ఎర్లీబర్డ్ ఆఫర్‌లో రామగుండం టాప్
ABN , Publish Date - May 04 , 2025 | 11:44 PM
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్‌లలో ప్రవేశపెట్టిన ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపు పథకం (ఎర్లీ బర్డ్ ఆఫర్)లో రాష్ట్రంలోనే రామగుండం నగరపాలక సంస్థ రికార్డు స్థాయిలో పన్ను వసూలు చేసి ప్రథమ స్థానంలో నిలిచింది. వార్షిక డిమాండ్‌లో 47.6శాతం పన్ను వసూలు సాధించింది.
కోల్‌సిటీ, మే 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్‌లలో ప్రవేశపెట్టిన ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపు పథకం (ఎర్లీ బర్డ్ ఆఫర్)లో రాష్ట్రంలోనే రామగుండం నగరపాలక సంస్థ రికార్డు స్థాయిలో పన్ను వసూలు చేసి ప్రథమ స్థానంలో నిలిచింది. వార్షిక డిమాండ్‌లో 47.6శాతం పన్ను వసూలు సాధించింది. వార్షిక డిమాండ్ 2025-26లో రూ.18.94కోట్లు ఉండగా ఎర్లీబర్డ్ ఆఫర్‌లో రూ.9కోట్లకు పైగా ఈనెల 3వ తేదీ నాటికే వసూలు అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించే వారికి 5శాతం రాయితీ ప్రకటించడంతో సింగరేణి, ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్ సంస్థలతోపాటు ప్రైవేట్ సంస్థల నుంచి కూడా పన్ను వసూళ్లకు ఒత్తిడి పెంచారు. కార్పొరేషన్ ప్రత్యేక అధికారి కోయ శ్రీహర్ష, కార్పొరేషన్ ఇన్‌చార్జి కమిషనర్‌గా వ్యవహరిస్తున్న అరుణశ్రీలు 5శాతం రాయితీ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించారు. మున్సిపల్ కార్పొరేషన్‌లో ఇటీవల ప్రభుత్వ నియామకాలతో ఉద్యోగుల సంఖ్య పెరగడంతో ప్రతీ డివిజన్‌కు వార్డు ఆఫీసర్లు, వారికి అసిస్టెంట్లను నియమించారు. శానిటేషన్, రెవెన్యూ విభాగాలు సమన్వయంతో మెదలాలని ఆదేశించారు. ఈ క్రమంలో 5శాతం రాయితీ ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌తో పాటు సింగరేణి, జెన్‌కోలు కూడా ఆస్తి పన్ను చెల్లిం చాయి. సింగరేణి రూ.1.3కోట్లు, ఆర్‌ఎఫ్‌సీఎల్ రూ.1.2 కోట్లు, ఎన్‌టీపీసీ రూ.4కోట్లు చెల్లించగా బీ థర్మల్ కేం ద్రం మూసివేతకు గురి కావడంతో జెన్‌కో రూ.5లక్షలు పన్నులు చెల్లించింది.