అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి
ABN , Publish Date - Oct 13 , 2025 | 11:27 PM
ప్రజా వాణి అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని అదనపు కలెక్టర్ డి.వేణు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా డిప్యూటి టైనీ కలెక్టర్ బనావత్ వనజ తో కలిసి దరఖాస్తులను స్వీకరించారు.
పెద్దపల్లిటౌన్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రజా వాణి అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని అదనపు కలెక్టర్ డి.వేణు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా డిప్యూటి టైనీ కలెక్టర్ బనావత్ వనజ తో కలిసి దరఖాస్తులను స్వీకరించారు. వేములవాడ మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన బండి వెంకటమ్మ ధర్మారం మండలం పత్తిపాక రెవెన్యూ గ్రామం సర్వే నెంబర్ 785, 786 మల్లాపూర్ గ్రామం లోని సర్వే నెంబర్ 132 లో గల తమ భూమి ఆక్రమణకు గురైందని, రికార్డులను పరిశీలించి ఇప్పించాలని దరఖాస్తు చేసుకొన్నారు. సుల్తానాబాద్ మండలం మియాపూర్ గ్రామానికి చెందిన గండి రాయమల్లు సర్వేనెంబర్ 314 లో ఎకరం ఎనిమిది గంటల భూమి కుమారునికి పట్టా చేశానని, వృద్ధాప్యంలో తనకు తిండి పెట్టకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఆ భూమి తిరిగి తన పేరు మీద పట్టా చేయించాలని దరఖాస్తు చేసుకోగా ఆర్డీవోకు రాస్తూ సీనియర్ సిటిజన్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. పాలకుర్తి మండలం కన్నాల గ్రామానికి చెందిన రాజేశ్వరి ఇంటి స్థలం ఇప్పించాలని, రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన బి.లావణ్య కల్వచర్లలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని, తనకు రత్నాపూర్ గ్రామంలో భూమి ఉందని అక్కడ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవడానికి అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేసుకోగా పీడీ హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.