Share News

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

ABN , Publish Date - Aug 16 , 2025 | 11:53 PM

అమ్మోనియా ప్లాంట్‌లో వరుస లీకేజీలకు ఎవరి బాధ్యత అని, తెలంగాణ రైతాంగాన్ని గోస పెడుతున్నారంటూ ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ ఆర్‌ఎఫ్‌సీఎల్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం ఆయన ప్లాంట్‌ను పరిశీలించారు. ప్లాంట్‌ హెడ్‌ రమేష్‌ ఠాకూర్‌తో కలిసి ఆయన అమ్మోనియా లీకైన ప్రాంతాన్ని పరిశీలించారు.

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

కోల్‌సిటీ, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): అమ్మోనియా ప్లాంట్‌లో వరుస లీకేజీలకు ఎవరి బాధ్యత అని, తెలంగాణ రైతాంగాన్ని గోస పెడుతున్నారంటూ ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ ఆర్‌ఎఫ్‌సీఎల్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం ఆయన ప్లాంట్‌ను పరిశీలించారు. ప్లాంట్‌ హెడ్‌ రమేష్‌ ఠాకూర్‌తో కలిసి ఆయన అమ్మోనియా లీకైన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అలోక్‌ సింఘాలతో భేటీ అయ్యారు. రామగుండంలో ఎరువుల కర్మాగారం నిర్మిస్తే తెలంగాణ రైతాంగానికి యూరియా సకాలంలో అందుతుందని మూతపడిన ఎఫ్‌సీఐని పునరుద్ధరించి యూపీఏ ప్రభుత్వం కొత్త ప్లాంట్‌ నిర్మాణానికి క్లియరెన్స్‌ ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 11శాతం భాగస్వామిగా చేరిందన్నారు. ప్రస్తుతం అమ్మోనియా బాంబు కింద ఉన్నట్టు ఈ ప్రాంత పరిస్థితి ఉందన్నారు. ప్రాజెక్టులో ఉత్పత్తి అవసరాలకు మిషన్‌ భగీరథ నుంచి నీరు ఇస్తున్నామన్నారు. ఉత్పత్తిలో 50శాతం యూరియాను తెలంగాణకు ఇవ్వాల్సి ఉందన్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నుంచే ఈ సీజన్‌లో తెలంగాణకు 1.2లక్షల టన్నుల యూరియాను తగ్గించారన్నారు. ప్రాజెక్టులో నాసిరకంగా అమ్మోనియా పైప్‌లైన్ల నిర్మాణాలు జరిగి తరచూ లీకేజీ అవుతున్నాయని, ఈ ప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారన్నారు.

నిర్మాణ లోపాలపై సీబీఐతో విచారణ జరిపించాలని లేఖ రాస్తానన్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు ఒక రామగుండంలోనే ప్లాంట్‌ ఉందని, కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఉండడం వల్ల సకాలంలో నిర్ణయాలు జరుగడం లేదన్నారు. తాల్చేర్‌ కేంద్ర కార్యాలయాన్ని ఢిల్లీ నుంచి ఒడిశాకు తరలించారని, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ కేంద్ర కార్యాలయాన్ని నోయిడా నుంచి రామగుండం తరలించాలన్నారు. ప్లాంట్‌ను వెంటనే మరమ్మతు చేసి తెలంగాణకు అత్యవసరంగా ఆగస్టు కోటా 65వేల టన్నులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్లాంట్‌లో జీరో లెవల్‌ డిశ్చార్జి(జెడ్‌ఎల్‌డీ) ప్లాంట్‌ నిర్మించి కాలుష్యం తగ్గించాల్సి ఉండగా నాలుగేళ్లుగా టెండర్ల పేర జాప్యాలు చేస్తున్నారన్నారు. యూరియా రవాణాలో 30శాతం రోడ్డు మార్గంలో జరిగేలా చూడాలని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు సమీపంలో ఉన్నందున లారీల ద్వారా రవాణా పెంచి స్థానిక లారీ యజమానులకు ఉపాధి కల్పించాలన్నారు. అలాగే వీర్లపల్లిని తరలించాలని, ఆర్‌అండ్‌ఆర్‌ కల్పించాలన్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ యాజమాన్యం సీఎస్‌ఆర్‌ కింద రూ.20కోట్లు ఈ ప్రాంత అభివృద్ధికి కేటాయించాలన్నారు. ఈ మేరకు సీఈఓ అలోక్‌ సింఘాల్‌కు వినతి పత్రం అందించారు. డీజీఎం(హెచ్‌ఆర్‌) సోమనాథ్‌, కాంగ్రెస్‌ నాయకులు మహంకాళి స్వామి, ఆసిఫ్‌, గట్ల రమేష్‌, నెలకంటి రాము, రాజ్‌కుమార్‌, కందుల సతీష్‌, కొక్కిరాల శ్రీనివాసరావు, ముస్తాఫా పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2025 | 11:53 PM