సీపీఐ శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయండి
ABN , Publish Date - Nov 04 , 2025 | 11:05 PM
పేద ప్రజల కోసం, స్వాతంత్య్ర సాధన కోసం పోరాడిన భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) డిసెంబర్ 26న శత వసంతాల సందర్భంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని ఆ పార్టీ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు.
గోదావరిఖని, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): పేద ప్రజల కోసం, స్వాతంత్య్ర సాధన కోసం పోరాడిన భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) డిసెంబర్ 26న శత వసంతాల సందర్భంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని ఆ పార్టీ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశం కే కనకరాజు అధ్యక్షతన గోదావరిఖని భాస్కరరావు భవన్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా చాడ వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు కలవేన శంకర్ హాజరై మాట్లాడారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదిలాబాద్ జోడేఘాట్ నుంచి జీపుజాతా ప్రారంభమై రాష్ట్రమంతా నిర్వహిస్తామన్నారు. ఈనెల 16న గోదావరిఖని, పెద్దపల్లి, సుల్తానాబాద్ ప్రాంతాలకు వస్తుం దని, పార్టీ కార్యకర్తలు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో నిధులను అదానీ, అంబానీల జేబు సంస్థలుగా మారుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని వారన్నారు. బీహార్ ఎన్నికలు దేశ రాజకీయ ఒక చిత్రాన్ని మారుస్తాయని అభిప్రాయపడ్డారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్, గోషిక మోహన్, నాయకులు కడారి సునీల్, తాళ్లపల్లి మల్లయ్య, మడ్డి ఎల్లయ్య, సూర్య, తాళ్లపల్లి లక్ష్మణ్, వైవీ రావు, మాటేటి శంకర్, రామచందర్, రవీందర్, ఆరేపల్లి మానస్ కుమార్, లెనిన్, ప్రీతం, కల్లెపల్లి నవీన్, చంద్రశేఖర్, పాల్గొన్నారు.