ఆయిల్‌పామ్ సాగుపై విస్తృత ప్రచారం
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:01 AM
ఆయిల్‌పామ్ పంట సాగుపై జిల్లా యంత్రాంగం విస్తృత ప్రచారం చేస్తోంది. ప్రస్తుతం సాగుకన్నా అదనంగా మరో రెండు వేల ఎకరాలు సాగు లక్ష్యంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన కల్పిస్తున్నారు.
సుల్తానాబాద్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఆయిల్‌పామ్ పంట సాగుపై జిల్లా యంత్రాంగం విస్తృత ప్రచారం చేస్తోంది. ప్రస్తుతం సాగుకన్నా అదనంగా మరో రెండు వేల ఎకరాలు సాగు లక్ష్యంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. మూడేళ్ల నుంచి జిల్లాలో ఆయిల్ పామ్ సాగు కొనసాగుతుంది. ఎంపిక చేసిన రైతులతో ప్రస్తుతం 3600 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తోంది. అయితే ఆశించిన స్థాయిలో సాగు జరగడం లేదని, ఇంకా ఎక్కువగా జిల్లాలో సాగు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఉద్యానవన శాఖతోపాటు వ్యవసాయ, సహకార శాఖల అధికారులను సమన్వయం చేస్తూ రైతులకు ఆయిల్‌పామ్ సాగుతో కలిగే లాభాల గురించి వివరిస్తున్నారు. ఇటీవల కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జిల్లాలోని సహకార సంఘాల ద్వారా అదనంగా ఆయిల్ పామ్ సాగుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సహకార సంఘాల సీఈఓలు రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు అన్ని సొసైటీల ద్వారా అవగాహన కార్యక్రమాల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ, ఉద్యానవనశాఖ అధికారులు గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. గ్రామాలు, మండలాల పరిధిలోని రైతు గ్రూపుల్లో ఆయిల్ పామ్ పంట సాగు, లాభాలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఏ పంట సాగు చేసినా ఖర్చులు పెరిగిపోయి, నికర ఆదాయం తక్కువ వస్తుందని, అది కూడా వాతావరణం అనుకూలిస్తేనే పంట చేతికి వచ్చే అవకాశం ఉందని వివరిస్తున్నారు. ఆయిల్‌పామ్ సాగు చేస్తే అకాల వర్షాలు, ఈదురుగాలులతో నష్టం ఉండదని, కోతులు, అడవి పందులు, ఇతర చీడపీడల బెడద ఉండదని, మందుల పిచికారి అవసరం రాదని తెలుపుతున్నారు. ఆయిల్‌పామ్ పంటకు డిమాండ్ ఉంటుందని, టన్నుకు రూ.19 వేల నుంచి రూ.21 వేల వరకు ధర పలుకుతుందన్నారు. పంట దిగుబడులు అమ్ముకోవడానికి ఇబ్బంది లేదని, కంపెనీ వారే పంటను కొనుగోలు చేస్తారని అవగాహన కల్పిస్తున్నారు. ఒకసారి నాటితే నాలుగవ యేట నుంచి 35 ఏళ్ల వరకు యేటా దిగుబడి వస్తుందని వివరిస్తున్నారు. ఇది జూలై నెల నుండి మొదలు జనవరి నెల వరకు గెలలు పెడుతూ నిరంతరం దిగుబడి ఉంటుందని వ్యవసాయ శాఖ, ఉద్యానవనశాఖ అధికారులు రైతులకు తెలుపుతున్నారు.
పదివేల ఎకరాల సాగులక్ష్యం
- శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి
జిల్లాలో పదివేల ఎకరాలు సాగు చేయాలని లక్ష్యం. కాల్వశ్రీరాంపూర్ మండలంలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్న నేపథ్యంలో దాని సామర్థ్యానికి 10 వేల ఎకరాలు పరిమితిగా నిర్ణయించారు. ప్రస్తుతం జిల్లాలో 3600 ఎకరాల్లో సాగువుతుంది. పామాయిల్ తోటలో మొక్కల మధ్యన అంతరపంటలుగా మొక్కజొన్న, పత్తి, పెసర్లు, మినుములు, బబ్బెర్లు, వేరుశెనగ, పొద్దుతిరుగుడు, మునగ, పలు కూరగాయలు, పూలసాగు చేసుకోవచ్చు. పంట చేతికందే వరకు మూడు ఏళ్లపాటు ఆదాయం పొందవచ్చును. యాసంగి సీజన్‌లో వరి విస్తీర్ణం తగ్గించి, దాని స్థానంలో ఆయిల్ పామ్ సాగు చేయాలన్నారు.
జిల్లాలో 20 సహకార సంఘాలు...
- శ్రీమాల, జిల్లా సహకార శాఖ అధికారి
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అదనంగా మరో రెండు వేల ఎకరాలలో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యాన్ని విధించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న 20 సొసైటీలలో ఒక్కొక్క సొసైటీకి వంద ఎకరాల లక్ష్యాన్ని ఏర్పాటు చేసి, ఆ పరిధిలోని ఐదు ఎకరాల నుంచి 10 ఎకరాల పైననున్న రైతులను ఎంపిక చేస్తున్నాం. జిల్లాస్థాయిలో ఇప్పటికే మూడు శాఖల సమన్వయంతో సమావేశాలు జరిపాం. అదనపు సాగు కోసం కొందరిని ఎంపిక చేస్తాం. ఇప్పటికే ఆసక్తిగల రైతుల జాబితాను తయారు చేసి జిల్లా అధికారులకు పంపించాం.