Share News

పోలీసులు కాంగ్రెస్‌ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు

ABN , Publish Date - Oct 14 , 2025 | 11:49 PM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత అధికార దుర్వినియోగం పెరిగిందని, చిన్న స్థాయి కాంగ్రెస్‌ నాయకుల నుంచి ఎమ్మెల్యేల వరకు పోలీసులను రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని, పోలీసులు కాంగ్రెస్‌ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ రాంచందర్‌రావు పేర్కొన్నారు.

పోలీసులు కాంగ్రెస్‌ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు

గోదావరిఖని, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత అధికార దుర్వినియోగం పెరిగిందని, చిన్న స్థాయి కాంగ్రెస్‌ నాయకుల నుంచి ఎమ్మెల్యేల వరకు పోలీసులను రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని, పోలీసులు కాంగ్రెస్‌ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ రాంచందర్‌రావు పేర్కొన్నారు. మంగళవారం రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝాను కలిసి మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు యేట మధుకర్‌ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి తప్పదని కాంగ్రెస్‌ నాయకుల్లో భయం పట్టుకున్నదని, దీంతో బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో పలువురు ఎమ్మెల్యేలు బీజేపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. వేమనపల్లిలో బీజేపీ నాయకుడు మధుకర్‌ వల్ల తాము ఓటమి పాలవుతామనే భయంతో మాజీ జెడ్‌పీటీసీ సంతోష్‌తో పాటు గాలి మధు మరికొందరు అతనిపై ఒత్తిళ్లు తెచ్చారన్నారు. చివరికి అట్రాసిటీ కేసులు పెట్టి వేధించారని, బాధితుల పక్షాన అండగా నిలువాల్సిన ఎస్‌ఐ కోటేశ్వర్‌ ఇందుకు భిన్నంగా తప్పు చేసిన వారికి వత్తాసు పలికారన్నారు. కేసు పెట్టి వేధింపులకు గురి చేశారని, సీఐ బన్సీలాల్‌ సైతం కాంగ్రెస్‌ నాయకులకు వత్తాసు పలుకుతూ బీజేపీ నాయకుడు మధుకర్‌ను అవమానించాడన్నారు. స్థానిక పోలీస్‌ అధికారులు సైతం చావమని వేధించారన్నారు. పార్టీ కార్యకర్తలకు బీజేపీ అండగా ఉంటుందని, బెదిరింపులకు భయపడేది లేదన్నారు. బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తే ప్రతీకారం తప్పని ఆయన హెచ్చరించారు. మధుకర్‌ కేసులో ఎఫ్‌ఐఆర్‌లో పేరున్న రుద్రభట్ల సంతోష్‌, గాలి మధుతో పాటు 13మందిని అరెస్టు చేయాలని, బాధ్యులైన పోలీస్‌ అధికారులను సస్పెండ్‌ చేయాలని కోరారు. చర్యలు తీసుకోవడంలో జాప్యం జరిగితే పార్టీ పక్షాన ఉద్యమిస్తామన్నారు. సీపీని కలిసిన వారిలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భరత్‌ ప్రసాద్‌, ముఖ్య అధికార ప్రతినిధి ఎంవీ సుభాష్‌, మాజీ ఎంపీ వెంకటేష్‌ నేత, మంచిర్యాల జిల్లా పార్టీ అద్యక్షుడు వెంకటేష్‌గౌడ్‌, పెద్దపల్లి అధ్యక్షుడు సంజీవరెడ్డి, కరీంనగర్‌ అధ్యక్షుడు గంగడి కృష్ణారెడ్డి, గోమాస శ్రీనివాస్‌, మాజీ మేయర్‌ సునీల్‌రావు, నాయకులు రావుల రాజేందర్‌, కందుల సంధ్యారాణి, సోమారపు లావణ్య, కోమళ్ల మహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 14 , 2025 | 11:49 PM