Share News

చినుకు జాడేదీ...!

ABN , Publish Date - Jun 20 , 2025 | 12:41 AM

మేఘాలు వర్షించడం లేదు... వానాకాలం సాగుకు సమాయత్తం అవుతున్న రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు... మరోవైపు మబ్బులు కమ్ముకోవడంతో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వర్షాల కోసం రైతులు, ప్రజలు ఎదురుచూస్తున్నారు. వర్షాలు కురవాలని ప్రజలు, రైతులు కప్పతల్లి ఆటలు, ఆలయాల్లో జలాభిషేకాలు చేస్తున్నారు.

చినుకు జాడేదీ...!

సుల్తానాబాద్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): మేఘాలు వర్షించడం లేదు... వానాకాలం సాగుకు సమాయత్తం అవుతున్న రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు... మరోవైపు మబ్బులు కమ్ముకోవడంతో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వర్షాల కోసం రైతులు, ప్రజలు ఎదురుచూస్తున్నారు. వర్షాలు కురవాలని ప్రజలు, రైతులు కప్పతల్లి ఆటలు, ఆలయాల్లో జలాభిషేకాలు చేస్తున్నారు.

వానాకాలం వ్యవసాయ సీజన్‌ పనులకు వరుణుడు కరుణించడం లేదు. ఇప్పటికే ఓ మోస్తారు వర్షాలు కురువాల్సి ఉండగా వానల ఊసే లేకుండా పోయింది. ఎండలు మండిపోతుండడంతో ప్రజలు ఉక్కపోతతో తల్లడిల్లిపోతున్నారు. రైతులు చినుకు కోసం ఎదురుచూస్తున్నారు. కొన్ని రోజులుగా మేఘాలు ఊరిస్తున్నాయే తప్ప చినుకురాలడం లేదు. ఆక్కడక్కడా రెండు మూడు చినుకులు పడి ఇక చాలన్నట్లుగా ముఖం చాటేస్తున్నాయి. దీంతో రైతుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. వానలు ఎప్పుడు పడుతాయో, సాగు పనులు ఎపుడు ప్రారంభం చేయాలన్న సందిగ్థంలో రైతులు ఉన్నారు. జూన్‌ మాసం వానాకాలం సీజన్‌లో వర్షాలు కురుస్తాయి. ఈ ఏడాది మేలో వర్షాలు కురిసాయి. యాసంగి సీజన్‌లో పండించిన దాన్యాన్ని రైతులు ఆయా సమీప గ్రామాలలోని కొనుగోలు కేంద్రాలలో విక్రయానికి ఉంచగా వర్షాలతో ధాన్యం తడిసిపోయింది. ఎలాగో కొనుగోలు తతంగం ముగిసినా ఇక వానాకాలం సాగు పనులు ఆరంభం కావాల్సిన పరిస్థితుల్లో వానలు జాడ లేకుండా పోయాయి. పొలం పనుల కోసం రైతులు వారి కుటుంబ సభ్యులంతా సిద్ధంగా ఉన్నారు. విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉన్నా వానలు కురువక పనులు ఎక్కడిక్కడే ఆగిపోయాయి. ఇప్పటికైనా వాన దేవుడు కరుణించాలని రైతులు వేడుకుంటున్నారు.

వర్షాలు కురవాలని కప్పతల్లి ఆట, జలాభిషేకాలు

వరుణుడి కరుణ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. వర్షాలు కురవాలని గురువారం పలు గ్రామాలలలో కప్పతల్లి ఆటలకు శ్రీకారం చుట్టారు. మండలంలోని రేగడిమద్దికుంట గ్రామంలో రైతులు కప్పతల్లి ఆటలు ఆడుతు వాటికి పెళ్ళిళ్ళు జరిపించారు. గ్రామంలోని గ్రామ దేవతలతో సహా ప్రధాన ఆలయాలలో స్వామి వార్లకు జలాభిషేకాలు నిర్వహించారు. బావులు బోరింగుల నుంచి బిందెలలో నీళ్ళు తీసుకువచ్చి ఆలయాలలో వరుణుడు కరుణించాలని పూజలు చేశారు. సింగిల్‌ విండో చైర్మన్‌ గడ్డం మహిపాల్‌ రెడ్డి, దేవుని రాజయ్య, బొజ్జ సది, చిక్కుడు రాజయ్య, శ్రీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2025 | 12:41 AM