పల్లెల్లో వేడెక్కిన రాజకీయాలు
ABN , Publish Date - Nov 30 , 2025 | 12:35 AM
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఇప్పుడిప్పుడే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానా లకు పోటీ చేసే అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొన్నది. బీసీలు, జనరల్‌కు కేటాయించిన సర్పంచ్ స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉన్నది.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఇప్పుడిప్పుడే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానా లకు పోటీ చేసే అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొన్నది. బీసీలు, జనరల్‌కు కేటాయించిన సర్పంచ్ స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉన్నది. ఏడాదిన్నర కాలంగా ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా అని చూస్తు న్న ఆశావహులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇప్పట్లో ఎన్నికలు జరిగవని కొందరు భావించినప్పటికీ, అకస్మాత్తుగా ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లడంతో మొదటి విడతలో పోటీ చేసే అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే సర్పంచ్ అభ్యర్థికి కనీసం 10 నుంచి 50 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుండగా, వార్డు సభ్యులకు పోటీచేసే అభ్యర్థులకు లక్ష రూపాయల వరకైనా ఖర్చు అవుతు న్నాయి. ఈ నేపథ్యంలో డబ్బుల కోసం అప్పులు చేసే పరిస్థితి నెలకొన్నది. అలాగే పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా బ్యాంకుల్లో కరెంట్ అకౌంట్ తీయాలనే నిబంధన ఉండడంతో బ్యాంకుల వద్ద అభ్యర్థులు పడి గాపులు కాస్తున్నారు. చివరి రోజు నామినేషన్లు ముగిసే నాటికి కూడా కొందరికి బ్యాంక్ అకౌంట్లు అందక పోవడంతో నామినేషన్ వేయకుండా ఉండాల్సిన పరి స్థితి ఏర్పడింది.
జిల్లాలో మొదటి విడతలో కాల్వశ్రీరాంపూర్, కమాన్‌పూర్, రామగిరి, ముత్తారం, మంథని మండలాల్లోని 99 గ్రామపంచాయతీలు, 896 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈనెల 27వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మొదటి రోజు అంత హడావుడి లేకపోయినా రెండో రోజు నుంచి నామినేషన్లు జోరందుకున్నాయి. శనివారం సాయంత్రం ఐదు గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.
మొదలైన దావతులు..
గ్రామపంచాయతీ ఎన్నికలతో రాజకీయాలు వేడె క్కాయి. ఆయా వర్గాల ప్రజల మద్దతు కూడగట్టేందుకు అభ్యర్థులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కుల సంఘాల వారీగా, యువకులను ఆకర్షించేందుకు అప్పుడే దావతులను మొదలుపెట్టారు. గ్రామాల్లో ఎవ రిని గెలిపిస్తే బాగుంటుందని చర్చ కూడా ప్రజల్లో మొదలైంది. డిసెంబర్ మూడో తేదీ నాటికి నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండగా, తప్పనిసరిగా పోటీ లో నిలవాలనుకునే అభ్యర్థులు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈసారి తమకే మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరుతున్నారు. గ్రామ అభి వృద్ధి, సంక్షేమానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ పనులు చేస్తానంటూ వాగ్దానాలు గుప్పిస్తున్నారు. కొందరు అభ్యర్థులు బల నిరూపణ కోసం ర్యాలీలు నిర్వ హించి నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధానంగా జనరల్, బీసీలకు రిజర్వ్ చేసిన సర్పంచ్ స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉంది. జనరల్ స్థానాల్లో ఓసీల కంటే ఎక్కు వగా బీసీలు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీకి చెందిన అభ్యర్థుల మధ్య పోటీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఇద్దరికీ పైగా నామినేషన్లు వేయగా, వారిని బుజ్జగించేందుకు నాయకులు రంగంలోకి దిగుతున్నారు. ఓటర్లను తమ వైపునకు తిప్పుకొని ఎన్నికల్లో గెలుపొందేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని తహతహలాడుతున్నారు. డిసెంబరు 3న నామినేషన్ల ఉపసంహరణ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసిన అనంతరం అభ్యర్థులకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో గుర్తు లను కేటాయించనున్నారు. ఆ మరుసటి రోజు నుంచి అభ్యర్థులు తమ గుర్తులతో విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
నేటి నుంచి రెండో విడత నామినేషన్లు
ఈ నెల 29వ తేదీ నుంచి రెండో విడత నామినేషన్ల ప్రక్రియ మొదలు కానున్నది. పాలకుర్తి, అంతర్గాం, ధర్మారం, జూలపల్లి మండలాల్లోని 73 సర్పంచ్, 684 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 10.30 గంటల నుంచి ఆయా కేంద్రాల్లో నామినేషన్లను డిసెంబరు 2వ తేదీ వరకు స్వీకరించనున్నారు. మూడో తేదీన అభ్యంతరాలకు అవకాశం కల్పించారు. 4వ తేదీన పరిశీలన, 5వ తేదీన మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధిం చారు. 14వ తేదీన ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనున్నది.