నల్లనేలపై కొత్త ఖనిజాలు
ABN , Publish Date - Jun 08 , 2025 | 12:32 AM
సింగరేణి ప్రాంత బొగ్గు, మట్టి పొరల్లో అనేక ఖనిజ సంపదలు ఉన్నట్టు వెల్లడవుతున్నది. బొగ్గును వెలికి తీసేందుకు తవ్వుతున్న మట్టి పొరల్లో బొగ్గు మండించడం ద్వారా విద్యుత్ సంస్థల్లో ఏర్పడుతున్న బూడిదలో సైతం అనేక రకాల ఖనిజాలు బయట పడుతున్నాయి. సింగరేణి యాజమాన్యం ఈ ఖనిజాల పరిశోధనపై దృష్టి సారించింది.
గోదావరిఖని, జూన్ 7(ఆంధ్రజ్యోతి): సింగరేణి ప్రాంత బొగ్గు, మట్టి పొరల్లో అనేక ఖనిజ సంపదలు ఉన్నట్టు వెల్లడవుతున్నది. బొగ్గును వెలికి తీసేందుకు తవ్వుతున్న మట్టి పొరల్లో బొగ్గు మండించడం ద్వారా విద్యుత్ సంస్థల్లో ఏర్పడుతున్న బూడిదలో సైతం అనేక రకాల ఖనిజాలు బయట పడుతున్నాయి. సింగరేణి యాజమాన్యం ఈ ఖనిజాల పరిశోధనపై దృష్టి సారించింది. కొంత కాలంగా జరుపుతున్న పరి శోధనల్లో ఆర్‌ఈఈ (రేర్ ఎర్త్ ఎలిమెంట్స్) ఉన్నట్టు తేలింది. 14రకాల ఖనిజాలు సింగరేణి ప్రాంత బొగ్గు, మట్టి పొరల్లో కనబడుతున్నాయి. ఇందులో ప్రధానంగా సిరియం, లాంథనం, నియోడిమియం, పేసియో డిమి యం, గాడా నిలియం, డిస్సోజియం, ల్యూటెటియం, రెనాడియం, స్ర్టాంటియం, జిర్కోనియం లాంటి అనేక ఖనిజాలు ఈ మట్టిలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ ఖనిజ సంపదపై మరింత అధ్యయనం చేసేందుకు సింగరేణి యాజమాన్యం సంస్థకు అనుబంధంగానే జియో సైన్స్ లేబోరెటరీని ఏర్పాటు చేసేందుకు సిద్ధపడింది. ఖనిజ రంగంలో దేశ స్వయం సమృద్ధి లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో కలిసి పనిచేసేందుకు సింగరేణి ప్రయత్నాలు మొదలు పెట్టింది. జాయింట్ వెంచర్లుగా ఏర్పాటు చేయడానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ రంగంలో సలహాలు, సంప్రదింపుల కోసం డెలాయిట్ సంస్థను కన్సల్టెన్సీగా నియమించుకుని కేంద్ర ప్రభుత్వం నిర్వ హించే కీలక ఖనిజాల వేలంలోనూ పాల్గొనడానికి సంస్థ సంసిద్ధతను వ్యక్తపరుస్తున్నది.
అంతేకాకుండా ఆస్ర్టేలియా క్వీన్స్‌ల్యాండ్ ప్రభుత్వ ప్రతినిధులతో కూడా ఖనిజాల ఉత్పత్తికి ఉమ్మడిగా పాల్గొనేందుకు సంప్రదింపులు జరుపుతున్నది. ఈ అంశాలపై సీఎండీ బలరాంనాయక్ కేంద్ర గనుల శాఖ నిర్వహించిన జాతీయస్థాయి కీలక ఖనిజాల సద స్సులో వెల్లడించారు. జైపూర్‌లోని సింగరేణి థర్మల్ విద్యుత్ ప్లాంట్ నుంచి ఉత్పత్తిలో భాగంగా విడుదల అవుతున్న ఫ్లైయాష్‌ను భువనేశ్వర్‌లోని ఐఎంఎంటీసి ల్యాబోరేటరీలో పరిశీలించగా ఆర్‌ఈఈ(రేర్ ఎర్త్ ఎలిమెంట్స్) ఉన్నట్టు నిర్ధారణ జరిగింది. ఖమ్మం జిల్లా కల్లూరు ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో కూడా కీలక ఖనిజాలు ఉన్నట్టు గమనించారు. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, నియోబీయం ఖనిజాలకు కార్పొనేటైస్ ప్రధాన ఆధారా లుగా ఉన్నాయి. రామగుండం ఓపెన్‌కాస్టు-2 గనిలో సింగరేణి థర్మల్ పవర్‌ప్లాంట్లలో ఫ్లై యాష్, బాటమ్ యాష్‌లో ఖనిజాలు ఉన్నట్టు సింగరేణి యాజమాన్యం గుర్తించింది. వీటిలో ప్రధానంగా సిరియం, లాంథనం, నియోడిమియం, ప్రెసియోడిమియం, గాడోలినియం, డిస్పోజీయం, యూటేటియం లాంటి ఖనిజాలు ఉన్న ట్టు వెల్లడయ్యింది. రీసర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైద రాబాద్ జరిపిన పరిశోధనల్లో కూడా రామగుండం ఓసీపీ-2లో కూడా వెనాడియం, స్ర్టాంటియం, జిర్కో నియం ఉన్నట్టు వెల్లడయ్యింది. దీంతో సింగరేణి యాజమాన్యం కోల్‌బెల్ట్ ప్రాంతంలోని ఓపెన్‌కాస్టు మట్టి పొరల్లో సింగరేణి బొగ్గు నుంచి వస్తున్న ఫ్లై యాష్, బాటమ్ యాష్‌లపై పూర్తి స్థాయి పరిశోధన జరిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే బొగ్గు, థర్మల్ విద్యుత్, సోలార్ విద్యుత్, సంప్‌డ్ స్టోరేజీ విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో విస్తరించిన సింగరేణి ఈ ప్రాంతంలో నిక్షిప్తమై ఉన్న వివిధ రకాల ఖనిజాలను పరిశోధించి వెలికి తీసేందుకు కూడా ప్రయోగాలు మొదలు పెట్టింది. ఇక్కడి మట్టి పొరల్లో, బొగ్గు పొరల్లో ఖనిజాల సాంద్రత ఎక్కువగా ఉన్నట్టు తేలితే సింగరేణి సంస్థ మరో ఖనిజ ఉత్పత్తి రంగంలో కూడా అడుగుపెట్టినట్టు అవుతుంది. సింగరేణి చేస్తున్న ఈ ఖనిజాల పరిశోధన రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిగా అంగీకారం తెలిపినట్టు తెలిసింది.