Share News

కరీంనగర్‌ : ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం

ABN , Publish Date - Jun 20 , 2025 | 12:51 AM

జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకానికి జిల్లాలో శ్రీకారం చుట్టారు. ప్రయోగాత్మకంగా 1,875 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టేందుకు జిల్లా వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఆసక్తి ఉన్న రైతులను ఎంపిక చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం లేకుండా సహజ సిద్ధంగా ప్రకృతి వ్యవసాయాన్ని చేసేలా రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించింది.

కరీంనగర్‌ :  ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకానికి జిల్లాలో శ్రీకారం చుట్టారు. ప్రయోగాత్మకంగా 1,875 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టేందుకు జిల్లా వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఆసక్తి ఉన్న రైతులను ఎంపిక చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం లేకుండా సహజ సిద్ధంగా ప్రకృతి వ్యవసాయాన్ని చేసేలా రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందుకోసం జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో 60 శాతం నిధులను కేంద్రం భరిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను సమకూర్చాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పథకం వచ్చి అన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రకృతి సాగును చేపట్టాలని వ్యవసాయ శాఖకు ఆదేశాలిచ్చింది.

ఫ ఒక్కో క్లస్టర్‌లో 125 ఎకరాలు

జిల్లాలో ఉన్న 15 గ్రామీణ మండలాల్లో రెండు, మూడు గ్రామాలను కలిపి మండలానికి ఒక క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో క్లస్టర్‌ పరిధిలో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ఆసక్తి చూపించే 125 మంది రైతులను ఎంపిక చేసి 125 ఎకరాల్లో ఈ సేద్యాన్ని చేపడతారు. రైతులు ఎకరం విస్తీర్ణంలో తమకు నచ్చిన పంటను వేయవచ్చు. అది పూర్తిగా ప్రకృతి సేద్యం విధానాల ద్వారా మాత్రమే చేపట్టాల్సి ఉంటుంది. కూరగాయలు, పప్పు దినుసులు పండిస్తే లాభసాటిగా ఉంటుందని వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 15 క్లస్టర్లలో 1875 ఎకరాల్లో ప్రకృతి సేద్యాన్ని చేపట్టనున్నారు.

ఫ ఎంపిక చేసిన రైతులకు శిక్షణ

ఎంపిక చేసిన రైతులకు చెందిన భూమి నుంచి మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు నిర్వహిస్తారు. ఆ నివేదికలకు అనుగుణంగా భూమిలో ఉన్న లోపాలను సరి చేసేందుకు చర్యలు తీసుకుంటారు. పంటల సాగుకు జీవామృతం, ఘన జీవామృతం, పచ్చిరొట్ట, వివిధ ఆకుల కషాయాలను, అగ్ని అస్త్రం, తదితర ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన వాటిని వినియోగించాల్సి ఉంటుంది. వీటి తయారు కోసం రైతులకు అవసరమైన శిక్షణ ఇస్తారు. సాగు పద్ధతులను సేంద్రియ ఎరువులను వినియోగించే విషయంలో రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు, శిక్షణ ఇచ్చేందుకు క్లస్టర్‌కు కృషి సఖి లేదా కమ్యూనిటీ రీసోర్స్‌ పర్సన్లు ఇద్దరు ఉంటారు. వీరు నెలలో 16 రోజులు సేంద్రీయ సాగు చేస్తున్న క్షేత్రాలను సందర్శించి రైతులకు సూచనలు ఇస్తారు. ఇందుకు రోజుకు 300 రూపాయల చొప్పున వీరికి చెల్లిస్తారు. హైదరాబాద్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ అగ్రికల్చర్‌ అనే ఎన్‌జీవో కృషి సఖి, రీసోర్స్‌ పర్సన్లకు సేంద్రీయ సాగుపై శిక్షణ ఇస్తుంది. అనంతరం వారు రైతులకు సాగు పద్ధతులను ఎప్పటికప్పుడు వివరిస్తూ వస్తుంటారు. ఆయా గ్రామాలకు చెందిన స్వయం సహాయ సంఘాల్లో సభ్యురాళ్లను కృషి సఖి, రీసోర్స్‌ పర్సన్లుగా ఎంపిక చేస్తారు. ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ఆసక్తి చూపించే రైతుల ఎంపిక ప్రక్రియ జరుగుతున్నది. మరో వారం రోజుల్లో ఈ ఎంపిక పూర్తి చేస్తారు.

ఫ సొసైటీలు, ఎన్జీవోల ద్వారా బయో రీసోర్స్‌ సెంటర్లు

రైతులకు జీవామృతం లాంటివి తయారు చేసుకోవడానికి సంవత్సరానికి నాలుగు వేల చొప్పున రెండు సంవత్సరాలకు ప్రభుత్వం ఎనిమిది వేల రూపాయలు ఇస్తుంది. వీటిని తయారు చేసుకోలేనివారు వాటిని బయో రీసోర్స్‌ సెంటర్ల నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లావ్యాప్తంగా 10 బయో రీసోర్స్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆసక్తి ఉన్న వారు వ్యక్తులుగాకాని, ఎన్‌జీవోలుగా కాని, సొసైటీలుగా కాని రీసోర్స్‌ సెంటర్లను ఏర్పాటు చేసుకోవచ్చు. త్వరలోనే ఈ సెంటర్లకు సంబంధించిన సమగ్ర వివరాలు వ్యవసాయశాఖకు అందే అవకాశం ఉందని తెలుస్తున్నది. వ్యవసాయంతో ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం పెరిగింది. వీటిని ఉపయోగించి పండించిన ఆహార ధాన్యాలు, కూరగాయలు తినడం తో రోగాల బారిన పడుతున్న ప్రజలు ప్రకృతి సిద్ధంగా పండించిన పంటలపై ఆసక్తి చూపిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ప్రకృతి సేద్యం ద్వారా పండించిన ఆహార పదార్థాలు, కూరగాయల షాపులు వెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని నిర్ణచించి ఈ పథకం అమలు చేస్తోంది.

Updated Date - Jun 20 , 2025 | 12:51 AM