Share News

ఎన్టీపీసీ ఏరియా ట్రాక్టర్‌ డ్రైవర్లకు పెరిగిన వేతనాలు

ABN , Publish Date - May 11 , 2025 | 11:45 PM

ఎన్టీపీసీ ఏరియా ట్రాక్టర్‌ డ్రైవర్లకు వేతనాలు పెరిగాయని, ట్రాక్టర్‌ యజమానులతో జరిగిన ఒప్పందంలో గతంలో కన్నా 2 వేల రూపాయల వేతనాలను పెంచుతూ ఒప్పందం కుదిరిందని ఐఎఫ్‌టియు జిల్లా అధ్యక్షుడు ఇ.నరేష్‌, ఉపాధ్యక్షుడు శంకర్‌ తెలిపారు. ఆదివారం యూనియన్‌ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వేతన ఒప్పందం వివరాలను వెల్లడించారు.

ఎన్టీపీసీ ఏరియా ట్రాక్టర్‌ డ్రైవర్లకు పెరిగిన వేతనాలు

జ్యోతినగర్‌, మే 11 (ఆంధ్రజ్యోతి): ఎన్టీపీసీ ఏరియా ట్రాక్టర్‌ డ్రైవర్లకు వేతనాలు పెరిగాయని, ట్రాక్టర్‌ యజమానులతో జరిగిన ఒప్పందంలో గతంలో కన్నా 2 వేల రూపాయల వేతనాలను పెంచుతూ ఒప్పందం కుదిరిందని ఐఎఫ్‌టియు జిల్లా అధ్యక్షుడు ఇ.నరేష్‌, ఉపాధ్యక్షుడు శంకర్‌ తెలిపారు. ఆదివారం యూనియన్‌ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వేతన ఒప్పందం వివరాలను వెల్లడించారు. 25 సంవత్సరాలుగా ఐఎఫ్‌టియు అనుబంధ రామగుండం ఏరియా మోటార్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ట్రాక్టర్‌ డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేశామని, మంచి వేతన ఒప్పందాలు చేశామన్నారు. ప్రస్తుత వేతన ఒప్పందం కాలపరిమితి ముగియడంతో మార్చి 3న మోటార్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ట్రాక్టర్‌ యజమానులకు లేఖ రాశామన్నారు. ఏప్రిల్‌ 7న డిమాండ్‌ నోటీసు పంపించామని, 16న సమ్మె నోటీసు ఇచ్చామని పేర్కొన్నారు. ఈ విషయంలో యజమానులతో మూడుసార్లు చర్చలు జరిగాయని, యజమానుల సానుకూలంగా వ్యవహించడంతో 2 వేల రూపాయల మేరకు జీతం పెంచేలా ఒప్పందం కుదిరిందని తెలిపారు. ప్రతీ ట్రాక్టర్‌ డైవర్‌కు 26 రోజులకు 17,100 రూపాయలు ఇవ్వాలని, సంవత్సరానికి రెండు జతల యూనిఫారాలు, జత బూట్లు, హెల్మెట్‌, సంవత్సరానికి ఒక నెల వేతనం బోనస్‌గా చెల్లించాలని, 18 లీవులు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందని తెలిపారు. ప్రతీ నెల 10వ తేదీలోగా డ్రైవర్లకు వేతనాలు చెల్లించాలని, డ్యూటీ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే ట్రాక్టర్‌ యజమానే బాధ్యత తీసుకోవాలని ఒప్పందం కుదిరిందన్నారు. ఈ వేతన ఒప్పందం రెండేళ్లపాటు ఉంటుందని నరేష్‌, శంకర్‌ తెలిపారు. ఒప్పందంలో ట్రాక్టర్‌ యజమానుల ప్రతినిధులు, యూనియన్‌ ప్రతినిధులు సంతకాలు చేశారని వారు తెలిపారు.

Updated Date - May 11 , 2025 | 11:45 PM