ముగిసిన నామినేషన్ల పర్వం
ABN , Publish Date - Dec 07 , 2025 | 01:06 AM
పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ముగిసింది. మొదటి విడత పల్లెల్లో ప్రచారం ఊపందుకుంది. రెండో విడత గ్రామాల్లో ఈనెల 6వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. మూడో విడత పంచాయతీల్లో నామినేషన్ల పరిశీలన, అప్పీళ్ల స్వీకరణ, అప్పీళ్ల పరిష్కారం కార్యక్రమాలు వచ్చే రెండు, మూడు రోజుల్లో పూర్తి కానున్నాయి. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ఈనెల 9వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంది.
జగిత్యాల, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ముగిసింది. మొదటి విడత పల్లెల్లో ప్రచారం ఊపందుకుంది. రెండో విడత గ్రామాల్లో ఈనెల 6వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. మూడో విడత పంచాయతీల్లో నామినేషన్ల పరిశీలన, అప్పీళ్ల స్వీకరణ, అప్పీళ్ల పరిష్కారం కార్యక్రమాలు వచ్చే రెండు, మూడు రోజుల్లో పూర్తి కానున్నాయి. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ఈనెల 9వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంది.
ఫ11న తొలి విడత ఎన్నికలు
జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కోరుట్ల మండలాలతో పాటు వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్, మేడిపల్లి, భీమారం మండలాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తొలి విడతలో 122 సర్పంచ్, 1,172 వార్డు సభ్యుల స్థానాలకు ఈనెల 11న ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో సర్పంచ్ స్థానాలకు 461 మంది అభ్యర్థులు, వార్డు సభ్యుల స్థానాలకు 1,954 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒకరికి మించి మరొకరు ప్రచారంలో దూసుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారు.
ఫరెండో విడతలో నేటి నుంచి ఊపందుకోనున్న ప్రచారం
జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోని జగిత్యాల అర్బన్, జగిత్యాల రూరల్, రాయికల్, బీర్‌పూర్, సారంగాపూర్ మండలాలతో పాటు చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని మల్యాల, కొడిమ్యాల మండలాల్లో భారీగానే నామినేషన్లు వచ్చాయి. రెండో విడతలో పంచాయతీ సర్పంచ్ స్థానాలు 144 ఉండగా 941 నామినేషన్లు దాఖలు అయ్యాయి. వార్డు సభ్యుల స్థానాలు 1,276 ఉండగా 2,927 నామినేషన్లను అధికారులు స్వీకరించారు. నామినేషన్ల పరిశీలన, అప్పీళ్ల స్వీకరణ, అప్పీళ్ల పరిష్కారం, నామినేషన్ల ఉప సంహరణ కార్యక్రమాలు ముగిశాయి. ఆయా పంచాయతీల బరిలో నిలిచే అభ్యర్థుల వివరాలు తేలడంతో ప్రచార పర్వం షురూ కానుంది.
ఫమూడో విడతలో 119 పంచాయతీలు
జిల్లాలోని ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలోని గ్రామాల్లో మూడో విడతలో సైతం భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. మూడో విడతలో 119 పంచాయతీల సర్పంచ్ స్థానాలకు గానూ 873 నామినేషన్లు, 1,088 వార్డు సభ్యుల స్థానాలకు గానూ 2,639 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇందులో సర్పంచ్ స్థానాల్లో బుగ్గారం మండలంలో 90 నామినేషన్లు, ధర్మపురిలో 150, ఎండపల్లిలో 107, గొల్లపల్లిలో 203, పెగడపల్లిలో 196, వెల్గటూరులో 127 నామినేషన్లను అధికారులు స్వీకరించారు. వార్డు సభ్యుల స్థానాల్లో బుగ్గారం మండలంలో 263 నామినేషన్లు, ధర్మపురిలో 501, ఎండపల్లిలో 345, గొల్లపల్లిలో 613, పెగడపల్లిలో 553, వెల్గటూరులో 364 నామినేషన్లను అధికారులు స్వీకరించారు. పలువురు చోటా మోటా నేతలు సైతం ఎన్నికల బరిలో దిగడానికి ఆసక్తిని కనబరిచి నామినేషన్లు సమర్పించారు. భారీగా దాఖలు అయిన నామినేషన్లు తమ కొంపలు ముంచుతాయని పంచాయతీ అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. నామినేషన్లు వేసిన అభ్యర్థులను కలిసి నయానో..భయానో ఉప సంహరణ చేయించడంపై దృష్టి సారించారు. ఇందుకు అనుగుణంగా తమ అనుచరులు, కార్యకర్తలు, ప్రత్యేక వ్యక్తులను కార్యరంగంలోకి దించుతున్నారు. అభ్యర్థులు ఎక్కువగా పోటీలో ఉన్నట్లయితే క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలుంటాయని పలువురు అభ్యర్థులు భావిస్తున్నారు. దీంతో రాజకీయ పాచికలు ఉపయోగించి ఉప సంహరణ చేయించడంపై నేతలు దృష్టి సారించారు.
ఫక్రాస్ ఓటింగ్‌పై గుబులు...
జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌పై అభ్యర్థులకు, రాజకీయ పక్షాల నేతలకు గుబులు పట్టుకుంది. ఎన్నికల బరిలో పదుల సంఖ్యలో అభ్యర్థులు రంగంలో దిగడంతో ఓట్లు చీలిపోతాయన్న ఆందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో పోటీకి దిగిన అభ్యర్థులు క్రాస్ ఓటింగ్‌పై ఆలోచన చేస్తున్నారు. ఆయా కులాలు, సంఘాలకు చెందిన వ్యక్తులు, నేతలు పలు పార్టీల మద్దతుతో, స్వతంత్రంగా నామినేషన్లు దాఖలు చేయడంతో వందల సంఖ్యలో ఓట్లు పడకుండా ఉంటాయని అభిప్రాయ పడుతున్నారు. ఒక్కో అభ్యర్థి కనీసం వంద నుంచి ఆపై ఓట్లను రాబట్టుకున్నా లెక్కింపులో ప్రతీ ఓటుకు విలువ ఏర్పడుతుందన్న ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు అభ్యర్థులకు కేటాయించే గుర్తుల వల్ల సైతం క్రాస్‌ఓటింగ్ జరిగే అవకాశాలుంటాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నారు. గుర్తులను పోలియున్న ఇతర గుర్తులను అభ్యర్థులకు కేటాయిస్తే పల్లె ప్రజలు పొరపాటున ఇతర గుర్తులపై ఓటు వేసి ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళన పంచాయతీ అభ్యర్థుల్లో నెలకొంది.
ఫఉపసంహరణపై దృష్టి...
జిల్లాలోని మూడో విడత పంచాయతీల్లో భారీగా నామినేషన్లు దాఖలు కావడంతో ఓటు చీలిపోకుండా ఉండడానికి అభ్యర్థులు ఉప సంహరణ వ్యవహారంపై దృష్టి సారించారు. గతంలో తమ వర్గంతో పనిచేసి ప్రస్తుతం నామినేషన్లు వేసిన అభ్యర్థులను బుజ్జగించి ఉప సంహరణ చేయించడానికి ప్రయత్నిస్తున్నారు. బుజ్జగింపులతో పాటు తాయిలాలు సైతం అందించడానికి రాజకీయ పక్షాలు, అభ్యర్థులు పావులు కదుపుతున్నాయి. నామినేషన్ వేసిన అభ్యర్థుల్లో తమకు ఇబ్బంది కలిగించే వ్యక్తులు ఎవరు..సంబందిత అభ్యర్థులను బుజ్జగించడం ఎలా అన్న అంశాలపై దృష్టి సారించారు. తాము గుర్తించిన వ్యక్తులను నామినేషన్లను ఉప సంహరించడానికి సామ, దాన, దండోపాయాలను అభ్యర్థులు ప్రయోగించడానికి సిద్ధమవుతున్నారు. ఉత్కంఠకు దారి తీస్తున్న పంచాయతీ ఎన్నికల చదరంగంలో బరిలో నిలిచేదెవరూ...గెలిచేదెవరూ అన్న ఆసక్తి పల్లె ఓటర్లలో చోటుచేసుకుంటోంది.