ఎమ్మెల్యే, మాజీ మంత్రి మధ్య ఆధిపత్య పోరు
ABN , Publish Date - Dec 28 , 2025 | 01:01 AM
జిల్లాలో 2025 సంవత్సరంలో రాజకీయం రసవత్తరంగా సాగింది. ప్రస్తుత సంవత్సరం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం కనబరిచింది. పంచాయతీ ఎన్నికలు జరగడం, వచ్చే యేడాది జరగనున్న మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలను టార్గెట్‌గా పెట్టుకోవడం తదితర కారణాల వల్ల ప్రధాన పార్టీల నేతలు జనం మధ్య తిరిగారు.
జగిత్యాల, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 2025 సంవత్సరంలో రాజకీయం రసవత్తరంగా సాగింది. ప్రస్తుత సంవత్సరం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం కనబరిచింది. పంచాయతీ ఎన్నికలు జరగడం, వచ్చే యేడాది జరగనున్న మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలను టార్గెట్‌గా పెట్టుకోవడం తదితర కారణాల వల్ల ప్రధాన పార్టీల నేతలు జనం మధ్య తిరిగారు. ప్రస్తుత యేడాది జిల్లాను మంత్రి పదవి వరించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూన్‌లో చేపట్టిన కేబినెట్ విస్తరణలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు బెర్త్ దక్కింది. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సీనియర్ సిటిజన్స్, ట్రాన్స్‌జెండర్స్, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. గత బీఆర్‌ఎస్ సర్కారు హయాంలో సంక్షేమ శాఖ మంత్రిగా జిల్లాకు చెందిన ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ వ్యవహరించగా, కాంగ్రెస్ సర్కారులో సైతం ధర్మపురి నియోజకవర్గానికే మంత్రి పదవి దక్కడం, సంక్షేమ శాఖ బాధ్యతలు చేపట్టడం విశేషం.
జగిత్యాలలో పలువురు మంత్రుల పర్యటనలు..
ఈ యేడాది జిల్లాలో రాజకీయ సందడి కొనసాగింది. జిల్లాలో పలువురు రాష్ట్ర మంత్రులు పర్యటించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జగిత్యాలలో పర్యటించారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌లు కథలాపూర్ మండలంలో నిర్మించతలపెట్టిన సూరమ్మ చెరువు ప్రాజెక్టును ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో కలిసి సందర్శించి పరిశీలించారు. అనంతరం ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని జైనా గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన లబ్ధిదారుల గుర్తింపు గ్రామ సభకు హాజరయ్యారు. వీరితో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పలు సందర్భాల్లో జిల్లాలో పర్యటించారు.
రాజకీయం గరం గరం..
జిల్లాలో గడిచిన యేడాది కాలంలో రాజకీయం గరం గరంగా కొనసాగింది. బీఆర్‌ఎస్ టిక్కెట్‌పై గెలుపొందిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారుతో కలిసి పనిచేస్తున్నానని ప్రకటించారు. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి తనదైన శైలిలో రాజకీయం నిర్వహిస్తున్నారు. వీరిద్దరి మధ్య జగిత్యాల నియోజకవర్గంలో రాజకీయం ఆధ్యాంతం వేడిగా కొనసాగింది. అదేవిధంగా పంచాయతీ ఎన్నికల కారణంగా జిల్లా వ్యాప్తంగా రాజకీయ సందడి నెలకొంది. తమ మద్దతుదారులను గెలిపించుకోవడానికి రాజకీయ పక్షాలు ప్రయత్నించాయి.
ఫకాంగ్రెస్, బీజేపీలకు జిల్లా అధ్యక్షుల నియామకం..
జిల్లాలో జాతీయ పార్టీలయిన కాంగ్రెస్, బీజేపీలకు నూతన అధ్యక్షుల నియామకం ప్రస్తుత యేడాది జరిగింది. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా జగిత్యాలకు చెందిన గాజెంగి నందయ్య నియామకం అయ్యారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా మెట్‌పల్లికి చెందిన డాక్టర్ యాదిగిరిబాబు నియామకమై బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నూతన నియామకాలతో ఇరు పార్టీలో కొత్త జోష్ నెలకొంది.
స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ సత్తా
జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మూడు విడతల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారులే ఆధిక్యం చాటుకున్నారు. తొలి విడతలో 122 పంచాయతీలకు గాను 57 కాంగ్రెస్, 32 బీఆర్‌ఎస్, 15 బీజేపీ, 18 ఇతరులు సొంతం చేసుకున్నారు. రెండో విడతలో 144 పంచాయతీలకు గానూ 109 కాంగ్రెస్, 18 బీఆర్‌ఎస్, 14 బీజేపీ, 3 ఇతరులు విజయం సాధించారు. మూడో విడతలో 119 స్థానాలకు గాను 70 కాంగ్రెస్, 34 బీఆర్‌ఎస్, 3 బీజేపీ, 12 ఇతరులు జయకేతనం ఎగురవేశారు. మూడు విడతలు కలిపి జిల్లా వ్యాప్తంగా 385 సర్పంచ్ స్థానాలకు గాను 236 కాంగ్రెస్, 84 బీఆర్‌ఎస్, 32 బీజేపీ, 33 ఇతరులు విజయం సాధించారు.
అభివృద్ది వైపు అడుగులు..
జిల్లా అధికార యంత్రాంగం ఈ యేడాది మొదటి దశలో ఓ వైపు అభివృద్ధిని సమర్థవంతంగా నిర్వహిస్తూనే రెండవ దశలో పంచాయతీ ఎన్నికలను ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా నిర్వహించింది. జిల్లాలో గడిచిన యేడాదిలో తొలి అంకంలో అభివృద్ధి, సంక్షేమం సమానంగా అమలు చేశారు. జిల్లాలో ఉపాధిహామీ పథకం కింద సుమారు లక్ష కుటుంబాలకు పనికల్పించారు. సుమారు 2.25 లక్షల మందికి వివిధ రకాల పింఛన్లను అందిస్తున్నారు. జిల్లాలో 12,785 సంఘాలకు రూ.500 కోట్ల రుణాలను అందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖల ద్వారా నిరుద్యోగులకు స్వయం ఉపాధి రుణాలను రూ.కోట్లలో అందించారు. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా 3,837 వివిధ రకాల పనులను రూ.305 కోట్లతో చేపట్టారు. ఇందులో పలు పనులు పూర్తి కాగా, మరికొన్ని పనులు ప్రగతిలో ఉన్నాయి.