ప్లాంట్ రామగుండంలో... కార్యాలయం నోయిడాలో...
ABN , Publish Date - Aug 15 , 2025 | 11:19 PM
పెద్దపల్లి జిల్లా రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్‌ఎఫ్‌సీఎల్)లో సాంకేతిక అవరోధాలతో వరుసగా యూరియా ఉత్పత్తి నిలిచిపోతుంది. రాష్ట్రంలో యూరియా కొరత వేళ ఉత్పత్తి నిలిచిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వంతో పాటు పరిశ్రమలో భాగస్వామిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తికి లోనవుతుంది.
కోల్‌సిటీ, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లా రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్‌ఎఫ్‌సీఎల్)లో సాంకేతిక అవరోధాలతో వరుసగా యూరియా ఉత్పత్తి నిలిచిపోతుంది. రాష్ట్రంలో యూరియా కొరత వేళ ఉత్పత్తి నిలిచిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వంతో పాటు పరిశ్రమలో భాగస్వామిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తికి లోనవుతుంది. ఆర్‌ఎఫ్‌సీఎల్ సంస్థకు దేశ వ్యాప్తంగా కేవలం రామగుండంలోనే పరిశ్రమ ఉన్నది. అయితే సంస్థ కార్పొరేట్ కార్యాలయం ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఉన్నది. కార్పొరేట్ కార్యాలయానికి, ప్లాంట్‌కు మధ్య సమన్వయ లోపంతో రాష్ట్రానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వశాఖలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, కాంగ్రెస్ ఎంపీ బలరాంనాయక్‌లు స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. వీరు ఆర్‌ఎఫ్‌సీఎల్ కార్పొరేట్ కార్యాలయాన్ని నోయిడా నుంచి రామగుండంకు తరలించాలంటూ ఈనెల 12న కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ కార్యదర్శి రజత్‌కుమార్ మిశ్రాకు లేఖలు రాశారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ కార్పొరేట్ కార్యాలయాన్ని వెంటనే రామగుండానికి తరలించాలని కోరారు. దేశంలో సింగిల్ యూనిట్‌గా ఉన్న అనేక సంస్థలు కార్పొరేట్ కార్యాలయాలను పరిశ్రమల వద్దే ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో సంస్థకు చెందిన సీఈఓలు, డైరెక్టర్ (ఫైనాన్స్), హెచ్‌ఆర్ డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు కార్పొరేట్ కార్యాలయంలోనే ఉంటారు.
ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా మూతబడిన ఎరువుల కర్మాగారాలను పునరుద్ధరించారు. ఎఫ్‌సీఐకి చెందిన ఒడిశాలోని తాల్చేర్ యూనిట్‌ను కూడా జాయింట్ వెంచర్‌లో పునరుద్ధరించారు. ఆ పరిశ్రమ సాంకేతిక ఇబ్బందులతో ఉత్పత్తికి విఘాతం కలిగిన పరిస్థితుల్లో ఢిల్లీలోని కార్పొరేట్ కార్యాలయాన్ని తాల్చేర్‌కు తరలించారు. దీంతో పరిస్థితులు మెరుగుపడ్డాయి. ప్రభుత్వరంగానికి చెందిన కేరళలోని ఫ్యాక్ట్ ఎరువుల కర్మాగారం కూడా కార్పొరేట్ కార్యాలయం కొచ్చిలోనే ఉన్నది. అలాగే మద్రాస్ ఫెర్టిలైజర్స్, రాష్ట్రీయ కెమికల్స్‌కు చెందిన కార్పొరేట్ కార్యాలయాలు కూడా పరిశ్రమల వద్దనే ఉన్నాయి.
మూతపడిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని నేషనల్ ఫెర్టిలైజర్స్, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ, డెన్మార్క్‌కు చెందిన హల్దర్ టాప్స్ భాగస్వామ్యంతో ఆర్‌ఎఫ్‌సీఎల్‌గా పునరుద్ధరించారు. ఏటా 12లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి లక్ష్యంతో ప్రాజెక్టును నిర్మించారు. 2021 నుంచి ఈ ప్రాజెక్టులో ఉత్పత్తి ప్రారంభమైంది. ఇందులో తెలంగాణకే 45శాతం యూరియా సరఫరా చేసే విధంగా కేంద్రం ప్రణాళిక చేసింది. సాంకేతిక అవరోధాలతో ప్లాంట్ తరచూ షట్‌డౌన్ అయి ఉత్పత్తి నిలిచిపోతుంది. ఈ ఏడాది మే 8 నుంచి జూన్ 15వరకు, జూలై 16 నుంచి ఆగస్టు 4వరకు ఉత్పత్తి నిలిచిపోయింది. మళ్లీ ఆగస్టు 14న అమ్మోనియా లీకేజీతో ప్లాంట్ షట్‌డౌన్ అయ్యింది. ఈ వరుస వైఫల్యాలతో తెలంగాణకు లక్ష టన్నులకుపైగా యూరియా సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ఈ నెలలో 65వేల టన్నులు సరఫరా జరుగాల్సి ఉంది. యూరియా కొరతతో రైతాంగం ఇబ్బందులు పడుతుంది. పరిశ్రమలో క్షేత్రస్థాయి ఇబ్బందులను పరిష్కరించడంలో, త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యంతోనే ఈ పరిస్థితి ఏర్పడుతుందనే విమర్శలున్నాయి. ఆర్‌ఎఫ్‌సీఎల్ కార్యాలయాన్ని రామగుండం తరలిస్తేనే సమస్య పరిష్కారం త్వరగా అవుతుందని పలువురు పేర్కొంటున్నారు.