మెడికల్ బోర్డు లోపాలను సరిచేయాలి
ABN , Publish Date - Aug 16 , 2025 | 11:51 PM
మెడికల్ బోర్డులో జరిగిన అవకతవకలను సరిచేసి అనారోగ్యంతో ఉన్న వాళ్లను అన్‌ఫిట్ చేయాలని గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం(ఐఎఫ్‌టీయూ) డిమాండ్ చేస్తూ శనివారం యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈ నరేష్ ఆర్‌జీ-1 జీఎంకు వినతి పత్రం అందజేశారు.
గోదావరిఖని, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): మెడికల్ బోర్డులో జరిగిన అవకతవకలను సరిచేసి అనారోగ్యంతో ఉన్న వాళ్లను అన్‌ఫిట్ చేయాలని గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం(ఐఎఫ్‌టీయూ) డిమాండ్ చేస్తూ శనివారం యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈ నరేష్ ఆర్‌జీ-1 జీఎంకు వినతి పత్రం అందజేశారు. నరేష్ మాట్లాడుతూ 55 మంది కార్మికులు దీర్ఘకాలిక జబ్బులతో కంపెనీ హాస్పిటల్‌లో వైద్యం తీసుకుంటూ నిత్యం మందులతో జీవితం గడుపుతున్నారని, జూలై 31న మెడికల్ బోర్డుకు హాజరైన వారిలో 5గురిని అన్‌ఫిట్ చేసి మిగిలిన వారిని తిరస్కరించారన్నారు. బోర్డు ఫిట్ చేసిన వారిలో గుండె జబ్బులు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, పక్షవాతం తదితర అనేక రకాలైన జబ్బులతో విధులకు హాజరుకాలేని కార్మికులను సైతం విధులకు హాజరు కావాలని చెప్పడం మానవత్వానికి వ్యతి రేకమైనదన్నారు.
కార్మికులను కుదించాలనే యాజమాన్యం కుట్రలో భాగంగా కార్మికులను మానసిక, శారీరక వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసిన వారిలో 32మందిని ఫిట్ చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకొందని, అందులో 17మందిని తమ డిసిగ్నేషన్లకు అన్‌ఫిట్ చేసి తక్కువ స్థాయి డిజైనేషన్‌కు మార్చారని, ఇది కంపెనీ అమలులో ఉన్న ఒప్పందాల ప్రకారం సూటబుల్ జాబ్ ఇవ్వాల్సి ఉండగా సూపర్వైజర్లను జనరల్ మజ్దూర్లుగా ఫిట్ చేయడం గత ఒప్పందాలకు వ్యతిరేకమైనదన్నారు. జూలై 31 నాటి బోర్డు నిర్ణయాన్ని పునః పరిశీలన చేయాలని, వివిధ రకాల జబ్బులతో డ్యూటీ చేయలేక సర్వీస్ నుంచి అన్‌ఫిట్ చేయాలని, దరఖాస్తు చేసిన కార్మికులందరిని అన్‌ఫిట్ చేసి వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఐఎఫ్‌టీయూ నాయకులు ఈదునూరి రామకృష్ణ, నాయకులు ఐ రాజేశం, ఎస్ ప్రసాద్, పీ మొండయ్య, ఏ చంద్రయ్య, గుండేటి మల్లేశం, చింతల శేఖర్, ఎన్‌సీ బాబు, అవినాష్ పాల్గొన్నారు.