లక్కు కిక్కు ఎవరికో !
ABN , Publish Date - Oct 26 , 2025 | 11:47 PM
జిల్లాలో గల మద్యం షాపులకు లైసెన్స్‌దారులను ఎంపిక చేసేందుకు సోమవారం డ్రా తీయనున్నారు. ఈ మేరకు జిల్లా ఎక్సైజ్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బంధంపల్లిలో గల స్వరూప గార్డెన్‌లో ఉదయం 11 గంటలకు డ్రా తీయనున్నారు.
పెద్దపల్లి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గల మద్యం షాపులకు లైసెన్స్‌దారులను ఎంపిక చేసేందుకు సోమవారం డ్రా తీయనున్నారు. ఈ మేరకు జిల్లా ఎక్సైజ్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బంధంపల్లిలో గల స్వరూప గార్డెన్‌లో ఉదయం 11 గంటలకు డ్రా తీయనున్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష సెలవులో ఉండడంతో జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ సమక్షంలో డ్రా తీయనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి 2027 నవంబర్ 30వ తేదీ వరకు రెండు సంవత్సరాలకుగాను మద్యం షాపులను వ్యాపారులకు అప్పగించేందుకు సెప్టెంబర్ 26వ తేదీన ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. అందులో భాగంగా జిల్లాలో గల 74 మద్యం షాపులకు ఈనెల 23వ తేదీ గడువు ముగిసే వరకు 1507 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో షాపునకు 12కు తగ్గ కుండా 49 వరకు అత్యధికంగా దరఖాస్తులు రావడం గమనార్హం. పెద్దపల్లి సర్కిల్ పరిధిలోని 20 మద్యం షాపులకు 442 దరఖాస్తులు, సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలో 15 మద్యం షాపులకు 305 దరఖాస్తులు, రామగుండం సర్కిల్ పరిధిలో 24 మద్యం షాపులకు 474 దరఖాస్తులు, మంథని సర్కిల్ పరిధిలో 15 షాపులకు 286 దరఖాస్తులు వచ్చాయి. షాపుల వారిగా వచ్చిన దరఖాస్తుదారుల పేర్లను సీరియల్ జాబితాలో రాసి టోకెన్లను స్టీల్ డబ్బాలో వేసి డ్రా తీసి లైసెన్స్‌దారులను ఎంపిక చేయనున్నారు. దరఖాస్తుల రూపేనా ప్రభుత్వానికి 45 కోట్ల 21 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. గతంతో పోలిస్తే 515 దరఖాస్తులు తక్కువ కాగా, దరఖాస్తుల రుసుము ప్రభుత్వం 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలకు పెంచడంతో 4 కోట్ల 77 లక్షల రూపా యల ఆదాయం అదనంగా వచ్చింది. డ్రా ద్వారా ఎంపికయ్యే లైసెన్స్ దారులు అదే రోజున లైసెన్స్ ఫీజులో ఆరవ వంతు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. డ్రా కార్యక్రమానికి అరగంట ముందే దరఖాస్తుదారులందరూ స్వరూప గార్డెన్ కు చేరుకోవాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డి తెలిపారు.