Share News

భూ సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు

ABN , Publish Date - Jul 22 , 2025 | 11:49 PM

రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుంచి వచ్చిన భూ సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్‌, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, సీఎస్‌ కే రామకృష్ణారావులతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

భూ సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు

పెద్దపల్లి, జూలై 22 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుంచి వచ్చిన భూ సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్‌, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, సీఎస్‌ కే రామకృష్ణారావులతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ భూ భారతి చట్టం నిబంధనల ప్రకారం వీలైనంత వరకు భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో ప్రజల నుంచి భూ సమస్యలపై 8 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వీటిని 4 కేటగిరీల్లో విభజించి నిబంధనల ప్రకారం త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు భోజనం అందించే అంశంలో ప్రభుత్వం జారీ చేసిన కామన్‌ డైట్‌ మెనూ పాటించాలని మంత్రి ఆదేశించారు. విద్యా సంస్థల పరిసర ప్రాంతాల్లోకి పాములు, ఇతర విష పురుగులు రాకుండా ఉండేందుకు పిచ్చి మొక్కలను ఉపాధిహామీ పనుల్లో తొలగించాలని ఆదేశించారు. పాఠశాలలో తాగునీటి సరఫరా సరిగా ఉండేలా చూడాలని, నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవాలన్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ మాట్లాడుతూ అధికారులు రెగ్యులర్‌గా రెసిడెన్షియల్‌ పాఠశాల్లో విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతను తనిఖీ చేయాలని ఆదేశించారు. రోజు విద్యార్థులకు అందించే డైట్‌ వివరాలు పరిశీలించాలని అన్నారు. సీఎస్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఫుడ్‌ పాయిజన్‌ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలన్నారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ, ఆర్‌డీఓ బి గంగయ్య, జిల్లా అధికారులు డి మాధవి, జాలి రంగారెడ్డి, డాక్టర్‌ అన్న ప్రసన్న కుమారి, శివయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 22 , 2025 | 11:49 PM