Share News

వాన... వరద...

ABN , Publish Date - Aug 29 , 2025 | 12:32 AM

జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగుతున్నాయి. వీటికి తోడు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి సుమారు 8 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలి పెట్టడంతో తీర ప్రాంతంలో వేసిన వరి, పత్తి పంటలు నీట మునిగాయి.

వాన... వరద...

పెద్దపల్లి, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగుతున్నాయి. వీటికి తోడు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి సుమారు 8 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలి పెట్టడంతో తీర ప్రాంతంలో వేసిన వరి, పత్తి పంటలు నీట మునిగాయి. రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌ గురువారం ఉదయం ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి వరద ప్రవాహం గురించి తెలుసుకున్నారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మంథనిలో గోదావరి వరద ఉధృతిని పరిశీలించారు. వర్షాల వల్ల పట్టణ ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లాలో ఉదయం వరకు 20.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. అత్యధికంగా ధర్మారం మండలంలో 40.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సుల్తానాబాద్‌ మండలంలో 34.1, జూలపల్లి మండలంలో 31.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఆయా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షాలతో మంథని, రామగుండం, సుల్తానాబాద్‌, జూలపల్లి, ధర్మారం మండలాల్లో వరి, పత్తి పంటలు నీట మునిగాయి. వాగులు, హుస్సేనిమియా వాగు ఉధృతంగా ప్రవహించింది. గోదావరిఖని ప్రాంతంలో గల ఓసీపీ ప్రాజెక్టుల్లో భారీ వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 8 లక్షల క్యూసెక్కుల నీటిని వదలడంతో గోదావరిఖనిలో బ్రిడ్జి సమీపంలో గల సమ్మక్క, సారలమ్మ గద్దెల వరకు, లారీ యార్డులోకి వరద నీరు రావడంతో రెండు లారీలు సగం వరకు నీట మునిగాయి. మంథనిలో తీర ప్రాంతంలో వేసిన వరి, పత్తి పంటలు నీట మునిగాయి. మధ్యాహ్నాం వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేదు. హుస్సేనిమియా ఉధృతంగా ప్రవహించడంతో వడుకాపూర్‌, ధూళికట్ట గ్రామాల మధ్య రాకపోకలు నిలిచి పోయాయి.

ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన తొలి సీఎం

పెద్దపల్లి, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన తొలి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కావడం గమనార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లంపల్లి వద్ద గోదావరి నదిపై శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో 5,400 కోట్ల వ్యయంతో చేపట్టారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు ప్రాజెక్టు పనులు 90 శాతం వరకు పూర్తి కాగా మిగులు పనులను అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2016లో పూర్తి చేసింది. ఆగస్టు 4వ తేదీ నుంచి ఇందులో నీటిని నిల్వ చేయడం ఆరంభించారు. అయితే ఆప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించ లేదు. కాంగ్రెస్‌ హయాంలో దీనిని ప్రాణహిత- చేవేళ్ల ప్రాజెక్టులో భాగంగా ఈ ప్రాంతానికి సాగు, తాగునీటిని అందిస్తూనే చేవేళ్ల వరకు నీటిని ఎత్తి పోసేందుకు వాడుకోవాలని రూపకల్పన చేశారు. ప్రాణహిత- చేవేళ్లను రీడిజైన్‌ చేసి సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించి పంప్‌హౌస్‌ల ద్వారా ఎల్లంపల్లిలోకి నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించారు. కాళే శ్వరం ప్రాజెక్టు పూర్తి చేసినా కూడా శ్రీపాద ఎల్లంపల్లిని అధికారికంగా ప్రారంభించ లేదు. కేసీఆర్‌ ఒక్కసారి కూడా ఎల్లంపల్లి సందర్శించలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2012లో కిరణ్‌ కుమార్‌ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ప్రాజెక్టును ప్రారంభించేందుకు షెడ్యూల్‌ను ఖరారు చేశారు. తెలంగాణ ఉద్యమకారులు ఆయన ఇక్కడకు రావడాన్ని వ్యతిరేకించడంతో రాలేదు. అప్పటి నుంచి ఏ ముఖ్యమంత్రి కూడా సందర్శించక పోగా, సీఎం రేవంత్‌ రెడ్డి గురువారం వరదలు పెరగడంతో ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రాజెక్టును అధికారికంగా ఎప్పుడు ఆరంభిస్తారు అని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులుగా ‘ప్రాజెక్టు నడుస్తుంది కదా.. హైదరాబాద్‌కు తాగునీరు, పంటలకు నీటిని అందిస్తుంది కదా’. అని అన్నారు.

Updated Date - Aug 29 , 2025 | 12:32 AM