సాగుకు లేదు బెంగ..
ABN , Publish Date - Sep 20 , 2025 | 12:33 AM
ఉత్తర తెలంగాణ జిల్లాలకు గోదావరి నది వరప్రదాయినిగా మారింది. జీవధారగా నిత్యం ప్రవహించకున్నా వర్షాకాలంలో నదికి వచ్చే వరదే ఉత్తర తెలంగాణ ప్రజలకు సాగు, తాగునీరందించి బతుకుబాటను చూపుతోంది.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
ఉత్తర తెలంగాణ జిల్లాలకు గోదావరి నది వరప్రదాయినిగా మారింది. జీవధారగా నిత్యం ప్రవహించకున్నా వర్షాకాలంలో నదికి వచ్చే వరదే ఉత్తర తెలంగాణ ప్రజలకు సాగు, తాగునీరందించి బతుకుబాటను చూపుతోంది. శ్రీరాంసాగర్, శ్రీపాద ఎల్లంపల్లి, మధ్య మానేరు, దిగువ మానేరు డ్యామ్‌లు 150 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యంతో సుమారు 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తూ ఈ జిల్లాలను తెలంగాణ ధాన్యాగారంగా మార్చుతున్నాయి. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసిన వర్షాల కారణంగా గోదావరి నదికి వచ్చిన వరద 500 టీఎంసీలకు పైగా ఉండగా ఆయా డ్యామ్‌లలో 150 టీఎంసీల నీటిని ఒడిసిపట్టుకున్నాము. మిగతా వరద దిగువకు వెళ్లిపోయింది.
ఫ ఎల్‌ఎండీ, మిడ్ మానేరుకు..
ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే జూన్ నుంచి సెప్టెంబరు 18 వరకు గోదావరి నదికి ఎస్సారెస్పీలోకి 454.1 టీఎంసీల వరద ప్రవాహం వచ్చిందని అధికారులు లెక్కేశారు. ఈ ప్రాజెక్టు నుంచి వరద కాలువ ద్వారా 45.82 టీఎంసీల నీటిని మిడ్ మానేరుకు వదలారు. 27 టీఎంసీల నీటినిలువ సామర్థ్యం ఉన్న మిడ్ మానేరు నిండిన తర్వాత దిగువ మానేరు డ్యామ్‌కు గేట్లు తెరచి నీటిని వదలారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీలోని 9, 10 ద్వారా అనంతసాగర్, రంగనాయక్‌సాగర్‌కు కూడా నీటి విడుదల కొనసాగుతున్నది.
ఫ కాకతీయ కాలువ ద్వారా ఆయకట్టుకు..
కాకతీయ కాలువ ద్వారా నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్ జిల్లాల ఆయకట్టుకు నీటి విడుదల కొనసాగుతుండగా లోయర్ మానేరు డ్యామ్ పూర్తిగా నిండి 24 టీఎంసీల నీటిని నిలువ చేసుకున్నది. ఎస్సారెస్పీ గేట్లు తెరచి 332 టీఎంసీల నీటిని కిందికి వదిలారు. ఈ వరదతోపాటు ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టు నిండి దాని గేట్ల ద్వారా భారీ ఎత్తున వరద గోదావరిలో కలిసింది. ఈ వరద ప్రవాహమంతా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి దిగువకు మంథని, కాళేశ్వరం మీదుగా ప్రవహించింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 20.17 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగి ఉండగా ఇంకా భారీగా వరద ప్రవాహం వస్తుండడంతో 18 టీఎంసీల నీటిని ప్రాజెక్టులో ఉంచి వచ్చిన వరదనంతా కిందికి వదిలేస్తున్నారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో సెప్టెంబరు 19 సాయంత్రానికి 78 టీఎంసీల నీరు నిలువ ఉండగా దిగువకు గేట్ల ద్వారా 51,560 క్యూసెక్కుల నీటిని వదిలేస్తున్నారు. ఎల్‌ఎండీ నీటి నిలువ సామర్థ్యం 24.032 టీఎంసీలు కాగా 23.732 టీఎంసీలను నిలువ చేసుకొని 20,309 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మిడ్ మానేరు డ్యామ్‌కు 9,500 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా ప్యాకేజీ 9,10కి 3,700, దిగవకు 5,500 క్యూసెక్కుల నీటిని వదిలేస్తున్నారు.
ఫ 3,43,240 ఎకరాల్లో పంటల సాగు
జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో 3,43,240 ఎకరాలలో వరి, మొక్కజొన్న, పత్తి, ఇతర పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ప్రధానంగా 2,76,500 ఎకరాల్లో వరి సాగు చేశారు. శ్రీరాంసాగర్, ఇటు ఎల్‌ఎండి డ్యామ్‌లు నిండి ఉండడంతో ఈ జిల్లా సాగుకు ఖరీఫ్‌కు ఢోకా లేకుండా పోయింది. ఖరీఫ్‌కే కాకుండా రబీ సీజన్‌కు కూడా సాగునీరుకు సమస్యలేని పరిస్థితి ప్రస్తుతం ఉన్నది. దీంతో జిల్లా రైతులు కాలం కలిసి రావడంతో పూర్తిగా సంతోషంగా ఉన్నారు.