నెరవేరని రేషన్ డీలర్ల సమస్యలు
ABN , Publish Date - Aug 24 , 2025 | 11:54 PM
రేషన్ డీలర్లు తమ సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్నా అవి నెరవేరకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఆయా ప్రభుత్వాలకు మొర పెట్టుకుంటున్నా కూడా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని వాపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాతనైనా సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశలు పెట్టుకున్న డీలర్లకు నిరాశే ఎదురైంది.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
రేషన్ డీలర్లు తమ సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్నా అవి నెరవేరకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఆయా ప్రభుత్వాలకు మొర పెట్టుకుంటున్నా కూడా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని వాపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాతనైనా సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశలు పెట్టుకున్న డీలర్లకు నిరాశే ఎదురైంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చింది. ఏడాదిన్నర గడిచినా కూడా ఏ సమస్య పరిష్కరించలేదని, నెల వారీగా ఇవ్వాల్సిన కమీషన్ సొమ్మును కూడా సకాలంలో ఇవ్వడం లేదని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 413 రేషన్ షాపులు ఉండగా, మొత్తం రేషన్ కార్డులు 2,35,721 ఉన్నాయి. ఇందులో 7,29,534 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. నెలకు 4,507 టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తున్నది. ఈ బియ్యాన్ని వినియోగదారులకు పంపిణీ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కమీషన్లు ఇస్తున్నది.
ఫ సకాలంలో అందని కమీషన్లు..
రేషన్ డీలర్లు నెలనెలా పంపిణీ చేసే బియ్యంపై ఇవ్వాల్సిన కమీషన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో ఇవ్వడం లేదని డీలర్లు వాపోతున్నారు. కిలో బియ్యం పంపిణీ చేస్తే రూపాయి 40 పైసలు ఇవ్వాలి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 90 పైసలు, కేంద్ర ప్రభుత్వం 50 పైసలు ఇస్తుంది. ఏప్రిల్ నుంచి ఈ నెల వరకు ఐదు మాసాల కమీషన్ కేంద్ర ప్రభుత్వం, జూన్ నుంచి ఈ నెల వరకు మూడు మాసాల కమీషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందని డీలర్లు చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే కమీషన్లపైనే డీలర్లు ఆధారపడి జీవిస్తున్నారు. జూన్, జూలై, ఆగస్టు మాసాలకు సంబంధించి మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి జూన్ మాసంలో ఇచ్చారు. రేషన్ సరుకులను సరఫరా చేసేందుకు డీలర్లు అద్దె భవనాలను కిరాయికి తీసుకుని అద్దె చెల్లించడంతో పాటు కరెంట్ బిల్లులు చెల్లిస్తున్నారు. నెలలో 15 రోజులపాటు మాత్రమే బియ్యం పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ, బియ్యం సరఫరాలో జాప్యం జరిగినప్పుడు 20వ తేదీ వరకు కూడా బియ్యం వినియోగదారులకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ సకాలంలో కమీషన్లు ఇవ్వక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
గౌరవ వేతనం కోసం ఆందోళన
కమీషన్ కాకుండా నెలకు 30 వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని రేషన్ డీల్లరు దశాబ్దకాలానికి పైగా పోరాడుతున్నారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో గౌరవ వేతనం ఇస్తున్నందున తెలంగాణలోనూ గౌరవ వేతనం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ డిమాండ్లపై గత ప్రభుత్వం డీలర్లకు న్యాయం చేస్తామని ప్రకటించింది. అనంతరం పట్టించుకోవడం లేదని డీలర్లు చెబుతున్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రేషన్ డీలర్లకు నెలకు 5 వేల వేతనం ఇవ్వడంతోపాటు కిలో బియ్యానికి ఇచ్చే కమీషన్‌ను రూపాయి 40 పైసల నుంచి 3 రూపాయలకు పెంచుతామని, 5 లక్షల రూపాయల వరకు బీమా సౌకర్యం కల్పిస్తామని, రేషన్ షాప్ అద్దె, కరెంట్ బిల్లు చెల్లిస్తామని, డీలరు మరణిస్తే ఆ కుటుంబంలో వారసుడికి డీలర్‌షిప్ ఇస్తామని ప్రకటించిందని డీలర్లు చెబుతున్నారు. ఏడాదిన్నర గడుస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా మా మొర ఆలకించి ఇచ్చిన హామీని నెరవేర్చాలని రేషన్ డీలర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.