పాఠశాలలపై కరువైన పర్యవేక్షణ
ABN , Publish Date - Sep 16 , 2025 | 12:57 AM
జిల్లా విద్యాశాఖపై పలు ఫిర్యాదు వెల్లువెత్తుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి పలు అవకతవకలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వచ్చినా, విద్యార్థి, యువజన సంఘాలు ధర్నాలు చేసినా విచారణ జరపడంలేదు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
జిల్లా విద్యాశాఖపై పలు ఫిర్యాదు వెల్లువెత్తుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి పలు అవకతవకలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వచ్చినా, విద్యార్థి, యువజన సంఘాలు ధర్నాలు చేసినా విచారణ జరపడంలేదు. డీఈవో అవకతవకలకు పాల్పడుతున్నారని పలువురు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, వరంగల్ ఆర్‌జేడీని విచారణకు ఆదేశించారు. రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆర్‌జేడీ విచారణ జరపకపోవడం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ శాఖలోనైనా రెగ్యులర్ జిల్లా అధికారిగా మూడేళ్లు పూర్తయిన అనంతరం బదిలీ చేస్తుంటారు. కరీంనగర్ అసిస్టెంట్ డైరెక్టర్ మాధవి ఇక్కడ డీఈవోగా అదనపు బాధ్యతలతో నాలుగేళ్లుగా కొనసాగుతున్నారు. ఇక్కడ రెగ్యులర్ ఏడీ ఉన్నా కూడా డీఈవో అదనపు బాధ్యతలు ఇచ్చే అవకాశాలు ఉన్నా ఇవ్వడం లేదు. 2021 సెప్టెంబరు 15న కరీంనగర్ జిల్లా విద్యా శాఖలో ఏడీగా పని చేస్తున్న మాధవికి జిల్లా డీఈవోగా అదనపు బాధ్యతలను అప్పగించారు. అప్పటి నుంచి నాలుగేళ్లుగా డీఈవోగా కొనసాగుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడడం, జిల్లా కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో సమన్వయం కొరవడిన కారణంగా జిల్లా విద్యా శాఖ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోకుండా ప్రైవేట్ పాఠశాలలకు ప్రాధాన్యం ఇస్తారనే విమర్శలున్నాయి. వారు నిబంధనలను ఉల్లంఘించి పాఠశాలలను నడుపుతున్నా వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. సమగ్ర శిక్ష నిధులను ఇష్టారాజ్యంగా వాడుతున్నారని, నిబంధనలను పాటించడం లేదని అకౌంట్స్ అధికారి ఏడాది క్రితం ప్రాజెక్టు అధికారికి నివేదిక సమర్పించినా ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం.
ఈ ఏడాది జూన్ మొదటి వారంలో విద్యార్థి, యువజన సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట డీఈవో అక్రమాలపై విచారణ జరిపి సస్పెండ్ చేయాలని ఆందోళన చేపట్టారు. డీఈవోపై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర స్థాయి అధికారులు జూలై 22న విచారణ జరిపి పూర్తిస్థాయిలో నివేదికను సమర్పించాలని ఆర్‌సీ నంబర్. 96/ఎస్‌ఇఆర్-1/2025 ద్వారా ఆర్‌జేడీని ఆదేశిస్తూ ఉత్తర్వులిచ్చినా ఆయన ఇప్పటి వరకు విచారణ జరపలేదు. విద్యా శాఖ పని తీరు అస్తవ్యస్తంగా మారడంతో కలెక్టర్ రెండు నెలల క్రితం కార్యాలయ ఇతర అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. జిల్లా విద్యాశాఖకు ప్రభుత్వం రెండు వాహనాలు కేటాయించగా, అందులో ఒకటి జిల్లా విద్యాశాఖాధికారి అధికార కార్యక్రమాల నిమిత్తం, మరొకటి సమగ్ర శిక్ష సమన్వయకర్తల క్షేత్రస్థాయి సందర్శనలకు వినియోగించాలని ఆదేశాలున్నాయి. రెండు కార్లను పెద్దపల్లి జిల్లాకు చెందిన వారి నుంచే అద్దెకు తీసుకోవాల్సి ఉండగా, ఒక కారు కరీంనగర్ జిల్లాకు చెందినది కావడం కొసమెరుపు. ఇప్పటికైనా రాష్ట్ర విద్యా శాఖాధికారులు స్పందించి జిల్లా విద్యా శాఖను ప్రక్షాళన చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.