Share News

కార్మిక వ్యతిరేక లేబర్‌ కోడ్స్‌ను తిప్పికొట్టండి

ABN , Publish Date - Sep 07 , 2025 | 11:44 PM

మోదీ కార్మిక వ్యతిరేక లేబర్‌ కోడ్స్‌ను తిప్పికొట్టాలని టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు కే సూర్యం పిలుపునిచ్చారు. ఆదివారం ఖనిలో టీయూసీఐ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు తోకల రమేష్‌ అధ్యక్షతన జరిగింది.

కార్మిక వ్యతిరేక లేబర్‌ కోడ్స్‌ను తిప్పికొట్టండి

గోదావరిఖని, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): మోదీ కార్మిక వ్యతిరేక లేబర్‌ కోడ్స్‌ను తిప్పికొట్టాలని టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు కే సూర్యం పిలుపునిచ్చారు. ఆదివారం ఖనిలో టీయూసీఐ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు తోకల రమేష్‌ అధ్యక్షతన జరిగింది. సూర్యం మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ యథేచ్ఛగా కార్మిక వ్యతిరేక విధానాలను అమల్లోకి తీసుకొస్తున్నారని, 44 కార్మిక చట్టాలను నాశనం చేసి కేవలం పారిశ్రామికవేత్తలు అనుకూలంగా నాలుగు లేబర్‌ కోడ్స్‌ను ఆమోదించారన్నారు పని గంటల పెంపు కార్మిక వర్గానికి ప్రమాదకరమని, వాటి ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం 12గంటల పని 282జీఓను అమల్లోకి తీసుకువచ్చిందన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ అవే విధానాలను ఆమోదిం చడం సరైనది కాదన్నారు. సులభతరమైన వ్యాపార విధానాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దానిని కేసిఆర్‌, రేవంత్‌రెడ్డి అమలు చేశారన్నారు.

పాశమైలారం శిగాచి పరిశ్రమలో 56మంది కార్మికులు ఆహుతి అయ్యారని, సిగాచి పరిశ్రమకు ఎలాంటి ప్రమాదం లేదని ఫ్యాక్టరీ అధికారులు సర్టిఫై చేయడం సిగ్గుచేటన్నారు. కార్మిక వర్గానికి సామాజిక భద్రతా కింద వచ్చిన పీఎఫ్‌, ఈఎస్‌ఐ చట్టాలను యాజమాన్యాలు నిరాటంకంగా ఉల్లంఘిస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 2016లో తీర్పు ఇచ్చిందని, 9 సంవత్సరాలు గడుస్తున్నా అతీగతీలేదన్నారు. చాలీచాలని జీతాలతో జీవిస్తున్న శ్రామిక వర్గానికి సరైన వేతనాలు లేక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారని, 73షెడ్యూల్‌ ఎంప్లాయిమెంట్స్‌ జీవోలను ప్రభుత్వం ఎందుకు సవరించడం లేదని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ఎదుర్కొంటున్న కార్మిక వర్గ సమస్యలపై చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. నాయకులు ఈసంపల్లి రాజేందర్‌, గొల్లపల్లి చంద్రయ్య, ఆడెపు శంకర్‌, మార్త రాములు, గూడూరి వైకుంఠం, కలువల రాయమల్లు, పుల్లూరి నాగభూషణం, తూళ్ళ శంకర్‌, చిలుక రాజు, మాటేటి పోషం, మాట్ల సమ్మయ్య పాల్గొన్నారు.

Updated Date - Sep 07 , 2025 | 11:44 PM