వర్షం... నష్టం
ABN , Publish Date - Oct 05 , 2025 | 11:00 PM
మండల వ్యాప్తంగా ఆదివారం కురిసిన భారీ వర్షానికి వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఓదెల, కొలనూర్, పొత్కపల్లి, కనగర్తి, నాంసానిపల్లి, లంబాడ తండా తోపాటు పలు గ్రామాల్లో గాలితో కూడిన భారీ వర్షానికి వరి పంటలు నీట మునిగాయి. అలాగే సేకరణకు సిద్ధంగా ఉన్న పత్తి పంటలో నీరు చేరి తీవ్ర నష్టానికి గురిచేశాయి.
ఓదెల, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి) : మండల వ్యాప్తంగా ఆదివారం కురిసిన భారీ వర్షానికి వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఓదెల, కొలనూర్, పొత్కపల్లి, కనగర్తి, నాంసానిపల్లి, లంబాడ తండా తోపాటు పలు గ్రామాల్లో గాలితో కూడిన భారీ వర్షానికి వరి పంటలు నీట మునిగాయి. అలాగే సేకరణకు సిద్ధంగా ఉన్న పత్తి పంటలో నీరు చేరి తీవ్ర నష్టానికి గురిచేశాయి. ప్రస్తుతం పాల దశ దాటి ఇప్పుడిప్పుడే గొలుసు దశకు చేరుకుంటున్న వరి పంటలలో నీటి వరదలు, వర్షానికి నేలమట్టమై పంటలు ఉపయోగం లేకుండా పోయాయి. భారీ వర్షానికి ఓదెల, ఉప్పరపల్లి రైల్వే అండర్ బ్రిడ్జిల్లోకి నీరు చేరింది. దీంతో కొమిర, పొత్కపల్లి, మండల సరిహద్దు గ్రామమైన ఉప్పరపల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. యాసంగి బోనస్ కోసం ఎదురుచూస్తున్న రైతులకు ప్రస్తుతం చేతికి వందే వచ్చే సమయంలోనే వరి పంటలు నేలమట్టం కావడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. మరో వారం రోజుల వరకు పత్తి సేకరణ పూర్తి కావస్తున్న సమయంలోనే వర్షాలు పడటంతో నాణ్యమైన కాటన్ రంగు మారి తక్కువ ధర పలికే పరిస్థితి ఉంది. అలాగే చివరిగా వేసిన ప్రతి పంటలు చేతికి అంది వచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం ముందు సాగు చేసిన పతి పంటలు తీవ్ర నష్టం వాటిల్లడంతో రైతులు కోలుకోలేని పరిస్థితి నెలకొంది.
ఎలిగేడు, (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సుమారు రెండు గంటలపాటు ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా ఈదురుగాలులు, పిడుగులతో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కురిసిన వర్షానికి రోడ్లన్ని జలమయమై నీటితో నిండిపోయాయి. అలాగే వర్షం ధాటికి పొలాలు నేలకొరిగాయి. దీంతో రైతులు పొట్ట దశలో ఉన్న పొలాలు నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన చెందుతున్నారు. మరికొన్ని పొలాలు పాలు పోసే దశలో ఉండగా వర్షం వల్ల ఆశించిన దిగుబడి రాకపోవచ్చని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అండర్ బ్రిడ్జితో ప్రయాణికుల కష్టాలు
- వరదనీటిలో చిక్కుకున్న ట్రాక్టర్
పెద్దపల్లి రూరల్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని కొత్తపల్లిలో నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జిలో వరద నీరు చేరి ప్రయాణికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన ట్రాక్టర్ యజమాని ట్రాక్టర్‌తో నీటి నుంచి దాటే ప్రయత్నం చేయగా వరద నీటిలోనే మునిగిపోవడంతో ట్రాక్టర్‌ను వదిలి బయటపడ్డారు. వరద నీరు బయటికి వెళ్తే కాని ట్రాక్టర్ బయటకు రాని పరిస్థితి నెలకొంది. బ్రిడ్జి నిర్మాణం చేపట్టినప్పటి నుంచి ఇబ్బందులు ఏర్పడుతున్నా సంబంధిత కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదని, అవగాహన లేకుండా బ్రిడ్జి నిర్మించి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. వరద నీరు ఉండటంతో ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండలాలతో పాటు, కొత్తపల్లి గ్రామానికి వెళ్లేందుకు రాకపోకలు నిలిచిపోయాయి. అండర్ బ్రిడ్జిలో వరదనీరు నిల్వ ఉండకుండా అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.