Share News

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ వైఫల్యాలపై ప్రధాని పరిశీలించాలి

ABN , Publish Date - Aug 30 , 2025 | 12:42 AM

మేకిన్‌ ఇండియా అంటూ ఊదరగొడుతున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆర్‌ఎఫ్‌సీఎల్‌ యూరియా ప్లాంట్‌ వైఫల్యాలపై క్షేత్రస్థాయి పరిశీలన జరుపాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ వైఫల్యాలపై ప్రధాని పరిశీలించాలి

గోదావరిఖని, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): మేకిన్‌ ఇండియా అంటూ ఊదరగొడుతున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆర్‌ఎఫ్‌సీఎల్‌ యూరియా ప్లాంట్‌ వైఫల్యాలపై క్షేత్రస్థాయి పరిశీలన జరుపాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వివేక్‌ ఎంపీగా ఉన్న సమయంలో రూ.10కోట్ల అప్పులు మాఫీ చేయించి మన్మోహన్‌సింగ్‌ సర్కార్‌ ద్వారా ప్లాంట్‌ పునరుద్ధరణకు చర్యలు చేపట్టారన్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో యాజమాన్య నిర్లక్ష్యం వల్ల సాంకేతిక వైఫల్యాలు ఏర్పడుతున్నాయని, దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరుపాలన్నారు. ఇప్పటికే కేంద్ర ఎరువుల రసాయనాలశాఖ మంత్రి నడ్డ, రసాయనాలశాఖ కార్యదర్శి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్టు ఆయన చెప్పారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయాన్ని రామగుండానికి తరలించినప్పుడు మాత్రమే పరిస్థితులు మెరుగవుతాయన్నారు. యూరియా కొరత ఏర్పడడానికి కేంద్ర విధానాలే కారణమని, ఇప్పటికీ విదేశాల నుంచి యేటా 50లక్షల టన్నుల యూరియాను దిగుమతి చేసుకుంటున్నారన్నారు. విదేశాల నుంచి దిగుమతి అయ్యే యూరియా విషయంలో ముందు చూపు లేకపోవడం వల్ల యూరియా కొరత ఏర్పడి రాష్ట్రాలకు కోటా తగ్గించారన్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నుంచి కోటా ఇచ్చి ప్లాంట్‌ మూలనపడడం వల్ల ప్రత్యామ్నాయం కూడా చేయలేని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు. కాంగ్రెస్‌ ఎంపీలు ఒత్తిడి తెస్తే 50వేల టన్నుల యూరియా ఇచ్చేందుకు ఒప్పుకున్నారని, త్వరలోనే 25వేల టన్నులు అందుబాటులోకి రానున్నదన్నారు. రామగుండంలో ఈఎస్‌ఐ ఆసుపత్రి మంజూరు చేసి ఐదేళ్లు అయినా టెండర్లు నిర్వహించలేదని, తాను, మంత్రి వివేక్‌లు కేంద్ర మంత్రి మాండవియను కలిసి విజ్ఞప్తి చేయడంతో రూ.150కోట్లతో టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారన్నారు. రామగుండంలో ఎయిర్‌పోర్టు నిర్మించాలని తాము కేంద్ర మంత్రి రాంమోహన్‌నాయుడు దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారని, దీనిపై అధ్యయనం జరుగుతుందన్నారు. కన్నాలలో రూ.80కోట్లతో రైల్వే అండర్‌పాస్‌ నిర్మాణంపై సానుకూలత తెలిపాని, త్వరలోనే అన్నీ క్లియరెన్స్‌లు లభిస్తాయన్నారు. సింగరేణి రిటైర్డ్‌ కార్మికుల పెన్షన్‌ పెంచే అంశంపై కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నామని, పెన్షన్‌ ట్రస్ట్‌లో లోటును భర్తీ చేసేందుకు టన్నుకు రూ.20చొప్పున కేటాయిస్తున్నారని, అవి కేవలం పెన్షన్‌కే సమకూర్చుతారన్నారు. ఓట్ల చోరీని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ సాక్ష్యాధారాలతో బట్టబయలు చేశారని, బీహార్‌లో చేపట్టిన యాత్రకు భారీ స్పందన లభించిందన్నారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు గుమ్మడి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 30 , 2025 | 12:42 AM