Share News

గ్రామ దేవతల కట్టడాల తొలగింపు

ABN , Publish Date - Nov 06 , 2025 | 11:47 PM

రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని రహదారుల డివైడర్లు, రోడ్ల పక్కన కూడళ్ల ప్రాంతాల్లో గ్రామ దేవతలను పూజించేందుకు నిర్మించిన కట్టడాలను రామగుండం నగర పాలక యంత్రాంగం గురువారం తెల్లవారుజామున కూల్చివేసింది.

గ్రామ దేవతల కట్టడాల తొలగింపు

కోల్‌సిటీ, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని రహదారుల డివైడర్లు, రోడ్ల పక్కన కూడళ్ల ప్రాంతాల్లో గ్రామ దేవతలను పూజించేందుకు నిర్మించిన కట్టడాలను రామగుండం నగర పాలక యంత్రాంగం గురువారం తెల్లవారుజామున కూల్చివేసింది. కార్పొరేషన్‌ సిబ్బంది ఎక్స్‌కావేటర్లు, ట్రాక్టర్లతో సుమారు 40కిపైగా కట్టడాలను తొలగించారు. దీనిపై బీజేపీ, దాని అనుబంధ సంఘాలు, హిందు ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం గోదావరిఖని మెయిన్‌ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

కూల్చివేసిన దారి మైసమ్మ గుడిని పునర్‌ నిర్మిస్తామంటూ పూజలు చేశారు. ఈ సందర్భంగా ఐక్య వేదిక నాయకులు అయోధ్య రవీందర్‌, సంతోష్‌రెడ్డి మాట్లాడుతూ అర్థరాత్రి మైసమ్మ గుళ్లను తొలగించి మెజార్టీ హిందువుల మనోభావాలను దెబ్బతీశారని, దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ సొంత ఖర్చులతో వీటిని పునర్‌ నిర్మాణం చేయాలని డిమాండ్‌ చేశారు. నాయకులు రాంమూర్తి, సత్యం, అంజన్న, అడిగొప్పుల రాజు, మేరుగు హన్మంతుగౌడ్‌, కోమళ్ల మహేష్‌, మునగాల రాజు, కొండపర్తి సంజీవ్‌, ముస్కుల భాస్కర్‌రెడ్డి, పిడుగు కృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2025 | 11:47 PM