టీఎస్‌టీపీపీ స్టేజ్ 2పై ఎన్టీపీసీ మల్లగుల్లాలు..!
ABN , Publish Date - Dec 19 , 2025 | 12:08 AM
తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు(టీఎస్‌టీపీపీ) స్టేజ్ 2 నిర్మాణం విషయంలో ఎన్టీపీసీ మల్లగుల్లాలు పడుతున్నది. రెండో దశలో నిర్మించాల్సిన 800 మెగావాట్ల మూడు యూనిట్ల విషయంలో కీలకమైన పర్యావరణ అనుమతి రెండు నెలల క్రితమే లభించింది. అయితే ప్రాజెక్టు విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ) కుదరడం లేదు.
జ్యోతినగర్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు(టీఎస్‌టీపీపీ) స్టేజ్ 2 నిర్మాణం విషయంలో ఎన్టీపీసీ మల్లగుల్లాలు పడుతున్నది. రెండో దశలో నిర్మించాల్సిన 800 మెగావాట్ల మూడు యూనిట్ల విషయంలో కీలకమైన పర్యావరణ అనుమతి రెండు నెలల క్రితమే లభించింది. ఇతర క్లియరెన్సులు, ప్రాజెక్టు వ్యయానికి సంబంధించి 29,485 కోట్ల రూపాయలకు ఎన్టీపీసీ బోర్డు(బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్) అనుమతి లభించింది. స్టేజ్ 2కు సంబంధించి నిర్మాణ కాంట్రాక్టు బీహెచ్‌ఈఎల్ దక్కించుకుంది. అయితే ప్రాజెక్టు విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ) కుదరడం లేదు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం 4000 మెగావాట్ల తెలంగాణ ఎస్‌టిపిపి నుంచి 85శాతం విద్యుత్ తెలంగాణ రాష్ట్రానికే కేటాయిస్తారు. ఈ క్రమంలో స్టేజ్ 1(1600 మెగావాట్లు) విషయంలో పీపీఏ చేసుకున్నట్లే స్టేజ్ 2కు కూడా కొనుగోలు ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పీపీఏ చేసుకోవడం లేదు. పీపీఏ విషయంలో రాతపూర్వకంగా తెలియజేయాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ 8 నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. స్టేజ్2లో నిర్మించే మూడు యూనిట్లలో ఒకే యూనిట్‌కు(800 మెగావాట్లు) పీపీఏ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందనే ప్రచారం జరిగింది. ప్రచారం జరిగినప్పటికీ పీపీఏ కుదర లేదు. దీంతో ఎన్టీపీసీ అయోమయంలో పడింది. తెలంగాణ ప్రభుత్వం పీపీఏ చేసుకోకపోవడం, ఏ విషయాన్ని ప్రకటించకపోవడంతో టీఎస్‌టీపీపీ రెండో దశ నిర్మాణంలో స్తబ్ధత నెలకొంది.
జెన్‌కో యూనిట్ ఎన్టీపీసీ నిర్మించేనా..?
రామగుండం బీ థర్మల్ పవర్ ప్రాజెక్టు(టీఎస్ జెన్‌కో) స్థలంలో 800 మెగావాట్ల ప్లాంటు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినేట్ సమావేశంలో రామగుండం బి థర్మల్‌ప్రాజెక్టు స్థానంలో 800 మెగావాట్ల యూనిట్‌ను ఎన్టీపీసీతో నిర్మించాలని తీర్మానించారు. అయితే జెన్‌కోకు చెందిన థర్మల్ ప్లాంటును నిర్మించేందుకు ముందుకు వస్తుందా అనే విషయంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీపీసీ ఆధ్వర్యంలోని 2400 మెగావాట్ల టీఎస్‌టీపీపీ స్టేజ్ 2 నిర్మాణానికి పీపీఏ ఒప్పందం కుదరక జాప్యం జరుగుతున్న క్రమంలో జెన్‌కో యూనిట్‌ను నిర్మించేందుకు ముందుకు వస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అ లాగే టీఎస్‌టీపీపీ నుంచి పూర్తిస్థాయి విద్యుత్ రాష్ట్రానికే కేటాయించడం, నిధులన్నీ ఎన్టీపీసీనే సమకూర్చుకో వడం, అన్ని అనుమతులతో నిర్మాణానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టు కాకుండా వేరే ప్రాజెక్టును నిర్మిస్తుందా అనే సందేహాలు ఎదురవుతున్నాయి. ఎన్టీపీసీ రెడీమేడ్‌గా అందించే విద్యుత్ ప్రాజెక్టుకు పీపీఏ చేసుకోకుండా అదే ఎన్టీపీసీ సంస్థతో జెన్‌కో ప్లాంటును నిర్మించాలనే ప్రయత్నం ఎలా ఫలిస్తుందనే అనుమానం వ్యక్తమవుతోంది.