Share News

ఒక్కేసి పువ్వేసి చందమామ...

ABN , Publish Date - Sep 21 , 2025 | 11:58 PM

జిల్లా కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి మహిళలు, యువతులు పెద్ద ఎత్తున ఆయా పట్టణ కేంద్రాలలో నెలకొల్పిన పూలు, చామంతులు, తదితర బతుకమ్మకు సంబంధించిన అలంకరణ వస్తువులను కొనుగోలు చేశారు.

ఒక్కేసి పువ్వేసి చందమామ...

పెద్దపల్లి కల్చరల్‌, సెప్టెంబరు21(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి మహిళలు, యువతులు పెద్ద ఎత్తున ఆయా పట్టణ కేంద్రాలలో నెలకొల్పిన పూలు, చామంతులు, తదితర బతుకమ్మకు సంబంధించిన అలంకరణ వస్తువులను కొనుగోలు చేశారు. ఉపవాసంతో మహిళలు బతుకమ్మలను పేర్చి, పూజా మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాయంత్రం వేళ ఆడపడుచులు బతుకమ్మలను కూడళ్ళలో ప్రతిష్టించి, తీరొక్క పాటలతో బతుకమ్మ ఆడారు. కోలాటాలు, డీజే చప్పుళ్లతో వాడలన్ని మారుమోగాయి. మన సంస్కృతిని కాపాడటంతోపాటు ముందు తరాలకు అందించే చక్కని వేదిక బతుకమ్మ అంటూ పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పేర్కొన్నారు. అమర్‌నగర్‌లో ముదిరాజు ఆడబిడ్డలు పెద్ద ఎత్తున గునుగు, తంగేడు పూలతో బతుకమ్మలను పేర్చి పలువురిని ఆకర్షించారు. అలాగే తెనుగువాడ, ఆర్యవైశ్యభవన్‌, వెంకటేశ్వరస్వామి దేవాలయం, బాలాజీనగర్‌, హనుమాన్‌ నగర్‌, కొంతంవాడ, శాంతినగర్‌ తదితర వాడలతోపాటు మున్సిపల్‌ అధికారులు కూడళ్ళ వద్ద విద్యుత్‌ అలంకరణలు చేశారు. అలాగే పెద్దపల్లి ట్యాంక్‌ బండ్‌గా పిలిచే ఎల్లమ్మ గుండం కట్ట వద్ద రంగు రంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మున్సిపల్‌ అధికారులు, ప్రజాప్రతినిదులు, పోలీసులు చర్యలు చేపడుతున్నారు. మొదటి రోజున నిర్వహించుకున్న బతుకమ్మ వేడుకలు ప్రశాంతంగా నిమజ్జనం చేసి, ఆడపడుచులు ఇళ్లకు చేరుకున్నారు.

మంథని, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పండుగ వేడుకలు ఆదివారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. మహిళలు ఎంగిలిపూల బతుకమ్మలు పేర్చి ఆడిపాడి సందడి చేశారు. ఉదయం నుంచి తంగేడు, రాచగుమ్మడి, గోరింట, కట్ల, సీత జెడలు, గులాబీలు, మందారాలు వంటి రక రకాల పూలను సేకరించిన మహిళలు, పిల్లలు మధ్యాహ్నం బతుకమ్మలను పేర్చి సాయంత్రం గ్రామాల్లోని ప్రధాన కూడళ్ళ వద్ద బతుకమ్మలను పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ బతుకమ్మ ఆటలు ఆడారు. మంథని మాజీ చైర్‌పర్సన్స్‌ పుట్ట శైలజ, పెండ్రి రమలు, వివిధ రాజకీయ పార్టీల మహిళా నేతలు పలు చోట్లు మహిళలతో బతుకమ్మ ఆటలు ఆడి సందడి చేశారు. మహిళల బతుకమ్మ ఆటాపాటలతో సాయంత్రం నుంచి రాత్రి వరకు గ్రామ కూడళ్ళల్లో సందడి నెలకొంది. బతుకమ్మ ఆటల వద్ద డీజే సౌండ్స్‌ పెట్టుకొని బతుకమ్మ, దాండియా పాటలకు లయబద్ధంగా నృత్యాలు చేసి హోరెత్తించారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఆనంతరం గౌరమ్మ వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ పూల పండగతో పల్లె, పట్నం తేడా లేకుండా సందడి మొదలైంది.

Updated Date - Sep 21 , 2025 | 11:58 PM