గోదావరిఖనిలో ఆపరేషన్ పోచమ్మ మైదాన్
ABN , Publish Date - Aug 19 , 2025 | 11:50 PM
గోదావరిఖని పోచమ్మ మైదానంలో రామగుండం నగరపాలక సంస్థ మంగళవారం ఆపరేషన్ పోచమ్మ మైదాన్ చేపట్టింది. మంగళవారం సాయంత్రం పోలీస్ బందోబస్తు మధ్య మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఎదుట ఉన్న కట్టడాలను యంత్రాలతో నగరపాలక సంస్థ కూల్చివేతలు చేపట్టింది.
కోల్‌సిటీ, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): గోదావరిఖని పోచమ్మ మైదానంలో రామగుండం నగరపాలక సంస్థ మంగళవారం ఆపరేషన్ పోచమ్మ మైదాన్ చేపట్టింది. మంగళవారం సాయంత్రం పోలీస్ బందోబస్తు మధ్య మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఎదుట ఉన్న కట్టడాలను యంత్రాలతో నగరపాలక సంస్థ కూల్చివేతలు చేపట్టింది. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన కట్టడాలను తొలగిస్తున్నట్టు నగరపాలక సంస్థ అధికారులు పేర్కొన్నారు. జనగామ శివారు సర్వే నంబర్ 683, 693, 694 సంబంధించి హద్దుల విషయంలో సోమవారం జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ (సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్) సర్వే చేసింది. సర్వే నివేదిక ఆధారంగా ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలను తొలగించారు.
గతంలో షాపింగ్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న మూడు షటర్లను కార్పొరేషన్ కూల్చివేయగా, ఇప్పుడు అదే స్థలంలోని మిగతా షట్టర్లను కార్పొరేషన్ తొలగించింది. కార్పొరేషన్ ఈఈ రామన్, టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ నవీన్, టీపీబీఓలు కూల్చివేతలను పర్యవేక్షించారు. కూల్చివేసిన నిర్మాణాల్లో ఉంటున్న వ్యాపారులు తమ దుకాణాలను ఖాళీ చేశారు. మరి కొందరు వ్యాపారులు కోర్టు పరిధిలో ఉన్న తమ దుకాణాలను ఎందుకు కూల్చివేస్తున్నారంటూ కార్పొరేషన్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. సుమారు 10 ఎక్స్‌కావేటర్లు, పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలను చేపట్టారు.
20 ఏళ్ళ తర్వాత తిరిగి కార్పొరేషన్ చేతికి
రామగుండం మున్సిపాలిటీ చేతుల్లో నుంచి ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోకి వెళ్ళిన పోచమ్మ మైదాన్ స్థలం ఇరవై ఏళ్ళ తర్వాత తిరిగి నగరపాలక సంస్థ చేతికి వచ్చింది. జనగామ శివారు సర్వే నంబర్ 693లో సింగరేణి అవసరాల నిమిత్తం యాజమాన్యం 1968లో పట్టాదారుల నుంచి 8.2 ఎకరాలు భూసేకరణ జరిగింది. అప్పటి నుంచి ఈ స్థలం పూర్తిగా సింగరేణి ఆధీనంలోనే ఉన్నది. సింగరేణిలో పనిచేసే కార్మిక కుటుంబాల అవసరాల నిమిత్తం ఈ స్థలంలోనే కూరగాయాల మార్కెట్, మాంసం దుకాణాలు, ఇతర చిరు వ్యాపార దుకాణాలు, సింగరేణి బ్యారెక్స్ ఉండేది. దుకాణాల నుంచి సింగరేణి అద్దె వసూలు చేసేది. ఈ స్థలంలో ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి మున్సిపాలిటీ ప్రతిపాదించింది. సింగరేణిని సంప్రదించగా, సింగరేణి యాజమాన్యం కూడా స్థలాన్ని మున్సిపాలిటీకి అప్పగించింది. 2006లో అప్పటి మున్సిపల్ ఛైర్మన్ బడికెల రాజలింగం ఆధ్వర్యంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ, టీడీపీ కౌన్సిలర్లు ఒకతాటిపై వచ్చి మార్కెట్‌ను 150 షాప్‌లను తొలగించారు. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి అనువుగా స్థలాన్ని చదును చేసి ఫెన్సింగ్ నిర్మించారు. పాలకవర్గం పదవీ కాలం పూర్తవడంతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంలో జాప్యం జరిగింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 39 గుంట స్థలం తమదేనంటూ పట్టాదారులుగా చెప్పుకుంటున్న వ్యక్తులు రంగప్రవేశం చేశారు. 2014 జూన్ 17న దొడ్డిదారిన షాపింగ్ కాంప్లెక్స్ ప్రతిపాదిత స్థలంలోనే అప్పటి అధికారులు ప్రైవేట్ వ్యక్తుల ప్రహరీ నిర్మాణానికి అనుమతులు ఇవ్వగా వెంటనే అందులో భవనాలు వెలిశాయి. అప్పటి ప్రజా ప్రతినిధులు ఈ నిర్మాణాలకు అండగా ఉన్నారనే విమర్శలు వచ్చాయి. అప్పటి నుంచి కోర్టుల్లో వివాదం నడుస్తున్నది. ఎమ్మెల్యేగా మక్కాన్‌సింగ్ ఎన్నిక అయ్యాక పోచమ్మ మైదాన్‌లో ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. న్యాయస్థానాల్లో సింగరేణి, ప్రభుత్వం వైపు నుంచి కొట్లాడుతున్నారు. కొన్ని రోజుల క్రితం ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలను తొలగించా రు. మంగళవారం ప్రభుత్వ స్థలంలో మిగిలి ఉన్న నిర్మాణాలను తొలగించారు.
జనం తాకిడి....
40 ఏళ్ళపాటు మార్కెట్‌గా ప్రసిద్ధి చెందిన స్థలం కళ్ళ ముందే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళడం, అందులో భవనాలు వెలియడం పారిశ్రామిక ప్రాంతంలో పోచమ్మ మైదాన్ స్థల వివాదం చర్చనీయాంశమైంది. మంగళవారం ఆ నిర్మాణాలను నగరపాలక సంస్థ తొలగిస్తున్నదనే సమాచారంతో ప్రజలు పెద్దఎత్తున పోచమ్మ మైదాన్ ప్రాంతానికి వచ్చారు. వారిని అదుపు చేయడం పోలీసులకు గగనంగా మారింది. ఒక సమయంలో రోప్ పార్టీలను పెట్టి జనాలను కూల్చివేతలకు దూరంగా పంపించారు.