రైతులందరికీ యూరియా అందేలా ప్రణాళిక
ABN , Publish Date - Nov 30 , 2025 | 12:29 AM
ప్రతీ రైతుకు అవసరమైన యూరియా అందేలా పక్కా ప్రణాళిక రూపొందించామని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. శనివారం బ్రాహ్మణపల్లి రైతువేదిక వద్ద యూరియా అమ్మకాల పర్యవేక్షణ యాప్‌పై ఎరువుల డీలర్లకు నిర్వహించిన శిక్షణలో కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు.
పెద్దపల్లి రూరల్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : ప్రతీ రైతుకు అవసరమైన యూరియా అందేలా పక్కా ప్రణాళిక రూపొందించామని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. శనివారం బ్రాహ్మణపల్లి రైతువేదిక వద్ద యూరియా అమ్మకాల పర్యవేక్షణ యాప్‌పై ఎరువుల డీలర్లకు నిర్వహించిన శిక్షణలో కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ గతేడాది కంటే 7 నుంచి 8 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అధికంగా జరిగినప్పటికీ వానాకాలంలో యూరియా సమస్య ఉత్పన్నమైందన్నారు. తనిఖీలలో 4 డీలర్ల షాప్‌లను సీజ్ చేశామని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతీ రైతుకు అవసరమైన మేర యూరియా అందాలనే లక్ష్యంతో ప్రభుత్వం యూరియా అమ్మకాల పర్యవేక్షణ యాప్ ప్రవేశపెట్టిందన్నారు. యాప్ ద్వారా రైతులు పద్ధతి ప్రకారం సాగు చేసే పంటల ఆధారంగా యూరియా అమ్మకాలు జరపాలని తెలిపారు.
రైతులు సాగు చేస్తున్న పంట, ఎంత యూరియా అవసరం అవుతుంది, ఇప్పటి వరకు ఎంత యూరియా కొనుగోలు చేశారు వంటి వివరాలు యాప్ లో నమోదవుతా యన్నారు. రైతు అవసరానికి మించి యూరియా కొనుగోలు చేయకుండా ఈ యాప్ ద్వారా నియంత్రించే అవకాశం ఉందన్నారు. ఎరువుల డీలర్లు తప్పనిసరిగా యూరియా విక్రయం సమయంలో ఈ యాప్ విని యోగించి యూరియా అమ్మకం వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు. యూరియా కృత్రిమ కొరత సమస్య యాప్ ద్వారా తొలగిపోతుందన్నారు. యాసంగి సీజన్ కు అవసరమైన యూరియా జిల్లాలో అందుబాటులో ఉందని తెలిపారు. ఈ యాప్‌ను ప్రతీ ఒక్క డీలర్ తప్పనిసరిగా వినియోగించుకొని రైతులకు ఇబ్బంది కాకుండా చూడాలని, యాప్ వినియోగించని డీలర్ల పై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, డీలర్లు పాల్గొన్నారు.