Karimnagar: మళ్లీ హల్‌చల్ చేసిన నాగసాధు అఘోరీ.. ఈసారి ఏం చేసిందంటే..
ABN , Publish Date - Jan 26 , 2025 | 08:08 AM
తెలంగాణ: రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 2024 సంవత్సరంలో లేడీ అఘోరీ ట్రెండ్ అయ్యారు. ఏపీ, తెలంగాణలో పర్యటిస్తూ ఆమె చేసిన హంగామా అంతాఇంతా కాదు. నవంబర్‌లో ఏపీలో పర్యటిస్తున్న సమయంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోకి తనను అనుమతించ లేదని ఆత్మహత్యాయత్నం చేసింది.

కరీంనగర్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గతేడాది హల్‌చల్ చేసి అదృశ్యమైన నాగసాధు అఘోరీ తాజాగా కరీంనగర్‌లో ప్రత్యక్షమయ్యారు. రెండ్రోజులుగా కరీంనగర్ బైపాస్ రోడ్డు పక్కన అఘోరీ ఉంటోంది. ఇవాళ (ఆదివారం) ఉదయం పెద్దపల్లి వైపు వెళ్తుండగా.. కొందరు ఆకతాయిలు ఆమె వెంట పడ్డారు. దీంతో కారు ఆపేసి వారితో వాగ్వాదానికి దిగారు లేడీ అఘోరీ. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. తన కారును కొంతమంది యువకులు ఢీకొట్టారని, తనతో వాగ్వాదానికి దిగారని పోలీసులకు వివరించారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాగసాధుకు సర్దిచెప్పిన ఖాకీలు ఆమెను తిరిగి పెద్దపల్లి వైపునకు పంపించారు.
కాగా, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 2024 సంవత్సరంలో లేడీ అఘోరీ ట్రెండ్ అయ్యారు. ఏపీ, తెలంగాణలో పర్యటిస్తూ ఆమె చేసిన హంగామా అంతాఇంతా కాదు. నవంబర్‌లో ఏపీలో పర్యటిస్తున్న సమయంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోకి తనను అనుమతించ లేదని ఆత్మహత్యాయత్నం చేసింది. ఏకంగా ఆలయం ఎదుటే ఒంటిపై, కారుపై పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి పాల్పడి భక్తులను భయభ్రాంతులకు గురి చేసింది. అదే నెలలో తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగర శివారు బెస్తంచెరువు శ్మశాన వాటికలో పూజలు చేసిన అఘోరి వికృత చేష్టలకు పాల్పడింది. రెండ్రోజులపాటు శ్మశానంలోనే ఉంటూ విచిత్ర పూజలు చేసింది. రాత్రివేళ వింత పూజలతో కోడిని సైతం బలిచ్చింది. స్థానికుల ఫిర్యాదు మేరకు మామునూరు పోలీస్ స్టేషన్‌లో లేడీ అఘోరీపై సెక్షన్ 325 కింద కేసు నమోదైంది. ఇలాంటి ఎన్నో ఘటనలతో ఆమె సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. కొన్ని రోజులపాటు అదృశ్యమైన అఘోరీ తాజాగా మళ్లీ హల్‌చల్ చేశారు.