రిజర్వేషన్లను అధికారులు తయారు చేశారు. పీఓలు, ఏపీఓలను నియామకం చేసి శిక్షణ సైతం పూర్తి చేశారు. ఎన్నికల సంఘం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్‌ వెలువరించే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత అధికార వర్గాలు అంటున్నాయి.

ఫముగిసిన ప్రక్రియ..

వంద శాతం ఎస్టీ జనాభా కలిగిన పంచాయతీల్లో సర్పంచి స్థానం సహా వార్డు సభ్యుల స్థానాలు ఎస్టీలకే రిజర్వ్‌ అవుతాయి. ఎస్టీ, ఎస్సీలకు 2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తారు. కలెక్టర్‌ సత్యప్రసాద్‌, అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత, లోకల్‌బాడీ అడిషనల్‌ కలెక్టర్‌ రాజాగౌడ్‌, జడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి, డీపీవో మదన్‌ మెహన్‌తో పాటు ఎంపీడీవోలు, ఎంపీవోలు కలెక్టర్‌ సమావేశ మందిరంలో ఆయా మండలాలకు సంబంధించి ఓటర్ల జాబితాల ఆధారంగా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను ముగించారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఆదేశాల దృష్ట్యా రిజర్వేషన్‌ ప్రక్రియ వివరాలు బయటకు రాకుండా తగు జాగ్రత్తలను అధికార యంత్రాంగం తీసుకుంది. రిజర్వేషన్లు వివరాలు ముందుగా బయటికి వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించినట్లు తెలుస్తోంది.

ఫసర్పంచ్‌, ప్రాదేశిక ఎన్నికలకు సన్నద్ధం

జిల్లాలోని 20 జడ్పీటీసీ, 20 ఎంపీపీ, 216 ఎంపీటీసీల స్థానాలకు అవసరమయ్యే నోడల్‌ అధికారులను ఎంపిక చేశారు. 20 మండలాల్లోని 385 జీపీల్లో సర్పంచులు, వార్డు సభ్యులకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ ముగించి వాటికి సంబంధించిన ముందస్తుగా ప్రణాళికలను అధికారులు సిద్ధం చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం సరిపడా ఉద్యోగులు, ఇతర అన్ని రకాల పనులను ఇదివరకే పూర్తి చేశారు. బ్యాలెట్‌ పత్రాలు, పోస్టల్‌ ఓట్ల వ్యవహారం, వివిధ రకాల బాఽధ్యతలు అప్పగించనున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన పనులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ మేరకు జాబితాకు కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ఆమోదముద్ర వేశారు. అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత, లోకల్‌ బాడీ అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌, జడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి, డీపీవో మదన్‌మోహన్‌లతో పాటు పలువురు జిల్లా అధికారులకు వివిధ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను అప్పగించనున్నారు.

మండలం... జడ్పీటీసీ రిజర్వేషన్‌....ఎంపీపీ రిజర్వేషన్‌

బీర్‌పూర్‌ - ఎస్టీ జనరల్‌ - ఎస్టీ జనరల్‌

ఎండపల్లి - ఎస్సీ మహిళ - ఎస్సీ మహిళ

మల్యాల - ఎస్సీ మహిళ - ఎస్సీ జనరల్‌

కొడిమ్యాల - ఎస్సీ జనరల్‌ - ఎస్‌సీ జనరల్‌

గొల్లపల్లి - ఎస్సీ జనరల్‌ - బీసీ మహిళ

పెగడపల్లి - బీసీ మహిళ - బీసీ జనరల్‌

జగిత్యాల - బీసీ మహిళ - బీసీ జనరల్‌

బీమారం - బీసీ మహిళ - బీసీ మహిళ

మేడిపల్లి - బీసీ మహిళ - బీసీ జనరల్‌

రాయికల్‌ - బీసీ మహిళ - బీసీ మహిళ

కోరుట్ల - బీసీ జనరల్‌ - బీసీ మహిళ

వెల్గటూరు - బీసీ జనరల్‌ - బీసీ జనరల్‌

సారంగపూర్‌ - బీసీ జనరల్‌ - జనరల్‌

మెట్‌పల్లి - బీసీ జనరల్‌ - జనరల్‌ మహిళ

బుగ్గారం - జనరల్‌ మహిళ - ఎస్సీ మహిళ

మల్లాపూర్‌ - జనరల్‌ మహిళ - జనరల్‌

కథలాపూర్‌ - జనరల్‌ మహిళ - జనరల్‌

ఇబ్రహీంపట్నం - జనరల్‌ - జనరల్‌

ధర్మపురి - జనరల్‌ - జనరల్‌ మహిళ

జగిత్యాల రూరల్‌ - జనరల్‌ - జనరల్‌ మహిళ

Updated Date - Sep 28 , 2025 | 01:19 AM