ఎరువు.. బరువు..
ABN , Publish Date - Oct 26 , 2025 | 12:15 AM
ఖరీఫ్ సాగులో ఎరువుల కొరతతో అష్టకష్టాలు పడ్డ రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులకు యాసంగి సీజన్‌పై ఆందోళన మొదలైంది. వ్యవసాయంలో పెట్టుబడుల భారం రోజురోజుకు పెరుగుతుండడంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు యాసంగి ఆరంభంలోనే పెరుగుతున్న ఎరువుల ధరలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
ఖరీఫ్ సాగులో ఎరువుల కొరతతో అష్టకష్టాలు పడ్డ రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులకు యాసంగి సీజన్‌పై ఆందోళన మొదలైంది. వ్యవసాయంలో పెట్టుబడుల భారం రోజురోజుకు పెరుగుతుండడంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు యాసంగి ఆరంభంలోనే పెరుగుతున్న ఎరువుల ధరలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత యాసంగిలో 1.82 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో వరి ప్రధాన పంటగా 1.78 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఇందుకోసం 42733 మెట్రిక్ టన్నుల ఎరువులు ఉపయోగిస్తారు.
యూరియా మినహా అన్నీ..
యూరియా మినహా అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పెరుగుదలపై డీలర్లకు కంపెనీలు సమాచారం ఇచ్చాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులకు యాసంగి భారం ముందే మొదలైనట్లుగా భావిస్తున్నారు. డీఏపీ ధర ప్రస్తుతం పాత ధర 50 కిలోల బస్తాకు రూ 1350 అలాగే ఉంది. మిగతా ఎరువుల బస్తాలపై రూ 25 నుంచి రూ 100 వరకు పెరిగాయి. 20:20:13 ప్రస్తుతం రూ 1350 నుంచి రూ 1400లకు చేరింది.14:35:14 ప్రస్తుతం రూ 1850 నుంచి రూ 1900లకు, 20:20:13 ప్రస్తుతం రూ 1350 నుంచి రూ 1400లకు చేరింది. 10:26:26 ప్రస్తుతం రూ.1800 నుంచి రూ 1825లకు, 20:20:0.13 ప్రస్తుతం రూ 1300 నుంచి రూ 1375లకు, 24:24:00 ప్రస్తుతం రూ 1800 నుంచి రూ 1900లకు, 16:16:0 ప్రస్తుతం రూ.1600 నుంచి రూ 11650లకు, 28:28:0 ప్రస్తుతం రూ 1800 ఉంది. యాసంగిలో కాంప్లెక్స్ ఎరువుల వినియోగం ఎక్కువగానే ఉంటుంది. దీంతో రైతులకు అదనంగా ఆరు కోట్ల వరకు భారం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం డీలర్ల వద్ద పాత నిల్వలు ఉండడంతో గతంలో ఉన్న ధరలకే విక్రయిస్తున్నారు యాసంగిలో వినియోగించే ఎరువులకు మాత్రం పెరిగిన ధరలతోనే వస్తాయని కంపెనీలు చెబుతున్నాయి. ముడి సరుకుల ధరలు పెరగడంతోనే ఎరువులపై పడ్డ భారం రైతులు మోయాల్సి వస్తుంది.
యాసంగి సాగునీటికి డోకా లేదు..
అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలకు జలకళ తెచ్చాయి. భూగర్భ జలాలు పెరిగి బోరు బావుల్లో సమృద్ధిగా నీళ్లు చేరాయి. దీంతో రైతులు యాసంగిలో వరి సాగును పెంచుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 791.9 మిల్లీమీటర్లకు 872.7మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో 13 మండలాలు ఉండగా ప్రస్తుతం 9 మండలాల్లో సాధారణ వర్షపాతం ఉండగా ఇల్లంతకుంట, ముస్తాబాద్, గంభీరావుపేట, కోనరావుపేట మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది, దీంతో యాసంగి పంటలకు సాగునీటి డోకా లేదని రైతులు ఆశాభావంతో ఉన్న ఉన్నారు.